త‌క్కువ వ‌డ్డీకే `బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్` గృహ రుణాలు

గృహ రుణ ధ‌ర‌ఖాస్తుదారుల‌కు వ‌డ్డీ రేటు ఇపుడు సంవ‌త్స‌రానికి 6.70% నుండి ప్రారంభ‌మ‌వుతుంది.

Published : 14 Oct 2021 13:24 IST

పండుగలని దృష్టిలో ఉంచుకుని గృహ రుణాల వ‌డ్డీ రేట్ల‌ను అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు చాలా వరకు త‌గ్గించాయి. ఇతర రుణాల వడ్డీ రేట్ల తో పోలిస్తే గృహ రుణాల వడ్డీ రేట్లే ఎప్పుడు తక్కువగానే ఉంటాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు వడ్డీ రేట్లు కనిష్ట స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇపుడు `ఎన్‌బీఎఫ్‌సీ` బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్ లిమిటెడ్ గృహ రుణాల‌పై వ‌డ్డీ రేటు త‌గ్గింపును ప్ర‌క‌టించింది. జీతం, వృత్తిప‌ర‌మైన గృహ రుణ ధ‌ర‌ఖాస్తుదారుల‌కు వ‌డ్డీ రేటు ఇపుడు సంవ‌త్స‌రానికి 6.70% నుండి ప్రారంభ‌మ‌వుతుంది. నిబంధ‌న‌లు అనుస‌రించి రూ. 5 కోట్ల వ‌ర‌కు కూడా రుణం పొందొచ్చు. ఈ వడ్డీ రేటు ప్రకారం ప్ర‌తి రూ. ల‌క్ష‌కు `ఈఎమ్ఐ` రూ. 645గా ఉంది. గృహ రుణం తీర్చే కాల‌వ్య‌వ‌ధి అత్య‌ధికంగా 25-30 సంవ‌త్స‌రాలు. మంచి క్రెడిట్ స్కోర్‌, ఆదాయ ప్రొఫైల్ ఉన్న ద‌ర‌ఖాస్తుదారుల‌కు 6.70% వ‌డ్డీ రేటుకే గృహ రుణం పొందే అవ‌కాశం ఉంటుంది.

ఇత‌ర బ్యాంకుల్లో అధిక వడ్డీ కి రుణాన్ని తీసుకున్నవారు  `బ‌జాజ్ ఫిన్‌స‌ర్వ్‌`కు రుణ బ‌దిలీ చేసుకోవ‌డం ద్వారా ఈ కొత్త వ‌డ్డీ రేటు నుండి ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు అని కంపెనీ తెలిపింది. కొత్త వ‌డ్డీని ఆదా చేయ‌డ‌మే కాకుండా, టాప్‌-అప్ లోన్ పొంద‌డానికి వారికి అవ‌కాశ‌ముంది. ఈ గృహ రుణ బ‌దిలీ ప్ర‌క్రియ త్వ‌రగా, ఇబ్బంది లేకుండా, త‌క్కువ డాక్యుమెంటేష‌న్‌తో అయిపోతుంది. ఆస‌క్తి, అర్హులైన వినియోగ‌దారులు వెబ్‌సైట్ (ఆన్‌లైన్‌)లో లేదా, బ్రాంచ్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో  గృహ రుణం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ధ‌ర‌ఖాస్తుదారులు కాంటాక్ట్‌-ఫ్రీ లోన్ అప్లికేష‌న్ నుండి ప్ర‌యోజ‌నం పొందుతారు. ఈ ద‌ర‌ఖాస్తులో చివ‌రి ద‌శ మిన‌హా మొత్తం ప్రాసెసింగ్.. ఫోన్ కాల్ (లేదా) ఈ-మెయిల్ ద్వారా జ‌రిగిపోతుంది.

ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (పీఎమ్ఎవై) ప‌థ‌కం కింద `ఈడబ్ల్యూఎస్‌` `ఎల్ఐజీ` గృహ రుణ‌దార్ల‌కు వ‌డ్డీలో రాయితి క‌ల‌దు. రుణాన్ని తీసుకునేట‌ప్పుడు డాక్యుమెంట్స్ ప్ర‌క్రియ‌లో సంస్థ సిబ్బంది సేవ‌లు ఇంటి వ‌ద్ద కూడా ల‌భిస్తాయి. జీతం తీసుకునే రుణ ద‌ర‌ఖాస్తుదారులు ఉద్యోగం చేసేవారైతే ప‌బ్లిక్‌, ప్రైవేట్, బ‌హుళ‌జాతి కంపెనీల్లో క‌నీసం 3 సంవ‌త్స‌రాల ఉద్యోగ‌ అనుభ‌వంగ‌ల‌వారై ఉండాలి. భార‌తీయ పౌరుడై ఉండాలి (ఎన్నారై లు అన‌ర్హులు). గృహ రుణ అర్హ‌త పొందేవారి వ‌య‌స్సు కూడా 23 సంవ‌త్స‌రాలు దాటి ఉండాలి. రుణం గడువు తీరిపోయే నాటికి గరిష్ట వయస్సు 62 సంవత్సరాలుగా కంపెనీ పరిగణిస్తోంది. దరఖాస్తుదారుడి ఆదాయం.. వయస్సు, నివాస ప్రదేశం ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారు. కనీస ఆదాయం రూ. 30 వేల నుండి రూ. 50 వేల వరకు ఉండాలి. ఏదైనా రుణం తీసుకునే ముందు బ్యాంకు/కంపెనీని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని