క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించ‌లేదా.. మ‌రి ఇప్పుడు ఏం చేయాలి?

క‌నీస బిల్లు చెల్లించ‌క‌పోవ‌డం కూడా క్రెడిట్ స్కోరుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది.   

Updated : 24 May 2021 18:49 IST

క్రెడిట్ కార్డును ఉప‌యోగించి వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేటప్పుడు, ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత వ‌డ్డీలేని స‌మ‌యం ఉంటుంది. నిర్ణీత స‌మ‌యానికి ముందు మొత్తం బిల్లు చెల్లించ‌క‌పోతే, చెల్లించాల్సిన మొత్తంపై వార్షికంగా 30 శాతం నుంచి 40 శాతం వ‌డ్డీని వ‌సూలు చేస్తాయి కార్డు జారీ సంస్థ‌లు. అంతేకాకుడా తాజా లావాదేవీల‌పై వ‌డ్డీలేని స‌మ‌యాన్ని ర‌ద్దు చేసే అవ‌కాశమూ ఉంది. నిర్ణీత తేదీకి ముందుగా క్రెడిట్ కార్డు  బిల్లు చెల్లించ‌పోతే అనుస‌రించాల్సిన కొన్ని ముఖ్య‌మైన ద‌శ‌ల‌ను ఇప్పుడు తెలుసుకుందాం!

పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా చెప్పిన‌ ప్రకారం, “బాకీ ఉన్న బిల్లు మొత్తం పూర్తిగా చెల్లించేంత‌ వ‌ర‌కూ.. క్రెడిట్ కార్డు ఉప‌యోగించి చేసే కొత్త లావాదేవీల‌కు ఛార్జీలు వ‌ర్తిస్తాయి. క్రెడిట్ కార్డు మొత్తం బిల్లు నుంచి కార్డు జారీదారు నిర్ణయించిన క‌నీస మొత్తాన్ని అయినా నిర్ణీత స‌మ‌యానికి ముందే చెల్లించాలి. ఒక‌వేళ క‌నీస మొత్తాన్ని కూడా చెల్లించ‌పోతే వీటికి అద‌నంగా ఆల‌స్య రుసుము కూడా వ‌ర్తిస్తుంది. కార్డు జారీ చేసిన సంస్థ‌, మొత్తం బిల్లును అనుస‌రించి రూ.1300 వ‌ర‌కూ పెనాల్టీ ఉండే అవ‌కాశం ఉంది. క‌నీస బిల్లు చెల్లించ‌క‌పోవ‌డం అనేది కూడా క్రెడిట్ స్కోరుపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంది.

ఈఎమ్ఐగా మార్చ‌వ‌చ్చు..

స‌మయాని కంటే ముందుగా బిల్లు చెల్లించ‌ని వారు, వారి త‌క్ష‌ణ చెల్లింపు సామ‌ర్థ్యం ఆధారంగా బిల్లు మొత్తం లేదా బిల్లులో కొంత భాగాన్ని ఈక్వేటెడ్ నెలవారీ వాయిదాలు(ఈఎమ్ఐ)కి మార్చుకోవ‌చ్చు. ఇలా మార్చుకున్న ఈఎమ్ఐల‌పై వ‌ర్తించే వ‌డ్డీ రేటు బిల్లు చెల్లించ‌క‌పోవ‌డం వ‌ల్ల విధించే ఛార్జీల కంటే త‌క్కువ‌గానే ఉంటుంది. దీంతో వ‌డ్డీ భారం కాస్త త‌గ్గుతుంది.

ఇలా ఈఎమ్ఐల రూపంలో తిరిగి చెల్లించేందుకు మూడు నెల‌ల నుంచి 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది. ఎంత కాల‌వ్య‌వ‌ధి ఇస్తార‌నేది ఆయా సంస్థ‌లపై ఆధార‌ప‌డి ఉంటుంది.  కార్డుదారులు, వారి చెల్లింపు సామ‌ర్థ్యాన్ని అనుస‌రించి ఈఎమ్ఐల‌కు కాల‌ప‌రిమితిని ఎంచుకోవ‌చ్చు.

ఈఎమ్ఐ మార్పిడి ఆర్థికంగా న‌ష్ట‌పోయిన క్రెడిట్ కార్డుదారుల వ‌డ్డీ వ్య‌యాన్ని త‌గ్గిస్తుంది. కొత్త‌గా చేసే క్రెడిట్ కార్డు లావాదేవీల‌పై ఛార్జీలు ప‌డ‌కుండా కాపాడుతుంది. పెద్ద‌మొత్తంలో ఉన్న క్రెడిట్ కార్డు బిల్లును, చెల్లింపు సామ‌ర్థ్యం ఆధారంగా చిన్న మొత్తాలుగా విభ‌జించి తిరిగి చెల్లించేందుకు ఈ విధానం స‌హాయ‌ప‌డుతుంది. దీంతో క్రెడిట్ స్కోరుపై ప‌డే ప్ర‌తికూల ప్ర‌భావాన్ని నివారించ‌వ‌చ్చు.

మ‌రొక కార్డుకు బ‌దిలీ చేయ‌డం ద్వారా..

క్రెడిట్ కార్డు మొత్తం బిల్లులను రెండు, మూడు నెల‌ల్లో పూర్తిగా చెల్లిస్తామనుకున్న‌ప్పుడు కార్డు బ్యాలెన్స్ బ‌దిలీ విధానాన్ని ఎంచుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డు బ్యాలెన్సును వ‌డ్డీ లేని లేదా త‌క్కువ వ‌డ్డీ రేటుతో నిర్దిష్ట కాలానికి మరొక సంస్థ జారీ చేసిన కొత్త‌ క్రెడిట్ కార్డుకు బ‌దిలీ చేయాలి. దీన్నే ప్ర‌మోష‌న‌ల్ ఇంట్ర‌స్ట్ ఫ్రీ పీరియ‌డ్ అంటారు.  అయితే ఇక్క‌డ గుర్తుంచుకోవాల్సి విష‌యం ఏంటంటే.. ప్ర‌మోష‌న‌ల్ వ‌డ్డీ లేని కాలం పూర్త‌య్యే లోపు బ్యాలెన్స్ మొత్తాన్ని చెల్లించాలి. లేదంటే కొత్త కార్డు జారీదారు కూడా ఛార్జీలను వ‌సూలు చేయ‌డం ప్రారంభిస్తారు.

వ్య‌క్తిగ‌త రుణం..

చెల్లించాల్సిన బిల్లు ఎక్కువగా ఉంటే వ్య‌క్తిగ‌త రుణం తీసుకోవ‌చ్చు. క్రెడిట్ కార్డుతో పోలిస్తే వ్య‌క్తిగ‌త రుణంపై వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. వ్య‌క్తిగ‌త రుణంపై  వార్షిక వ‌డ్డీ రేటు 14 నుంచి 18 శాతం వ‌ర‌కు ఉంటుంది. ఎంత అనేది మీరు తీసుకునే మొత్తం.. మీ ప్రొఫైల్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. కానీ క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతే వ‌ర్తించే వ‌డ్డీరేట్లు 30 శాతం నుంచి 40 శాతం వ‌ర‌కు ఉంటాయి. అందువ‌ల్ల వ్య‌క్తిగ‌త రుణం తీసుకుని బిల్లు చెల్లించ‌డం మేలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని