Updated : 28 Nov 2021 15:29 IST

OPEC: మరో సంక్షోభం ముంగిట ఒపెక్‌?

2 దేశాల పంతం ప్రపంచ మార్కెట్‌కు శాపం కానుందా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: కష్టాల్లో ఏకతాటిపై నిలిచి సంక్షోభాలను అధిగమిస్తూ బలమైన బంధానికి పెట్టింది పేరుగా నిలిచిన చమురు ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్‌)లో పొరపొచ్చాలు బయటకు పొక్కాయి. సభ్యదేశాలైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), సౌదీ అరేబియా మధ్య చమురు ఉత్పత్తి పెంపు విషయంలో విభేదాలు తలెత్తాయి. దీంతో వచ్చే నెల చమురు ఎగుమతులపై ప్రతిష్టంభన నెలకొంది. ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరకపోతే ఆగస్టులో చమురు ధరల సంక్షోభం రావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.

ఎవరి వాదన ఏమిటి?

వచ్చే నెలతో పాటు ఈ ఏడాది చివరి వరకు చమురు ఉత్పత్తిపై నిర్ణయం తీసుకునేందుకు ఒపెక్‌, రష్యా సహా ఇతర చమురు ఎగుమతి దేశాలు ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యాయి. కానీ, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య దేశాలైన యూఏఈ, సౌదీ మధ్య సయోధ్య కుదరకపోవడంతో అవి వాయిదా పడ్డాయి. వచ్చే నెల చమురు ఉత్పత్తిని మరో 20 మిలియన్‌ బ్యారెళ్ల మేర పెంచాలని సౌదీ ప్రతిపాదించింది. అలాగే, గతంలో నిర్ణయించినట్లు 2022లోనూ ఉత్పత్తిపై ఆంక్షలు కొనసాగించాలని తెలిపింది. ఈ రెండు ప్రతిపాదనల్లో వచ్చే నెల నుంచి చమురు ఉత్పత్తి పెంపునకు యూఏఈ అంగీకరించింది. కానీ, ఉత్పత్తిపై ఆంక్షల గడువు పొడిగింపునకు మాత్రం ససేమిరా అంటోంది. ప్రపంచవ్యాప్తంగా చమురుకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఇదే అదును చూసుకొని లాభాలను ఒడిసిపట్టాలని సౌదీ భావిస్తోంది. కానీ, యూఏఈ మాత్రం దిగుమతి దేశాల అవసరాలను బట్టి వాటితో మెరుగైన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సభ్య దేశాలకు అవకాశం కల్పించాలని కోరుతోంది. యూఏఈ అంగీకారం లేకుండా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని సౌదీ చెబుతుండడం గమనార్హం. మరోవైపు సౌదీ నిర్ణయాన్ని రష్యా సహా కూటమిలోని ఇతర దేశాలు కూడా అంగీకరించాయి.

యూఏఈ అభ్యంతరాలేంటీ?

ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే నెల చమురు ఎగుమతులపై సందిగ్ధత నెలకొంది. ప్రతిష్టంభన ఇలాగే కొనసాగితే.. ఇప్పటికే భారీగా పెరిగిన చమురు ధరలు ఆగస్టులో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఆంక్షల పొడిగింపునకు అంగీకరించకపోవడానికి యూఏఈకి బలమైన కారణం ఉంది. ఒపెక్‌, కూటమిలోని ఇతర దేశాలు ఎంత చమురు ఉత్పత్తి చేయాలన్నదాన్ని ‘బేస్‌లైన్‌’ అనే పారామీటర్‌ ఆధారంగా నిర్ణయిస్తారు. ఆంక్షలు, బేస్‌లైన్‌ను పరిగణనలోకి తీసుకొని యూఏఈ 3.2 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి చేస్తోంది. కానీ, ఇది చాలా తక్కువ అని.. తమ అవసరాలకు అనుగుణంగా దీన్ని 3.8 మిలియన్‌ బ్యారెళ్లకు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని యూఏఈ కోరుతోంది. కానీ, అందుకు కూటమి దేశాలు అంగీకరించడం లేదు. మిగతా దేశాల నుంచి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి.

నాటకీయ పరిణామాలు.. ధరల పతనం

అయితే, నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని.. ఒపెక్‌ దేశాలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తే ధరలు ఒక్కసారిగా పడిపోయే అవకాశాలూ లేకపోలేదు. సయోధ్య కుదరక కూటమి భాగస్వామ్య దేశాలు విడిపోయి వారి అవసరాలకు అనుగుణంగా చమురు ఉత్పత్తిని పెంచుకునే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే.. ప్రపంచ మార్కెట్‌ను ఆకర్షించేందుకు ఆయా దేశాలు పోటీపడి ధరల్ని తగ్గించే అవకాశం ఉంది. ఇది ధరల పతనానికి దారి తీసి మరో చమురు సంక్షోభానికి కారణం కావచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts