ఓలా స్కూటర్‌ ఇదే.. వీడియో షేర్‌ చేసిన సీఈవో

ఓలా నుంచి త్వరలో ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ స్కూటర్‌ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ పెట్టుబడితో తమిళనాడులో ప్లాంట్.....

Published : 02 Jul 2021 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓలా నుంచి త్వరలో ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ స్కూటర్‌ గురించి ప్రకటన వెలువడినప్పటి నుంచి దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే భారీ పెట్టుబడితో తమిళనాడులో ప్లాంట్‌ ఏర్పాటవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్కూటర్‌ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. బెంగళూరు వీధుల్లో ఓలా స్కూటర్‌పై చక్కర్లు కొడుతున్న వీడియోను ఉంచారు. స్కూటర్‌కు సంబంధించిన పలు ఫీచర్లను వీడియో ద్వారా పరిచయం చేశారు.

ఈ బైక్‌ 0-60 Kmph వేగాన్ని ఈ ట్వీట్‌ చదివేంత సమయంలోనే (అతి తక్కువ సమయంలోనే) అందుకుంటుందంటూ భవిష్‌ పేర్కొన్నారు. మార్చుకునేందుకు వీలుగా ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీతో వస్తున్న ఈ స్కూటర్‌ సీటు కింది భాగంలో రెండు హాఫ్‌ హెల్మెట్లు పెట్టేంత ఖాళీ ప్రదేశం ఉంటుందని చూపించారు. టెలీస్కోపిక్‌ సస్పెన్షన్‌, అదిరిపోయే లుక్‌ వంటివి పరిచయం చేశారు. ఒకసారి ఛార్జ్‌ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది.

తమిళనాడులో ఇప్పటికే ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు రూ.2,400 కోట్లతో కొనసాగుతున్నాయి. రానున్న కొన్ని నెలల్లో ఇక్కడ విద్యుత్తు స్కూటర్ల తయారీ ప్రారంభం కానున్నట్లు ఇటీవలే సంస్థ ప్రకటించింది. ఏటా కోటి స్కూటర్లను తయారు చేసే వసతుల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు సెకన్లకు ఒక స్కూటర్ తయారీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు హైపవర్‌ ఛార్జర్‌ నెట్‌వర్క్‌ని కూడా దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హై-స్పీడ్‌ ఛార్జింగ్‌ ఆప్షన్లతో పాటు హోం ఛార్జర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించింది. బజాజ్‌ చేతక్‌ (ఎలక్ట్రిక్‌), అథేర్‌ ఎనర్జీ స్కూటర్లకు ఓలా స్కూటర్‌ గట్టి పోటీనివ్వనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని