పీపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ నియ‌మాలు

ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది.......

Updated : 01 Jan 2021 17:08 IST

ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది

అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌లో పీపీఎఫ్ ఒక‌టి. పెట్టుబ‌డుల‌కు ప్ర‌భుత్వ హామీతో పాటు మంచి రాబ‌డి అందిస్తున్న ప‌థ‌కం. ఇందులో అస‌లు, వ‌డ్డీ రెండింటిపై ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. వార్షికంగా 7.1శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఈ ప‌థకంలో గ‌రిష్టంగా సంవ‌త్స‌రానికి రూ. 1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. ఖాతా నిర్వ‌హ‌ణ కోసం వార్షికంగా క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

పోస్టాఫీసులు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లో మాత్ర‌మే కాకుండా కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల‌లోనూ పీపీఎఫ్ ఖాతాను తెర‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతాకు 15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంది. కాల‌ప‌రిమితి పూరైన అనంత‌రం కూడా 5ఏళ్ళ చొప్పున ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు.

15 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి అనంత‌రం పీపీఎఫ్ ఉప‌సంహ‌ర‌ణ నియ‌మాలు:

  1. పీపీఎఫ్ ప‌థ‌కం ఆర్థిక సంవ‌త్స‌రం(ఏప్రిల్‌-మార్చ్‌)ను అనుస‌రించి ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల మీరు మార్చి 2019లో పీపీఎఫ్ ఖాతాను తెరిచి ఉంటే ప్ర‌స్తుతం మీరు రెండ‌వ సంవ‌త్స‌రంలో ఉన్నార‌ని అర్థం.
  2. 15వ సంవ‌త్స‌రం చివ‌రికి పీపీఎఫ్ ఖాతాను మూసివేసి, మొత్తం న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. ఇందుకు ‘ఫారం సీ’ ని పూర్తిచేసి పోస్టాఫీసు లేదా మీ పీపీఎఫ్ ఖాతా ఉన్న బ్యాంకుకి ఇవ్వాల్సి ఉంటుంది.
  3. కాల‌ప‌రిమితి ముగిసిన అనంత‌రం త‌ప్ప‌నిస‌రిగా ఖాతాను మూసివేయాల్సిన ప‌నిలేదు. 5 సంవ‌త్స‌రాల చొప్పున ఖాతాను కొన‌సాగించ‌వ‌చ్చు. ఖాతాదారుడు జీవించి ఉన్నంత వ‌ర‌కు ఎన్ని సార్లైనా ఖాతాను పొడిగించుకోవ‌చ్చు. ఖాతాను కొన‌సాగించేందుకు 'ఫారం హెచ్‌’ను ఇవ్వాల్సి ఉంటుంది.

15సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి కంటే ముందే విత్‌డ్రా చేయాల‌నుకుంటే:

  1. ఖాతా తెరిచిన 7వ సంవ‌త్స‌రం నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది. మొద‌టి ఆరు సంవ‌త్స‌రాల‌లో విత్‌డ్రాల‌ను అనుమ‌తించ‌రు.
  2. సంవ‌త్స‌రానికి ఒక సారి మాత్ర‌మే పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.
  3. పీపీఎఫ్ ఖాతా నుంచి పాక్షిక న‌గ‌దు ఉప‌సంహ‌ర‌ణ చేసుకోవాలంటే - సొమ్ము ఉప‌సంహ‌రించుకుంటున్న ఏడాదికి నాలుగేళ్ల ముందు నాటి న‌గ‌దు నిల్వ‌లో 50 శాతం లేదా సొమ్ము ఉప‌సంహ‌రించుకుంటున్న ఏడాదికి ముందు సంవ‌త్స‌రం నాటి న‌గ‌దు నిల్వ‌లో 50 శాతం ఇందులో ఏది త‌క్కువ మొత్త‌మైతే అంత మేర ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు.
  4. పీపీఎఫ్ ఖాతాల నుంచి పాక్షికంగా న‌గ‌దు ఉప‌సంహ‌రించిన‌ట్ల‌యితే వాటిపై ఎలాంటి ప‌న్ను భారం ప‌డ‌దు.
  5. కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో త‌ప్ప ప‌బ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ ఉప‌సంహ‌ర‌ణ‌లు, ముంద‌స్తు మూసివేత‌కు అనుమ‌తించ‌రు.

పీపీఎఫ్ రుణ నియ‌మాలు:

  1. ప్రావిడెండ్ ఫండ్ ఖాతాలో పొదుపు చేసిన మొత్తాన్ని ఖాతా ప్రారంభించిన ఏడ‌వ సంవ‌త్స‌రం నుంచి మాత్ర‌మే పాక్షికంగా ఉప‌సంహ‌రించేందుకు వీలుంది. అయితే ఖాతా ప్రారంభించిన మూడ‌వ సంవ‌త్స‌రం నుంచి ఆర‌వ సంవ‌త్స‌రం వ‌ర‌కు రుణం తీసుకునే వెసులుబాటు ఉంది.
  2. రుణం తీసుకోబోతున్న సంవ‌త్స‌రం నుంచి రెండు సంవ‌త్స‌రాల ముందు వ‌ర‌కు ఉన్న మొత్తం బ్యాలెన్స్ నుంచి 25 శాతం మొత్తాన్ని రుణం రూపంలో పొంద‌వ‌చ్చు.
  3. ఒక‌సారి రుణం తీసుకున్న త‌రువాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించిన త‌రువాత మాత్ర‌మే మ‌ర‌ల రుణం తీసుకునేందుకు వీలుంటుంది.
  4. పీపీఎఫ్ ఖాతా నుంచి ల‌భించే వ‌డ్డీ కంటే 2 శాతం ఎక్కువ మొత్తాన్ని రుణం తీసుకున్న మొత్తానికి చెల్లించాలి. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు పీపీఎఫ్ ఖాతా నుంచి రుణం తీసుకున్నార‌నుకుందాం. మీకు పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తంపై 7.1 శాతం వ‌డ్డీ వ‌స్తుంటే, మీరు తీసుకున్న రుణంపై 9.1 శాతం వ‌డ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
  5. తీసుకున్న రుణాన్ని 36 నెల‌ల‌లోపుగా తిరిగి చెల్లించాలి.
  6. 7వ సంవ‌త్స‌రం నుంచి రుణం మంజూరు చేయారు. ఖాతా నుంచి పాక్షిక విత్‌డ్రాల‌ను అనుమ‌తిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని