GDP: ఒమిక్రాన్‌తో ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టమంటే..?

మహమ్మారి వ్యాప్తి కట్టడి నిమిత్తం తాజాగా విధిస్తోన్న ఆంక్షల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే అవకాశం ఉందని అభిప్రాపడింది....

Updated : 07 Jan 2022 14:14 IST

ఇండియా రేటింగ్స్ అండ్‌ రీసెర్చి అంచనాలు

ముంబయి: కరోనా సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బ్రేకులు వేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చి కూడా స్పష్టం చేసింది. మహమ్మారి వ్యాప్తి కట్టడి నిమిత్తం తాజాగా విధిస్తోన్న ఆంక్షల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నెమ్మదించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

తాజాగా విజృంభిస్తోన్న కరోనా అదుపునకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే జనసంచారంపై ఆంక్షలు విధించాయి. రాత్రి, వారాంతపు కర్ఫ్యూలు ప్రకటించాయి. మరోవైపు ప్రజలు సైతం నేరుగా బయటకు వచ్చేందుకు కొంత వరకు వెనుకాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ జీడీపీ 0.40 శాతం మేర కుచించుకుపోయే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ అంచనా వేసింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం జీడీపీలో 0.10 శాతం కోత తప్పదని స్పష్టం చేసింది.

గత పది రోజులుగా దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో జనవరి-మార్చి త్రైమాసికానికి గతంలో అంచనా వేసిన 6.1 శాతం జీడీపీ 5.7 శాతానికి తగ్గే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్‌ తెలిపింది. ఇక మొత్తం 2021-22 ఆర్థిక సంవత్సరానికి 9.3 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

దేశంలో కరోనా తీవ్ర రూపం దాల్చుతోంది. కొత్త కేసులు లక్ష దాటేశాయి. కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగి, ఆందోళన కలిగిస్తున్నాయి. మూడో వేవ్‌కు ఆజ్యం పోస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు మూడు వేలకు పెరిగాయి. అయితే, తొలి రెండు వేవ్‌ల సమయంలో విధించిన ఆంక్షలతో పోలిస్తే.. తాజా ఆంక్షల వల్ల ఆర్థిక వ్యవస్థ అంతగా దెబ్బతినకపోవచ్చునని ఇండియా రేటింగ్స్‌ అభిప్రాయపడింది. ప్రభుత్వాలు, కంపెనీలు.. కొవిడ్‌ కొత్త వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడమే అందుకు కారణమని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని