రూ. 2వేల నోట్లు తగ్గాయ్‌..

కరోనా మహమ్మారి ప్రజల జీవనశైలిని చాలా మార్చేసింది. ఆర్థిక లావాదేవీల విషయాల్లో ఆలోచనాధోరణి కూడా మారింది. కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లు విధించడంతో ఎప్పుడు ఏ అవసరం

Updated : 27 May 2021 17:57 IST

కొవిడ్‌ వేళ పెరిగిన నగదు చలామణీ

ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెల్లడి

ముంబయి: పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రవేశపెట్టిన రూ. 2వేల నోటును క్రమక్రమంగా చలామణీలోంచి వెనక్కి తీసుకునేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే గత రెండేళ్లుగా వీటి ముద్రణ ఆపేసిన కేంద్ర బ్యాంకు.. నోట్ల చలామణీని కూడా తగ్గిస్తూ వస్తోంది. 2018 మార్చి నాటికి 336.3కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీలో ఉండగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఆ సంఖ్య 245.1 కోట్లకు పడిపోయింది. ఈ మేరకు ఆర్‌బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంటే దాదాపు 91.2కోట్ల నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకుందన్నమాట. విలువ పరంగా రూ. 57,757 కోట్ల రూ. 2వేల నోట్లు చలామణీ నుంచి వెళ్లిపోయాయి. 

2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ. 2వేల నోటును కేంద్రం ప్రవేశపెట్టింది. అయితే వ్యవస్థలో పెద్ద నోట్లపై ఆధారపడే అవసరాన్ని తగ్గించి డిజిటల్‌ లావాదేవీలను పెంచాలనే ఉద్దేశంతో ఈ నోట్లను తగ్గించాలని కేంద్ర బ్యాంకు భావించింది. 2018 మార్చి నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి పరిమాణం 3.27శాతం కాగా.. 2021 మార్చి నాటికి అది 2శాతానికి పడిపోయినట్లు ఆర్‌బీఐ తెలిపింది. అలాగే మొత్తం కరెన్సీ విలువలో రూ. 2వేల నోట్ల విలువ 37శాతం నుంచి 17.78శాతానికి తగ్గింది. 

కొవిడ్‌ భయం.. నగదుకే జనం:

కొవిడ్‌ భయాలు.. లాక్‌డౌన్‌ ఆంక్షలతో గత త ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న నగదు బాగా పెరిగిందని భారత రిజర్వు బ్యాంక్‌(ఆర్‌బీఐ) తన వార్షిక నివేదికలో వెల్లడించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న నగదు విలువ పరంగా 16.8శాతం, సంఖ్య పరంగా 7.2 శాతం పెరిగిందని ఆర్‌బీఐ తెలిపింది. ప్రతి ఏడాది సగటు పెరుగుదలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అని పేర్కొంది.ఈ ఏడాది మార్చి 31 నాటికి చలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల మొత్తం కరెన్సీ విలువలో రూ. 500, రూ. 2వేల నోట్ల వాటా 85.7శాతంగా ఉందని ఆర్‌బీఐ నివేదికలో చెప్పింది.  కొవిడ్ మహమ్మారి, ఆంక్షల నేపథ్యంలో నగదు వినియోగం పెరిగిందని, దీంతో బ్యాంకు నోట్లకు డిమాండ్‌ ఎక్కువైనట్లు తెలిపింది. డిమాండ్‌కు అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా కూడా చేపట్టామని, కరెన్సీ చెస్ట్‌ల్లో సరిపడా నిల్వలు ఉండేలా చూసుకున్నామని పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2వేల నోట్లు.. 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, 5, 10, 20 రూపాయల విలువ గల నాణేలు చలామణీలో ఉన్నాయి. సంఖ్య పరంగా మొత్తం చలామణీలో ఉన్న నోట్ల సంఖ్యలో 31.1 శాతం రూ. 500 నోట్లు కాగా.. ఆ తర్వాత 23.6శాతంతో రూ. 10 నోట్లకు ఎక్కువ డిమాండ్‌ ఉన్నట్లు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో చలామణీలో ఉన్న బ్యాంకు నోట్ల సంఖ్య రెట్టింపైనట్లు ఆర్‌బీఐ తెలిపింది. 2009-10 నాటికి 5,654.9కోట్ల కరెన్సీ నోట్లు చలామణీలో ఉండగా.. 2019-20 నాటికి అది 11,597.7కోట్లుకు, ఈ ఏడాది మార్చి 31 నాటికి 12,436.7కోట్లకు పెరిగినట్లు ఆర్‌బీఐ వివరించింది. 

ఇక డిమాండ్‌కు అనుగుణంగా నోట్ల ముద్రణ కూడా చేపట్టినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. జులై 1, 2020 నుంచి మార్చి 31, 2021 వరకు నోట్ల ముద్రణ కోసం రూ. 4,012.1కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. ఇక ఈ ఏడాది నకిలీ నోట్ల విలువ కాస్త తగ్గింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,08,625 నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. 2019-20లో ఇది 2,96,695నోట్లుగా ఉండగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 3,17,384 నకిలి నోట్లను స్వాధీనం చేసుకొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని