Whatsapp Payments: వాట్సాప్‌ పేమెంట్స్‌ ఇకపై కేవలం లావాదేవీ మాత్రమే కాదు!

వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా చెల్లింపులు చేయడం అంటే కేవలం లావాదేవీ మాత్రమే కాదంటోంది ఆ సంస్థ. అందుకనుగుణంగా పేమెంట్స్‌ ఫీచర్‌కు అదనపు హంగులను అద్దింది. ఇకపై లావాదేవీకి బ్యాక్‌గ్రౌండ్‌ కూడా...

Published : 17 Aug 2021 18:07 IST

ఈ కొత్త ఫీచర్‌తో భావాలనూ వ్యక్తపరచవచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ పేమెంట్స్‌ ద్వారా చెల్లింపులు చేయడం అంటే కేవలం లావాదేవీలు జరపడం మాత్రమే కాదంటోంది ఆ సంస్థ. అందుకనుగుణంగా పేమెంట్స్‌ ఫీచర్‌కు అదనపు హంగులను అద్దింది. ఇకపై లావాదేవీకి బ్యాక్‌గ్రౌండ్‌ కూడా జత చేసే వెసులుబాటు కల్పిస్తోంది. ఇది కేవలం భారత యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండటం విశేషం. డబ్బులు పంపే సమయంలో ఇకపై యూజర్లు బ్యాక్‌గ్రౌండ్‌ థీమ్‌ ద్వారా తమ భావాల్ని కూడా వ్యక్తపరచవచ్చని వాట్సప్ అభిప్రాయపడింది. గూగుల్‌ పే పేమెంట్స్‌ బ్యాక్‌గ్రౌండ్‌ తరహాలోనే ఇదీ పనిచేస్తోంది.

వేడుక, ఆత్మీయత, ప్రేమ, సంతోషం.. ఇలా పలు రకాల భావాలను చెల్లింపులు చేసే సమయంలో యూజర్లు వ్యక్తపరచవచ్చని వాట్సాప్ పేమెంట్స్‌ డైరెక్టర్‌ మనేశ్‌ మహాత్మే తెలిపారు. ఉదాహరణకు రక్షాబంధన్‌ సందర్భంగా మీ సోదరికి మీరు డబ్బులు పంపుతున్నట్లైతే.. రాఖీతో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను జత చేయవచ్చు. అలాగే పుట్టిన రోజు సందర్భంగానైతే.. కేక్‌, క్యాండిల్స్‌తో కూడిన బ్యాక్‌గ్రౌండ్‌ను చేర్చవచ్చు. తమ దృష్టిలో డబ్బులు పంపడం, పొందడం అనేది కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదని మనేశ్‌ వ్యాఖ్యానించారు. వాటి వెనుక వెలకట్టలేని భావాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తుల్లో పేమెంట్స్‌ ఫీచర్‌ను మరింత ఆకర్షణీయంగా, సులభతరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు.

బ్యాక్‌గ్రౌండ్‌ ఎలా యాడ్‌ చేయాలంటే..

> డబ్బులు పంపాలనుకుంటున్నవారి కాంటాక్ట్‌ని సెలెక్ట్‌ చేసుకోండి.

> లావాదేవీ విలువను ఎంటర్‌ చేయండి.

> బ్యాక్‌గ్రౌండ్‌ అనే ఐకాన్‌పై క్లిక్‌ చేయండి.

> నచ్చిన థీమ్‌ల కోసం స్క్రోల్‌ చేసి సెలెక్ట్‌ చేసుకోండి.

> తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌ ఆప్షన్‌ను డిస్మిస్‌ చేసి చెల్లింపు చేసేయండి.

> బ్యాక్‌గ్రౌండ్‌ యాడ్‌ చేసిన తర్వాత కూడా లావాదేవీ మొత్తాన్ని మార్చవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని