RBI: ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపునకు రిటైల్‌ ఇన్వెస్టర్లకు కొత్త మార్గం!

ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌లో రిటైల్‌ మదుపర్లు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) రూపొందించిన రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు....

Published : 12 Nov 2021 17:40 IST

ప్రారంభించిన ప్రధాని మోదీ

దిల్లీ: ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌లో రిటైల్‌ మదుపర్లు పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) రూపొందించిన రెండు కీలక పథకాలను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. రిటైల్‌ డైరెక్ట్‌ స్కీం, ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీం పేరిట ప్రారంభించిన ఈ పథకాలు రిటైల్‌ మదుపర్లకు పెట్టుబడి అవకాశాలను, వారి ఫిర్యాదుల పరిష్కార మార్గాలను మెరుగుపరుస్తాయని ప్రధాని పేర్కొన్నారు. రిటైల్‌ డైరెక్ట్‌ స్కీం ద్వారా చిన్న మదుపర్లు సెక్యూరిటీల్లో మదుపు చేసి స్థిర రాబడి పొందే అవకాశం లభిస్తుందని మోదీ అన్నారు. తద్వారా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే అవకాశం వారికి దొరకనుందన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీం ద్వారా ఆర్‌బీఐ నియంత్రణలోని సంస్థల వల్ల మదుపర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.

రిటైల్‌ డైరెక్ట్‌ స్కీం పేరిట వచ్చిన ఈ పథకం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టేందుకు రిటైల్‌ మదుపర్లకు కొత్త మార్గం లభించనుంది. అలాగే మదుపర్లు ఉచితంగా ఆర్‌బీఐ వద్ద ఆన్‌లైన్‌లో సులభంగా తమ ప్రభుత్వ సెక్యూరిటీ ఖాతాను తెరిచి నిర్వహించుకోవచ్చు. అలాగే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలను కొనొచ్చు. విక్రయించవచ్చు. ఇక ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీం.. ఫిర్యాదుల దాఖలు, పత్రాల సమర్పణ, సూచనలు, వాటి స్థితిని తెలుసుకునేందుకు ఒక వేదికగా మారనుంది. పలు భాషల్లో ఫిర్యాదులు చేసేందుకు, పరిష్కారంపై సమాచారం పొందేందుకు టోల్‌ ఫ్రీ నంబరు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని