ప్ర‌వాసులు మెచ్చే ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలు!

స్వ‌ల్ప‌ ప‌రిమితులు, ష‌ర‌తులతో సొమ్మును విదేశాల్లో వినియోగించాలంటే ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా ఉండాల్సిందే.

Updated : 23 Dec 2020 17:26 IST

ఎన్.ఆర్‌.ఓ ఖాతా గురించి తెలుసుకున్న‌వాళ్లు, నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ (ఎన్‌.ఆర్‌.ఈ) ఖాతా విశేషాలేంటో కూడా చూడండి. ఈ రెంటికీ ఉన్న పోలిక‌లు, తేడాలు తెలుసుకోవ‌డం ప్ర‌వాస భార‌తీయుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది.

ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాను ఎవ‌రు తెర‌వ‌వ‌చ్చు?

  • భార‌తీయ మూలాలున్న వ్య‌క్తులు లేదా ఫెమా చ‌ట్టం ద్వారా ప్ర‌వాస భార‌తీయులుగా గుర్తింపు పొందిన వారే ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా తెరిచేందుకు అర్హ‌లు.
  • ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా మాదిరిగా కాకుండా నాన్ రెసిడెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ ఖాతాల‌ను కేవ‌లం ఫెమా చ‌ట్టం ద్వారా ప్ర‌వాస భార‌తీయుడిగా గుర్తింపు పొందాకే తెరిచేందుకు వీల‌వుతుంది.
  • ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా స్వ‌యంగా ఖాతాదారు మాత్ర‌మే తెర‌వాలి. ఖాతాదారు పేరిట ప‌వ‌ర్ ఆప్ అటార్నీ హోల్డ‌ర్ తెరిచేందుకు వీలుప‌డ‌దు.
  • ఒక‌టి కంటే ఎక్కువ ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాల‌ను తెరవవచ్చు.
  • వేరొక ప్ర‌వాస భార‌తీయుడితో క‌లిసి ఉమ్మ‌డి ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా తెర‌వ‌వ‌చ్చు. అయితే స్థానిక భార‌తీయుల‌తో క‌లిసి ఈ ఖాతాను ఉమ్మ‌డిగా తెరిచేందుకు వీల్లేదు.
  • పాకిస్థాన్‌, బంగ్లాదేశ్ దేశాల‌కు చెందిన పౌరులు ఇలాంటి ఖాతాలు తెరిచేందుకు అన‌ర్హులు.

భార‌త రూపాయ‌ల్లోనే…

  • ఒక ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలోని సొమ్మును ఇతర ఎన్ఆర్ఈ ఖాతాలకు ఎలాంటి ప‌రిమితులు లేకుండా బ‌దిలీ చేసుకునేందుకు వీల‌వుతుంది.
  • ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాల మాదిరే ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలు సైతం పొదుపు, క‌రెంట్‌, ఫిక్స్‌డ్, రిక‌రింగ్ డిపాజిట్ల రూపంలో తెర‌వ‌వ‌చ్చు.
  • ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా భార‌త క‌రెన్సీ (రూపాయి)డినామినేష‌న్ల‌లో మాత్ర‌మే తెరిచేందుకు వీల‌వుతుంది.
  • విదేశాల నుంచి తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చి స్థిరపడితే ఆ విషయం మీ బ్యాంకుకు తెలియ‌జేయ‌డం మంచిది. వారు మీ ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాను సాధార‌ణ రెసిడెంట్ ఖాతాగా మారుస్తారు. బ్యాంకింగ్‌, ట్యాక్సేష‌న్ త‌దిత‌రాలు మ‌న దేశ పౌరులకు అన్వ‌యించే విధంగా మార్పులు చేస్తారు.

ఎలాంటి లావాదేవీల‌కు అనుమ‌తి ?

  • ఎన్.ఆర్‌.ఈ ఖాతాను విదేశంలో సాధార‌ణ బ్యాంకు ఖాతాగా ప‌రిగ‌ణిస్తారు. ఈ ఖాతాలోని న‌గ‌దును ఎలాంటి ష‌ర‌తులు లేకుండా విదేశాలలో ఉన్న బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసే వీలుంది. అయితే ఖాతాలో న‌గ‌దు ఆర్‌.బీ.ఐ నిర్దేశించిన పరిధి మేరకు మాత్రమే జమ చేసే వీలుంటుంది.

  • ఇత‌ర దేశాల నుంచి ఏ క‌రెన్సీ న‌గ‌దు అయినా ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు. విదేశాల్లో అందుకునే చెక్కులను ఈ ఖాతాల్లో వేయ‌వ‌చ్చు. డిమాండ్ డ్రాఫ్ట్‌లు, ట్రావెల‌ర్ చెక్కుల వంటివి బ‌య‌టి దేశాల్లో జారీ అయితే వాటిని కూడా ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలో జమ చేసుకోవచ్చు.

  • ప్ర‌భుత్వ బాండ్లు, భార‌తీయ కంపెనీల్లోని షేర్లు, బాండ్ల అమ్మ‌కం ద్వారా వ‌చ్చే లాభాన్ని లేదా వాటిపై జ‌మ అయ్యే రాబ‌డిని ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాల‌కు మ‌ళ్లించుకునేందుకు అవ‌కాశం ఉంది.

  • స్వ‌దేశం నుంచి విదేశానికి లేదా విదేశం నుంచి స్వ‌దేశానికి సొమ్ము త‌ర‌లించే వీలున్న స‌దుపాయం (రీపాట్రియేష‌న్‌) ద్వారా పెట్టుబ‌డి సొమ్ముపై వ‌చ్చే ఆదాయాన్ని ఇత‌ర దేశాల‌కు త‌ర‌లించే వీలుంది. అంటే ఇక్క‌డ మ‌న ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాకు జ‌మ‌చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

  • ఇలా రీపాట్రియేష‌న్ విధానం కేవలం ఎన్‌.ఆర్‌.ఈ లేదా ఫారిన్ క‌రెన్సీ నాన్ రెసిడెంట్ (ఎఫ్‌.సి.ఎన్‌.ఆర్‌) ఖాతాల ద్వారానే సాధ్య‌మ‌వుతుంది.

  • భార‌త దేశ సంద‌ర్శ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఏ ర‌క‌మైన విదేశీ క‌రెన్సీనైనా ఖాతాలో జ‌మ‌చేయ‌వ‌చ్చు. ఫెమా చ‌ట్టం కింద నాన్ రెసిడెంట్‌గా గుర్తింపు పొందిన‌వారు విదేవీ క‌రెన్సీ డిక్ల‌రేష‌న్ ఫామ్‌ను బ్యాంకులో స‌మ‌ర్పించి విదేశీ క‌రెన్సీలో ఉన్న న‌గ‌దును జ‌మ‌చేసేందుకు వీలుంది.

  • ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలోని సొమ్మును ఉప‌యోగించి భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వీలుంది. ఇందులోని సొమ్మును రీపాట్రియేష‌న్ విధానంలో త‌ర‌లించే వీలుంది లేదా విదేశాల్లో చెల్లింపులు చేయ‌వ‌చ్చు.

  • గృహరుణ వాయిదాల‌ను చెల్లించ‌వ‌చ్చు. ఈ ఖాతాలోని సొమ్మును హామీగా చూపించి మ‌న‌దేశంలో, ఇత‌ర దేశాల్లో రుణ సౌక‌ర్యం పొందేందుకు అవ‌కాశాలున్నాయి.

ఎన్‌.ఆర్‌.ఓ — ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాల మ‌ధ్య న‌గ‌దు బ‌దిలీ

  • ఎన్.ఆర్‌.ఈ ఖాతా నుంచి ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాకు న‌గ‌దును ఎలాంటి ప‌రిమితులు లేకుండా బ‌దిలీ చేయ‌వ‌చ్చు.
  • ఎన్‌.ఆర్‌.ఓ ఖాతా నుంచి ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాలో సొమ్ము జ‌మ‌చేయాలంటే మాత్రం ప‌న్ను వ‌ర్తించేట్ట‌యితే చెల్లించాలి. న‌గ‌దు బ‌దిలీకి చార్ట‌ర్డ్ అకౌంటెంట్ ధ్రువీక‌రించాలి.
  • ఎన్‌.ఆర్‌.ఈ ఖాతా నుంచి ఒక్క‌సారి సొమ్ము ఎన్‌.ఆర్‌.ఓ ఖాతాకు జ‌మ అయితే ఇక రీపాట్రియేష‌న్ సౌల‌భ్యం కోల్పోతాం. అందుకే ఇలా బ‌దిలీ చేసేట‌ప్పుడు ఒక‌టికి రెండుసార్లు ఆలోచించి నిర్ణ‌యం తీసుకోండి.

ఎలాంటి ప‌న్ను లేదు:

  • ఎన్‌.ఆర్‌.ఈ ఖాతాల్లో జ‌మ అయ్యే వ‌డ్డీపై ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం సెక్ష‌న్ 10(4)(ii) కింది ఎలాంటి ప‌న్ను విధించ‌రు.
  • పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉన్నందున బ్యాంకులు మూలం వ‌ద్ద ప‌న్ను కోత విధించ‌రు.
  • ఫెమా చ‌ట్టం ప్ర‌కారం స్థానికుడిగా (రెసిడెంట్‌గా) మారిన‌వారు ప‌న్ను ప‌రిధిలోనికి వ‌స్తారు.

Author:

BALWANT-4.jpg
Balwant Jain
CA, CS and CFPCM.
CS of Bombay Oxygen Corporation Limited.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని