Stock Market: మళ్లీ 18,000 మార్క్‌ను అందుకున్న నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం ఆద్యంతం లాభాల్లో పయనించాయి....

Updated : 10 Jan 2022 15:56 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం ఆద్యంతం లాభాల్లో పయనించాయి. ఉదయం సానుకూలంగా ప్రారంభమైన సూచీలు రోజంతా అదే జోరును కొనసాగించాయి. నిఫ్టీ గత ఏడాది నవంబరు 17 తర్వాత తొలిసారి 18,000 మార్క్‌ను టచ్‌ చేసింది. 

సూచీల పయనం సాగిందిలా..

ఉదయం సెన్సెక్స్‌ 60,070.39 పాయింట్ల వద్ద బలంగా ప్రారంభమైంది. అక్కడి నుంచి కొనుగోళ్ల మద్దతుతో 60,427.36 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఏ దశలోనూ అమ్మకాల ఒత్తిడి కనపడకపోవడం విశేషం. చివరకు 650.98 పాయింట్ల లాభంతో 60,395.63 వద్ద ముగిసింది. నిఫ్టీ 17,913.30 వద్ద సానుకూలంగా ప్రారంభమై.. 18,017.45 - 17,879.15 మధ్య కదలాడింది. చివరకు 190.60 పాయింట్లు లాభపడి 18,003.30 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.04 వద్ద నిలిచింది.

నిఫ్టీ50 సూచీలో లాభపడిన / నష్టపోయిన షేర్లు

అంతర్జాతీయ మార్కెట్లకు భిన్నంగా...

అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ సానుకూలతలు సూచీలను ముందుకు నడిపించాయి. మరోవైపు కరోనా కేసులు విజృంభిస్తున్నప్పటికీ.. ఇప్పటి వరకు ఎలాంటి కఠిన ఆంక్షలు ప్రకటించకపోవడం, పైగా నేడు వ్యాక్సిన్‌ బూస్టర్ డోసులు ప్రారంభం కావడం సూచీలపై సానుకూల ప్రభావం చూపింది. ఇక కేంద్ర బడ్జెట్‌పై సానుకూల ఊహాగానాలూ మార్కెట్లకు దన్నుగా నిలుస్తున్నాయి. అలాగే మూడో త్రైమాసికం ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. రిజల్ట్స్‌పై సానుకూల అంచనాలూ మదుపర్లలో విశ్వాసం నింపుతున్నాయి. క్రిప్టోకరెన్సీలు బలహీనంగా ట్రేడవుతుండడమూ సూచీలకు కలిసి వస్తోంది. వీటితో పాటు ఈరోజు టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌, ఎస్‌బీఐ వంటి దిగ్గజ షేర్లు రాణించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే నేడు సూచీలు భారీ లాభాలను ఆర్జించాయి.  

మార్కెట్‌లోని మరిన్ని సంగతులు..

* సూర్యోదయ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ షేర్లు ఇంట్రాడేలో 5.5 శాతం వరకు లాభపడ్డాయి. మూడో త్రైమాసికంలో బ్యాంకు రుణాలలో 5 శాతం వృద్ధి నమోదు చేసింది. గ్రాస్‌ అడ్వాన్సెస్‌ 11 శాతం ఎగబాకాయి. డిపాజిట్లలో 1 శాతం వృద్ధి నమోదైంది.

* సిటీ గ్రూప్‌, ఇండియా రేటింగ్స్ అండ్‌ రీసెర్చి భారత జీడీపీ అంచనాలను తగ్గించాయి. 

* అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేర్లు మూడు వారాల కనిష్ఠానికి పడిపోయాయి. కొవిడ్‌ విజృంభణ కారణంగా స్వల్పకాలంలో వినియోగం తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు దెబ్బతీశాయి.  

* యాక్సిస్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్‌ షేర్లు వరుసగా ఏడో రోజూ లాభపడ్డాయి.   

* పదేళ్ల కాలపరిమితి కలిగిన భారత బాండ్ల రాబడులు రెండేళ్ల గరిష్ఠానికి చేరడం విశేషం.

* షేర్ల బైబ్యాక్‌పై జనవరి 12న సమావేశం కానున్నట్లు టీసీఎస్‌ ప్రకటించడంతో కంపెనీ షేర్లు ఈరోజు ట్రేడింగ్‌లో 3 శాతం వరకు లాభపడ్డాయి.

* జేబీఎం గ్రీన్‌ ఎనర్జీలో జేబీఎం ఆటో 51 శాతం వాటాలను సొంతం చేసుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది.

* పేటీఎం షేర్లు నేడు 2 శాతం కుంగి ఏడాది కనిష్ఠానికి చేరాయి. రానున్న రోజుల్లో కంపెనీ ఆర్థిక ఫలితాలు బలహీనంగా నమోదయ్యే అవకాశం ఉందని మక్వైర్‌ సెక్యూరిటీస్ ఇండియా అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు