Indra Nooyi: ‘జీతం పెంచమని ఎన్నడూ అడగలేదు.. పెంచినా వద్దన్నాను..’

తన కెరీర్‌లో జీతం పెంచమని ఎన్నడూ ఎవర్నీ అడగలేదని అన్నారు పెప్సీకో సంస్థ మాజీ సీఈవో ఇంద్రా నూయీ. ఒకానొక సమయంలో సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు

Published : 07 Oct 2021 17:53 IST

వాషింగ్టన్‌: తన కెరీర్‌లో జీతం పెంచమని ఎన్నడూ ఎవర్నీ అడగలేదని అన్నారు పెప్సీకో సంస్థ మాజీ సీఈవో ఇంద్రా నూయీ. ఒకానొక సమయంలో సంస్థ కష్టాల్లో ఉన్నప్పుడు తనకు జీతం పెంచినా దాన్ని తిరస్కరించినట్లు తెలిపారు. తాజాగా ఆమె న్యూయార్క్‌ టైమ్స్‌ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన వృత్తి జీవితం గురించి పలు విషయాలను పంచుకున్నారు. 

‘‘ఒకరి దగ్గర పనిచేస్తూ జీతం సరిపోవడం లేదని నేను చెప్పలేను. నాకెందుకో అది ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నాకు ఎక్కువ జీతం ఇవ్వండి అని నేను ఏనాడూ బోర్డును కోరలేదు. నిజానికి ఒక సంవత్సరం బోర్డు వాళ్లు నా వేతనం పెంచారు. కానీ, నేను వద్దన్నాను. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు జీతం పెంచడం సరికాదని చెప్పాను. ఈ విషయంపై నా భర్తతో కూడా తరచూ చర్చిస్తాను. కానీ ఆయన ఒకే మాట అంటారు. మనం అనుకున్నదానికంటే ఎక్కువే సంపాదించాం కదా.. దాని గురించి మర్చిపో అని ఆయన అనేవారు’’ అంటూ ఇంద్రానూయీ చెప్పుకొచ్చారు. 

12 ఏళ్లపాటు పెప్సికోకు సీఈవోగా సేవలందించిన ఇంద్రా నూయీ 2018లో ఆ పదవి నుంచి దిగిపోయారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఒకరిగా గుర్తింపు సాధించారు. ప్రస్తుతం ఆమె అమెజాన్‌ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌మండలిలో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని