Published : 30 Jan 2021 01:05 IST

యూకే రకం కరోనా వైరస్‌పై సత్తా చూపిన నొవావ్యాక్స్‌ టీకా

అమెరికాకు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ నొవావ్యాక్స్‌ ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకా (ఎన్‌వీఎక్స్‌- కోవ్‌2373), యూకే రకం కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తున్నట్లు తేలింది. యూకేలో 15,000 మందికి ఈ టీకా ఇచ్చి పరీక్షించగా, 89.3 శాతం సమర్థత ప్రదర్శించింది. యూకే రకం కరోనా వైరస్‌ సోకిన వారిలోనూ 85.6 శాతం సమర్థత కనబరచినట్లు తేలింది. దక్షిణాఫ్రికా రకం కరోనా వైరస్‌ మీద సైతం 70 శాతం వరకు సామర్థ్యం చూపుతున్నట్లు నిర్థారణ అయింది. దీనిపై యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌, ‘ఇది మనకు శుభవార్త’ అని స్పందించారు. యూకేకు చెందిన వ్యాక్సిన్స్‌ టాస్క్‌ఫోర్స్‌ భాగస్వామ్యంతో నొవావ్యాక్స్‌ ఈ పరీక్షలు నిర్వహించింది. ఈ టీకా పరీక్షల్లో తాను కూడా భాగస్వామి అయ్యాయనని, ఇప్పుడు ఫలితాలు చూసి ఎంతో సంతోషిస్తున్నానని యూకే  మంత్రి నదీమ్‌ జహీవి వివరించారు. నొవావ్యాక్స్‌ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయవచ్చు. ఇతర టీకాల మాదిరిగానే దీన్ని కూడా రెండు డోసులు ఇవ్వాలి.


అస్ట్రజెనేకా
జులై నుంచి కొవిడ్‌-19 టీకాల లభ్యత బాగా పెరుగుతుంది
ఆస్ట్రజెనెకా ఫార్మా ఇండియా అధ్యక్షుడు గగన్‌ సింగ్‌
దిల్లీ:

ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి దేశంలో కొవిడ్‌-19 టీకాల లభ్యత గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ‘పెద్దఎత్తున పరిశోధనలు సాగడంతో పాటు టీకాల తయారీ సామర్థ్యం ఎంతో అధికంగా ఉన్నందున భారతదేశంలో టీకాల లభ్యత బాగా పెరగబోతోంది’ అని ఆస్ట్రజెనెకా ఫార్మా ఇండియా అధ్యక్షుడు గగన్‌ సింగ్‌ తెలిపారు. ఏదైనా మహమ్మారి వ్యాపించినపుడు, దానికి విరుగుడుగా ఆవిష్కరించిన టీకా సమంగా, అందరికీ, తక్కువ ఖర్చులో లభిస్తేనే ప్రయోజనం ఉంటుంది’ అని వివరించారు. ఆస్ట్రజెనెకా 300 కోట్ల డోసుల టీకాను 160 దేశాలకు సరఫరా చేసే ఒప్పందాలు కుదుర్చుకుందని తెలిపారు. కొవిడ్‌-19 టీకా తయారీకి ఆస్ట్రజెనెకా మనదేశానికి చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సీరమ్‌ ఒక్కటే 100 కోట్ల డోసుల టీకా సరఫరా చేస్తోందని ఆయన అన్నారు. తాము ఆవిష్కరించిన కొవిడ్‌-19 టీకా ఎంతో సురక్షితమైనదని, బాగా పనిచేస్తుందని క్లినికల్‌ పరీక్షల్లో నిర్థారణ అయిందన్నారు.


కరోనా పాలసీల ప్రీమియం రూ.1000 కోట్లు
ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ కుంతియా

దిల్లీ: కరోనా ప్రత్యేక పాలసీల కింద దాదాపు 1.28 కోట్ల మంది బీమా తీసుకున్నారని, ఇలా రూ.1000 కోట్ల ప్రీమియం వసూలైందని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌ సుభాశ్‌ చంద్ర కుంతియా వెల్లడించారు. మహమ్మారి సమయంలో కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం విదితమే. శుక్రవారం ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏఐ) వార్షిక సదస్సులో కుంతియా మాట్లాడుతూ.. కరోనా కవచ్‌ పాలసీని 42 లక్షల మంది, కరోనా రక్షక్‌ పాలసీని 5.36 లక్షల మంది తీసుకున్నారని వెల్లడించారు. కొవిడ్‌-19 తర్వాత బీమా అవసరాన్ని ప్రజలు గుర్తించారని, ఇది బీమా సంస్థలకు, ఏజెంట్లకు మంచి అవకాశాన్ని సృష్టిస్తోందన్నారు. ఐబీఏఐ అధ్యక్షుడు సుమిత్‌ బోహ్రా మాట్లాడుతూ.. భారతీయ సాధారణ బీమా రంగం 2019-20లో 10.58 శాతం వృద్ధి నమోదు కాగా, మొత్తం రూ.1.89లక్షల కోట్ల ప్రీమియం వసూలు అయ్యిందన్నారు.


బ్యాంకుల ఆస్తుల నాణ్యతను సమీక్షించాల్సిందే

కరోనా కారణంగా ప్రస్తుతం బ్యాంకులకు ఇస్తున్న సడలింపులను ఉపసంహరించిన వెంటనే ఆస్తుల నాణ్యత సమీక్ష(ఏక్యూఆర్‌) ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని ఆర్థిక సర్వే సూచించింది.  ఈ ఊరటలను బ్యాంకులు తమ పుస్తకాల్లోని ప్రతికూలతలను కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగించుకున్నాయని సర్వే విమర్శించింది. ఆర్థిక వ్యవస్థలోని పెట్టుబడుల నాణ్యతకు ప్రమాదమని హెచ్చరించింది. సర్వే ఇంకా ఏమంటోందంటే..
* 2020 మార్చి చివరకు బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏ) నిష్పత్తి 8.21 శాతంగా ఉండగా.. 2020 సెప్టెంబరు చివరకు 7.49 శాతానికి తగ్గింది. ఆర్‌బీఐ విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఆర్‌) ప్రకారం.. బ్యాంకుల మొండి బకాయిలు 2021 సెప్టెంబరు నాటికి 13.5 శాతానికి పెరగొచ్చు.
* ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌ ఎపుడూ తన సార్వభౌమ రుణ రేటింగ్స్‌లో అతి తక్కువ పెట్టుబడుల రేటింగ్‌(బీబీబీ-/బీఏఏ3)ను పొందలేదు. భారత్‌కు ఇచ్చిన క్రెడిట్‌ రేటింగ్‌లు దేశ మూలాలను ప్రతిబింబించలేదు. రేటింగ్‌ ఏజెన్సీలు మరింత పారదర్శకతతో వ్యవహరించాల్సి ఉంది.


ఎయిరిండియా కొనుగోలుకు టాటాలతో జట్టు లేదు: సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌  

ముంబయి: ఎయిరిండియాను కొనుగోలు చేయడం కోసం బిడ్‌ వేయడానికి టాటా గ్రూప్‌తో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ జట్టు కట్టడం లేదని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో పేర్కొంది. కొద్ది నెలలుగా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి తమ సంయుక్త సంస్థ విస్తారా ద్వారా ఎయిరిండియాకు బిడ్‌ వేయాలని టాటా గ్రూప్‌ భావిస్తూ వస్తోంది. అయితే ఎయిరిండియా పునరుజ్జీవానికి దీర్ఘకాలం పాటు నిధులు సర్దుబాటు చేయాల్సి రావడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదన్న కారణంతో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ తప్పుకుంటోందని ఆ పత్రిక చెబుతోంది. ఈ నేపథ్యంలో టాటాలు సొంతంగా లేదంటే ఎయిరేషియా ఇండియా ద్వారా బిడ్‌ దాఖలు చేయాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని.. వాటిని పరిష్కరించే దిశగా గ్రూప్‌ అడుగులు వేయొచ్చని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది.  


ఫేస్‌బుక్‌, గూగుల్‌, అమెజాన్‌ ఆర్థిక కార్యకలాపాలు

మన చట్టాలకు అనుగుణంగానే ప్రజాప్రయోజనవ్యాజ్యంపై ఆర్‌బీఐ, సెబీ వెల్లడి

దిల్లీ: భారత ఆర్థిక రంగంలోకి వచ్చిన ఫేస్‌బుక్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి సాంకేతిక కంపెనీల ఆర్థిక కార్యకలాపాలన్నిటినీ మన చట్టాల కింద నియంత్రిస్తున్నట్లు దిల్లీ హైకోర్టుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) స్పష్టం చేసింది. అవసరమైన నిబంధనలన్నిటినీ అవి పాటించాకే, దేశీయంగా అనుమతులు ఇచ్చినట్లు వివరించింది. ఇదే తరహాలో సెబీ కూడా అభిప్రాయపడింది. సెక్యూరిటీ మార్కెట్లోకి అడుగుపెట్టే ఏ కంపెనీకైనా తప్పనిసరి రిజిస్ట్రేషన్‌, కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉందని తెలిపింది. సెక్యూరిటీ మార్కెట్‌ డేటా, ఇతరత్రా సమాచారం పొందడానికి సరైన విధానాన్ని సిఫారసు చేయడం కోసం ఇప్పటికే ఒక మార్కెట్‌ డేటా సలహా సంఘాన్ని ఏర్పాటు చేసినట్లూ వివరించింది. ఫేస్‌బుక్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి కంపెనీల కార్యకలాపాలు నియంత్రించడానికి భారత్‌లో ఉన్న చట్టబద్ధ విధానాలు వెల్లడించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాని(పిల్‌)కి సమాధానమిస్తూ ఆర్‌బీఐ, సెబీ పై విధంగా స్పందించాయి.
యూపీఐ అనుమతులు ఎన్‌పీసీఐ ఇస్తుంది: యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ)పై కార్యకలాపాలు నిర్వహించడానికి ఏ కంపెనీకి అయినా నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) నేరుగా అనుమతులు ఇస్తుందని.. అందుకు  నిబంధనలు, మార్గదర్శకాలను ఆ సంస్థే నిర్ణయించిందని ఆర్‌బీఐ తెలిపింది. వాటిని అనుసరించే అమెజాన్‌, గూగుల్‌, వాట్సప్‌లకు థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్లు(టీపీఏపీలు)గా అనుమతులు ఇచ్చినట్లు ఆర్‌బీఐ తన అఫిడవిట్‌లో తెలిపింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని