త‌క్ష‌ణ రుణం కోసం చూస్తున్నారా? అయితే ఈ 6 విధానాల‌ను ప‌రిశీలించండి..

సాంప్రదాయ బ్యాంకు రుణాలతో పోల్చినట్లైతే, కనీస పత్రాలను సమర్పించడం ద్వారా వ్యక్తిగత రుణాలు సులభంగా పొందవచ్చు

Published : 26 Apr 2021 15:06 IST

హాలిడే ట్రిప్ కు వెళ్ళడానికి లేదా మీ పాత ల్యాప్ టాప్ ను కొత్త ల్యాప్ టాప్ తో అప్ డేట్ చేసుకోవడానికి లేదా చాలా కాలం పాటు బకాయి ఉన్న క్రెడిట్ కార్డు బిల్లులను చెల్లించడానికి,  స్వల్పకాలిక రుణాల కోసం అన్వేషిస్తున్నారా? అలాంటి వారి అవసరాలను తీర్చడానికి వ్యక్తిగత రుణాలు సరైనవి. సాధారణంగా ఇవి ఒక సంవత్సరం కంటే తక్కువ కాలవ్యవధితో లభిస్తాయి. దీనికి వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పటికీ, చెల్లింపుల కాల వ్యవధి తక్కువగా ఉంటుంది. సాంప్రదాయ బ్యాంకు రుణాలతో పోల్చినట్లైతే, కనీస పత్రాలను సమర్పించడం ద్వారా వ్యక్తిగత రుణాలు సులభంగా పొందవచ్చు.

మీరు భారతదేశంలో పొందగలిగే స్వల్పకాలిక రుణ రకాల గురించి కింద తెలుసుకుందాం :

1. వ్యక్తిగత రుణాలు :
బ్యాంకులు ఇచ్చే స్వల్ప కాలిక రుణాలలో వ్యక్తిగత రుణాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. బ్యాంకులు రూ. 30వేల‌ నుంచి ప్రారంభించి వ్యక్తిగత రుణాలను అందిస్తున్నారు. ఇత‌ర రుణాల‌తో పోలిస్తే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. రుణం తీసుకునే వ్య‌క్తి జీతం ప్రకారం, వ్యక్తిగత రుణం తాలూకా సమానమైన నెలవారీ వాయిదాలను(ఈఎంఐ)లను లెక్కిస్తారు, తద్వారా రుణ గ్రహీతలు ప్ర‌తీ నెల‌ సులువుగా రుణం తిరిగి చెల్లించ‌వ‌చ్చు. వడ్డీ రేట్లు 15 నుంచి 25 శాతం వరకు ఉండచ్చు.

2. పేడే రుణాలు :
ఇటీవలి కాలంలో మనదేశంలో పేడే రుణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. సాధారణంగా దీని ద్వారా అందించే రుణ మొత్తం వ్యక్తిగత రుణ మొత్తం కంటే తక్కువగా ఉంటుంది, కానీ తక్షణమే డబ్బు రుణగ్రహీతకు అందుబాటులో ఉంటుంది. రుణం పొందేందుకు శాలరీ స్లిప్, పాన్ నెంబర్, బ్యాంకు అకౌంట్ నెంబర్ తో పాటు మరికొన్ని ఇతర వివరాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. పత్రాలను అప్ లోడ్ చేసిన కొన్ని గంటలలో లేదా ఒక రోజులోనే రుణగ్రహీత బ్యాంకు అకౌంట్‌కి డబ్బు జమ అవుతుంది. సులువైన దరఖాస్తు ప్రక్రియ, తక్షణ రుణ ఆమోదం కారణంగా యువత ఎక్కువగా పేడే రుణాల వైపు మొగ్గు చూపుతున్నారు. మనీ టాప్, రూపీ లెండ్ లాంటి ప్రైవేట్ వెబ్సైట్లు ఈ రుణాలను అందిస్తాయి. వడ్డీ రేట్లు ఒక్కోసారి రోజుకి 1 శాతం వరకు కూడా ఉండొచ్చు.

3. బ్రిడ్జ్ రుణాలు :
బ్రిడ్జ్ రుణాలు లేదా స్వింగ్ రుణాలు మీ తక్షణ నగదు అవసరాలను తీర్చడానికి ఉద్దేశించిన స్వల్పకాలిక రుణాలు. దీనిని “గ్యాప్-ఫైనాన్సింగ్” అని కూడా పిలుస్తారు, ఎవరికైతే డబ్బు అవసరం అవుతుందో, అలాంటి వారు బ్రిడ్జ్ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక ఆస్తిని కొనుగోలు చేయడానికి దీర్ఘకాల గృహ రుణం కోసం వేచి చూస్తూ, సదరు ఆస్తికి డౌన్ పేమెంట్ చెల్లించడానికి నగదు అవసరమైతే, అలాంటి వారు బ్రిడ్జ్ రుణాలను ఒక ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. అయితే సాంప్రదాయ రుణాలతో పోలిస్తే, రుణ ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేట్లు(సాధారణంగా 12 నుంచి 15 శాతం) ఎక్కువగా ఉంటాయి.

4. క్రెడిట్ కార్డు ఆధారంగా రుణాలు :
ఒకవేళ మీరు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తున్నట్లయితే, దానిపై ముందుగా ఆమోదం పొందిన స్వల్ప కాలిక రుణాన్ని పొందవచ్చు. మీ క్రెడిట్ కార్డు చరిత్ర, క్రెడిట్ పరిమితి ఆధారంగా, అనేక బ్యాంకులు ఈ రకమైన రుణాన్ని అందిస్తాయి. దీనికి ప్రాసెసింగ్ ఫీజు రూ. 500 నుంచి మొదలవుతుంది. అలాగే, వడ్డీ రేటు 36-40 శాతం మధ్య ఉంటుంది. ఇది ఒక్కో బ్యాంకుకు ఒక్కో మాదిరిగా ఉంటుంది. అదే విధంగా తిరిగి చెల్లించే కాల వ్యవధి మూడు నెలల నుంచి 24 నెలల వరకు ఉంటుంది.

5. పీపీఎఫ్ ఖాతా ఆధారంగా రుణాలు :
పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా ఆధారంగా కూడా స్వల్పకాలిక రుణాలు లభిస్తాయి, అయితే, పీపీఎఫ్ ఖాతాను తెరచిన మూడవ సంవత్సరాల తర్వాత నుంచి మాత్రమే రుణం పొందే అవకాశం ఉంటుంది. రుణం పొందాలనుకుంటున్న వారు తమ పీపీఎఫ్ ఖాతా పాస్ బుక్ తో పాటు ఫారం డీ ని సమర్పించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాలోని మొత్తం నుంచి కేవలం 25 శాతం వరకు మొత్తాన్ని మాత్రమే రుణంగా పొందే అవకాశం ఉంటుంది. ఖాతాను తెరిచిన ఆరవ సంవత్సరం వరకు మాత్రమే రుణం పొందే అవకాశం ఉంటుంది. అలాగే తిరిగి చెల్లించే కాలపరిమితి గరిష్టంగా మూడు సంవత్సరాలు ఉంటుంది. దీని వడ్డీ రేటు సుమారుగా 10 శాతం గా ఉంది.

6. డిమాండ్ రుణాలు:
అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో డిమాండ్ రుణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. బీమా పాలసీలు, జాతీయ పొదుపు సర్టిఫికేట్లు (ఎన్ఎస్సీలు) వంటి చిన్న పొదుపు సాధనాల ఆధారంగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు రుణాలను అందిస్తున్నాయి. రుణ మొత్తం అనేది పొదుపు సాధనాల మెచ్యూరిటీ విలువపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా బ్యాంకులు మీ పొదుపు విలువలో 70 శాతం నుంచి 90 శాతం వరకు రుణాలను అందిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని