పీఎఫ్ విత్‌డ్రాలు.. టీడీఎస్ ప‌డ‌కూడ‌దంటే ఏం చేయాలి? 

ఈపీఎఫ్‌ విత్‌డ్రా స‌మ‌యంలో, ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం 1961 సెక్ష‌న్ 192ఏ అనుస‌రించి టీడీఎస్ డిడ‌క్ట్ చేస్తారు. 

Updated : 04 Jun 2021 11:32 IST

ప్రావిడెండ్ ఫండ్‌(పీఎఫ్) ఖాతా ఉద్యోగులు ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాతి జీవితం కోసం చేసే పెట్టుబ‌డి. దీనిని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిర్వ‌హిస్తుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ కోస‌మే అయిన‌ప్ప‌టికీ ముంద‌స్తు విత్‌డ్రాల‌ను ఈపీఎఫ్ఓ అనుమ‌తిస్తుంది. అయితే ఎప్పుడు, ఎంత విత్‌డ్రా చేస్తున్నాము అనే అంశంపై ఆధార‌ప‌డి టీడీఎస్(మూలం వ‌ద్ద ప‌న్ను) డిడ‌క్ట్ అవుతుంది. టీడీఎస్ డిడ‌క్ట్ అవ‌కూడ‌దు అంటే విత్‌డ్రాల‌కు కొన్ని విధానాల‌ను అనుస‌రించాలి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఐదేళ్లలోపే విత్‌డ్రా చేసుకుంటే..
ఈపీఎఫ్ఓ స‌భ్యుడు ఈపీఎఫ్ లేదా పీఎఫ్ మొత్తాన్ని ఖాతా తెరిచిన ఐదేళ్ల లోపే విత్‌డ్రా చేసుకోవాల‌కుంటే.. ఈ మొత్తంపై టీడీఎస్ వ‌ర్తిస్తుంది.  పీఎఫ్ విత్‌డ్రా నియ‌మాల ప్ర‌కారం.. ఈపీఎఫ్/పీఎఫ్ ఖాతా పాన్‌తో అనుసంధానించి ఉంటే 10 శాతం టీడీఎస్ డిడ‌క్ట్ అవుతుంది. ఒక‌వేళ పాన్‌తో అనుసంధానించ‌క‌పోతే ఇది రెట్టింపు అవుతుంది. అంటే పీఎఫ్‌ మొత్తంపై 20 శాతం టీడీఎస్‌ను వ‌సూలు చేస్తారు. ఐదేళ్లు, అంత‌కంటే ఎక్కువ నిరంత‌ర స‌ర్వీస్ ఉన్న ఉద్యోగులకు పీఎఫ్ బ్యాలెన్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది.

పీఎఫ్‌ ఖాతా తెరిచిన ఐదేళ్ల లోపు విత్‌డ్రా చేసుకున్న‌ప్ప‌టికీ టీడీఎస్ ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌చ్చు. 
అది ఎలా అంటే..
విత్‌డ్రా మొత్తం రూ.50వేల కంటే త‌క్కువ ఉంటే ఖాతా తెరిచిన ఐదేళ్ల లోపు విత్‌డ్రా చేసుకున్నా పీఎఫ్ మొత్తంపై టీడీఎస్ వ‌ర్తించ‌దు. వార్షిక ఆదాయం రూ.2.5 ల‌క్ష‌ల కంటే ఎక్కువ ఉండి, విత్‌డ్రా చేసుకునే పీఎఫ్ మొత్తం రూ. 50వేల కంటే ఎక్కవుంటే టీడీఎస్ వర్తిస్తుంది. 

పీఎఫ్ విత్‌డ్రా మొత్తం రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న‌ప్పుడు కూడా టీడీఎస్‌ను నివారించవ‌చ్చు. 
మ‌రి ఇందుకోసం ఏం చేయాలి..
పీఎఫ్ ఖాతాదారుని వార్షిక ఆదాయం రూ.2.5 ల‌క్ష‌ల కంటే త‌క్కువ ఉన్న‌ప్పుడు, రూ.50వేలకు మించి పీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. అయితే టీడీఎస్ ప‌డ‌కుండా ఉండేందుకు ఫారం 15G లేదా 15H స‌బ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. 

ఏ ఫారం ఎవ‌రు ఇవ్వాలి..
60 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న‌వారు ఫారం 15Gని, సీనియ‌ర్ సిటిజ‌న్లు ఫారం 15Hను ఇవ్వాల్సి ఉంటుంది. 

ఈ విధమైన స్టెప్స్‌ను అనుస‌రించ‌డం వ‌ల్ల ప‌ద‌వీ విర‌మ‌ణ కంటే ముంద‌గానే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకున్న టీడీఎస్ డిడ‌క్ట్ అవ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌చ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని