ఆరోగ్య బీమాలో అవుట్‌-ఆఫ్‌-పాకెట్ ఎక్స్‌పెన్సెస్ గురించి తెలుసా? 

ఆరోగ్య బీమా పాల‌సీ ఉన్న‌ప్ప‌టికీ కొన్ని వైద్య ఖ‌ర్చుల‌కు సొంతంగా డ‌బ్బు చెల్లించాల్సి వ‌స్తుంది. వీటినే అవుట్‌-ఆఫ్‌-పాకెట్ ఎక్స్‌పెన్సెస్ అంటారు

Updated : 26 May 2021 17:11 IST

కోవిడ్‌-19.. ఆరోగ్య బీమా అవ‌స‌రాన్ని, ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేయ‌డం మాత్ర‌మే కాదు. బీమాలో ప్ర‌తీ చిన్న విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని, చికిత్సక‌య్యే ఖ‌ర్చుల విష‌యంలో జాగ్ర‌త్త ప‌డాల‌ని కూడా తెలుపుతుంది. బీమా పాల‌సీల రూప‌క‌ల్ప‌న‌లో ప్ర‌ధానంగా కొన్ని లోపాలు క‌న్పిస్తున్నాయి. వీటి వ‌ల్ల చికిత్స‌క‌య్యే కొన్ని ఖ‌ర్చులు క‌వ‌ర్ కావ‌డం లేదు. దీంతో పాల‌సీ తీసుకున్నా.. పూర్తి ప్ర‌యోజనం పొంద‌లేక‌పోతున్నారు చాలా మంది. ఏంటి ఆ ఖ‌ర్చులు.. వాటి నుంచి బ‌య‌ట ప‌డాలంటే ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

అవుట్‌-ఆఫ్‌-పాకెట్ ఎక్స్‌పెన్సెస్ అంటే..
ఆరోగ్య బీమా పాల‌సీ ఉన్న‌ప్ప‌టికీ కొన్ని వైద్య ఖ‌ర్చుల‌కు సొంతంగా డ‌బ్బు చెల్లించాల్సి వ‌స్తుంది. వీటినే అవుట్‌-ఆఫ్‌-పాకెట్ ఎక్స్‌పెన్సెస్ అంటారు. ఉదాహ‌ర‌ణకు, మందులు, పీపీఈ కిట్లు వంటి వినియోగ వ‌స్తువులకు అయ్యే ఖ‌ర్చులు, త‌గ్గింపులు, స‌హా-చెల్లింపులు( బీమా సంస్థ‌తో పాటు మీరు చెల్లించాల్సిన భాగం), ఉప‌-ప‌రిమితులు(గ‌ది అద్దె వంటి వాటిపై ఉండే ప‌రిమితులు). ఇటువంటి ఖ‌ర్చుల‌ను పాల‌సీదారుడు త‌మ జేబు నుంచి చెల్లించాల్సి వ‌స్తుంది. ఈ ఖ‌ర్చులు కోవిడ్‌-19 చికిత్స‌కి అయ్యే మొత్తం ఖ‌ర్చులో 30 నుంచి 50 శాతం వ‌ర‌కు ఉంటున్నాయ‌ని ప‌రిశ్ర‌మ నివేదిక‌లు చెబుతున్నాయి. 

ఖ‌ర్చు ఎందుకు పెరుగుతుంది?
కోవిడ్‌-19.. ఒక వ్య‌క్తి నుంచి మరొక వ్య‌క్తికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాప్తి అరిక‌డుతూ, రోగుల‌కు చికిత్స అందించేందుకు వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తా ప‌రికరాలు(ప‌ర్స‌న‌ల్ ప్రొట‌క్టీవ్ ఎక్విప్‌మెంట్‌- పీపీఈ) కిట్‌ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ 'పీపీఈ' కిట్‌లో ఒక‌సారి మాత్ర‌మే ఉప‌యోగించగ‌ల.. ఒక జ‌త చేతి గ్లౌజులు, శ‌రీరం మొత్తం వేసుకునే క‌వ‌ర్‌, ఎన్‌-95 మాస్క్‌, షూ క‌వ‌ర్లు, ఫేస్ షీల్డు ఉంటాయి.  వీటిలో ప్ర‌తి ఒక్క వ‌స్తువును ఉప‌యోగించాల్సిందే. కోవిడ్‌-19 చికిత్స‌లో భాగంగా ఈ వ‌స్తువుల వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది. అందువ‌ల్ల అయ్యే ఖ‌ర్చు కూడా ఎక్కువ‌వుతుంది. వీటికి తోడు మీరు తీసుకున్న‌ ఆరోగ్య బీమా పాల‌సీ అన్ని వ్యాధుల‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోయినా, అధిక డిడ‌క్ట‌బుల్స్, స‌బ్ లిమిట్స్ ఉన్నా.. పాల‌సీ తీసుకున్న‌ప్ప‌టికీ, పాలసీదారుడు సొంతంగా ఖ‌ర్చు పెట్టాల్సిన మొత్తం ఎక్కువౌతుంది. 

ఆరోగ్య బీమాలో క‌వ‌ర్ కానివేంటి?
సాధార‌ణంగా, బీమా సంస్థ‌లు.. ఆరోగ్య బీమా పాల‌సీలో ముందుగా నిర్ధార‌ణ అయిన వ్యాధుల‌ను(పీఈడి) 2 నుంచి 4 సంవ‌త్స‌రాల పాటు క‌వ‌ర్‌చేయవు.  వీటిలో అధిక రక్తపోటు, డయాబెటిస్, థైరాయిడ్, ఉబ్బసం వంటి దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో పాటు  కోవిడ్ -19 కూడా క‌వ‌ర్ చేయడం లేదు కొన్ని పాల‌సీలు. ప్ర‌సూతి ప్ర‌యోజ‌నాలు, సౌందర్య శస్త్రచికిత్స, దంత శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్‌మెంట్ వంటివి సాధార‌ణంగా క‌వ‌ర్ చేయ‌రు. అలాగే, అవుట్ పేషెంట్ చికిత్స కూడా బీమా సంస్థ‌ల ప‌రిధిలో లేదు. 

ఏవిధంగా జాగ్ర‌త్త ప‌డాలి..
పాల‌సీలు ఎంపిక చేసుకునేప్పుడే, జాగ్ర‌త్త ప‌డితే చాలా వ‌ర‌కు ఖ‌ర్చులు త‌గ్గించుకోవ‌చ్చు. అయితే బీమా పాల‌సీ ఏదైనా.. అన్ని ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయదు. అందువ‌ల్ల‌ 6 నుంచి 12 నెల‌ల ఖ‌ర్చుల‌కు స‌రిపోయే మొత్తంతో అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకోసం పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్‌, లిక్విడ్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. మీకు ఇప్ప‌టికే అత్య‌వ‌స‌ర నిధి ఉంటే కొంత టాప్‌-అప్‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నించండి. ఒక‌వేళ అత్య‌వ‌స‌ర నిధి లేక‌పోతే ద్ర‌వ్య రూపంలో ఉన్న ఆస్తులు అంటే.. పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి ర‌ద్దు చేసి ఆ మొత్తాన్ని అత్య‌వ‌స‌ర వైద్య ఖ‌ర్చుల‌కు ఉప‌యోగించుకోవాలి. చివ‌రి ప్ర‌య‌త్నంగా రుణం తీసుకోవ‌చ్చు. రుణం తీసుకోవాల్సి వ‌స్తే, క్రెడిట్ కార్డు ద్వారా కంటే ఆస్తిని హామీగా ఉంచి గానీ,  వ్య‌క్తిగ‌త రుణం గానీ తీసుకోవ‌డం మంచిది. వీటిలో క్రెడిట్ కార్డుతో పోలిస్తే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉంటుంది. 

ఖ‌ర్చులు త‌గ్గించుకునేందుకు ఏం చేయాలి?
పూర్తి చికిత్స ఖర్చును తగ్గించడానికి.. త‌క్కువ‌ తగ్గింపులు, మినహాయింపుల ఉన్న‌ సమగ్ర ఆరోగ్య పాలసీని కొనుగోలు చేయాలి. బీమా క‌వ‌రేజ్‌ను ఏడాదికోసారైనా సమీక్షించండి. పెరుగుతున్న‌ వైద్య ఖర్చులు అనుగుణంగా క‌వ‌రేజ్‌ను పెంచుకోండి. చికిత్స తీసుకునేటప్పుడు, బీమా సంస్థ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ప్రాముఖ్య‌త ఇవ్వండి. సిఫార్సు చేసిన పరీక్షలు, ప్రోసీజ‌ర్లు, ఔషధాల కోసం ఎలాంటి ఆప్ష‌ను అందుబాటులో ఉన్నాయో తెలుసుకోండి. మెడిక‌ల్ బిల్లుల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించండి. కొన్ని ఆసుప‌త్రులు వివిధ ప్రొసీజ‌ర్స్‌కి ఎక్కువ ఛార్జ్ చేసే అవ‌కాశం ఉంది. ఈ కార‌ణంగా పాల‌సీ క్లెయిమ్ రిజ‌క్ట్ అవ‌కాశం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని