పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్.. పెట్టుబ‌డుల‌కు ఏది ఉత్తమం?

సెక్ష‌న్ 80 సీ కింద ఈ రెండింటిలో పెట్టుబ‌డుల‌కు ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది

Published : 18 Dec 2020 13:23 IST

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్‌) ఈ రెండు ప‌న్ను ఆదా చేసే పొదుపు ప‌థ‌కాలు, సెక్ష‌న్ 80 సీ కింద ఈ రెండింటిలో పెట్టుబ‌డుల‌కు ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు అవ‌కాశం ఉంటుంది. ఆర్థిక సంవ‌త్స‌రం పూర్తికావొస్తున్న నేప‌థ్యంలో పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్ వంటి పెట్టుబ‌డులవైపు చూస్తారు. అయితే సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే ప‌థ‌కాల‌కు వేర్వేరు రాబ‌డులు, రిస్క్‌, లాక్‌-ఇన్ పీరియ‌డ్, ప‌న్నులు ఉంటాయి. పన్ను ఆదా చేసేందుకు పెట్టుబ‌డులు పెట్టేముందు వీట‌న్నింటిని ప‌రిశీలించాలి.

పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్ మ‌ధ్య ఉన్న తేడా ఏంటి ?
ప‌న్ను పీపీఎఫ్ ప‌న్ను ఆదా చేసే పెట్టుబ‌డుల‌కు పీపీఎఫ్ ప్రాచుర్యం పొందింది. ఇది డెట్ ప‌థ‌కం, క‌చ్చిత‌మైన రాబ‌డిని అందిస్తుంది. పెట్టుబ‌డులు, రాబ‌డి, ఉప‌సంహ‌ర‌ణ‌పై పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. అంటే ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డులకు ఎటువంటి ప‌న్ను ఉండ‌దు, దానిపై ల‌భించే రాబ‌డితకి ప‌న్ను వ‌ర్తించ‌దు. ఇక పూర్తి ఉప‌సంహ‌ర‌ణ‌పై కూడా ప‌న్ను లేదు.

ఈఎల్ఎస్ఎస్ మ్యూచువ‌ల్ ఫండ్, ఈక్విటీ సంబంధిత సాధ‌నాల‌లో పెట్టుబ‌డులు పెడుతుంది. ఇక్క‌డ కూడా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డుల‌కు ప‌న్ను ఉండ‌దు. అయితే ఏడాది దాటిన త‌ర్వాత పెట్టుబ‌డుల‌పై రాబ‌డి ల‌క్ష దాటితే 10 శాతం ప‌న్ను వ‌ర్తిస్తుంది.

లాక్-ఇన్ పీరియ‌డ్
పీపీఎఫ్ మెచ్యూరిటీ గ‌డువు 15 సంవ‌త్స‌రాలు. అయితే ఏడు సంవ‌త్స‌రాల త‌ర్వాత పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశం ఉంది. ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఐదు సంవ‌త్స‌రాల త‌ర్వాత ముంద‌స్తుగా ఖాతా మూసివేయ‌వ‌చ్చు.
ఇక ఈఎల్ఎస్ఎస్ లాక్-ఇన్ పీరియ‌డ్ మూడేళ్లు. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే అన్ని పొదుపు ప‌థ‌కాల కంటే త‌క్కువ లాక్‌-ఇన్ పీరియ‌డ్ క‌లిగిన ఒకే ఒక ప‌థ‌కం ఈఎల్ఎస్ఎస్‌.

రాబ‌డి
పీపీఎఫ్ ప్ర‌భుత్వం ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కం. దీనిపై వ‌డ్డీ రేటు త్రైమాసికానికి ఒక‌సారి స‌వ‌రిస్తారు. ప్ర‌స్తుతం 7.1 శాతం ఉంది. ఇక ఈఎల్ఎస్ఎస్ రాబ‌డి మార్కెట్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఈ మ్యూచువ‌ల్ పెట్టుబ‌డులు పెట్టిన స్టాక్స్ క‌ద‌లిక‌ల‌ను బ‌ట్టి ఫండ్ ప‌నితీరు ఉంటుంది.

పెట్టుబ‌డి విధానం
పీపీఎఫ్‌, ఈఎల్ఎస్ఎస్ రెండింటిలో పెట్టుబ‌డుల‌కు అనుకూల‌మైన‌వి. ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు ఒకేసారి ఎక్కువ మొత్తంలో లేదా క్ర‌మానుగ‌తంగా (సిప్‌) పెట్ట‌వ‌చ్చు. అదేవిదంగా పీపీఎఫ్‌లో కూడా పెద్ద మొత్తంలో ఒకేసారి లేదా ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో 12 సార్లు పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు.

పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ ఏది ఎంచుకోవాలి?
పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ రెండింటినీ పోల్చిచూడ‌టం స‌రికాదు. రెండు వేర్వేరు క‌క‌మైన ప‌థ‌కాలు. కానీ ప‌న్ను విష‌యంలో మాత్రం రెండింటికీ సెక్ష‌న్80 సీ కింద మిన‌హాయింపు ల‌భిస్తుంది. ఇదొక్క‌టే రెండింటిలో కామ‌న్‌. ఇక కేవ‌లం ప‌న్ను ఆదా కోసం కాకుండా దీర్ఘ‌కాలికంగా మీకు అనుకూలంగా ఉండే ప‌థకాన్ని ఎంచుకోవ‌డం మంచిది. పీపీఎఫ్ డెట్ ప‌థ‌కం వంటిది, ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీ ప‌థ‌కం. ఇందులో రాబ‌డి మార్కెట్ల‌పై ఆధార‌ప‌డి ఉంటుంది.
పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ ఏది ఎంచుకోవాల‌నేది పెట్టుబ‌డిదారుడి రిస్క్ సామ‌ర్ధ్యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. పీపీఎఫ్‌లో రిస్క్ ఉండ‌దు. క‌చ్చిత‌మైన రాబ‌డితో పాటు, ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. రిస్క్ తీసుకునేందుకు ఇష్ట‌ప‌డనివారు దీనిని ప‌రిశీలింవ‌చ్చు. అయితే 15 ఏళ్ల లాక్‌-ఇన్ పీరియ‌డ్ దృష్టిలో పెట్టుకోవాలి. ఈక్విటీల‌లోకి అడుగు పెట్టాల‌నుకునేవారు, రిస్క్ తీసుకునేవారు ఈఎల్ఎస్ఎస్ ఎంచుకోవ‌చ్చు. దీర్ఘ‌కాలంలో ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించ‌డంతో పాటు దీనిపై మంచి రాబ‌డి ఆశించ‌వ‌చ్చు.

ప‌న్ను ఆదా చేసే ప‌థ‌కాలు మీ పోర్ట్‌పోలియోలో భాగంగా త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. అది సంవ‌త్స‌రం ప్రారంభంలోనే ఈ పెట్టుబ‌డుల‌పై నిర్ణ‌యం తీసుకోవాలి. చివ‌రి నిమిషంలో తొంద‌ర‌ప‌డి పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌రైని విధానం కాద‌ని ఆర్థిక నిపుణుల స‌ల‌హా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని