కోవిడ్‌-19 చికిత్స‌కు వ్య‌క్తిగ‌త రుణం.. వ‌డ్డీ ఎంతంటే.. 

కోవిడ్‌ పాజిటివ్ వ‌చ్చిన వారి చికిత్సకు అయ్యే ఖ‌ర్చుల కోసం ఈ రుణాన్ని మంజూరు చేస్తారు

Updated : 01 Jun 2021 11:38 IST

ప్రభుత్వ రంగ బ్యాంకులు.. కోవిడ్ -19 చికిత్స కోసం రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తున్నాయి. ఒక వ్య‌క్తి అత‌ను/ ఆమె కోసం గానీ, కుటుంబ స‌భ్యుల చికిత్స కోసం గానీ ఈ రుణాన్ని ఉపయోగించవచ్చు. జీతం పొందే వ్య‌క్తులు, జీతం ద్వారా ఆదాయం పొంద‌ని వారు, పెన్ష‌న‌ర్లు కూడా ఈ రుణాల‌ను పొంద‌వ‌చ్చు. 

ఎస్‌బీఐ..
స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(ఎస్‌బీఐ) చైర్మెన్‌, దినేష్ ఖారా చెప్పిన వివ‌రాల ప్ర‌కారం కనీసం రూ.25వేల రుణాన్ని తీసుకోవ‌చ్చు. గ‌రిష్టంగా రూ.5ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం తీసుకునేందుకు వీలుక‌ల్పిస్తుంది బ్యాంక్‌. తిరిగి చెల్లించేందుకు గ‌రిష్టంగా 5 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితి ఉంటుంది. వార్షిక‌ వ‌డ్డీ రేటు 8.5 శాతం ఉంటుంది. 

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఎస్‌బీఐతో పాటు మ‌రికొన్ని బ్యాంకులు కూడా కోవిడ్‌-19 చికిత్స కోసం వ్య‌క్తిగత‌ రుణాలు అందిస్తున్నాయి. యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్ర‌కారం, యూనియ‌న్ ప‌ర్స‌న‌ల్ లోన్ ఫ‌ర్ కోవిడ్‌-19(యూపీఎల్‌సిటి) పేరుతో కొత్త వ్య‌క్తిగ‌త రుణాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఏప్రిల్‌1,2021 నాటికి, ఆ త‌రువాత కోవిడ్‌-19 పాజిటివ్ వ‌చ్చిన వారి చికిత్సకు అయ్యే ఖ‌ర్చుల కోసం ఈ రుణాన్ని మంజూరు చేస్తారు. వార్షిక వ‌డ్డీ రేటు 8.5 శాతం . ఈఎమ్ఐ రూపంలో చెల్లింపులు చేయ‌వ‌చ్చు. తిరిగి చెల్లించేందుకు మారిటోరియం పిరియ‌డ్‌తో క‌లిపి గ‌రిష్టంగా ఐదేళ్ల కాల‌ప‌రిమితి ఉంటుంది. సాధార‌ణంగా, వ్య‌క్తిగ‌త రుణాల‌పై పీఎస్‌బీ బ్యాంకులు 14-18 శాతం వ‌డ్డీ వ‌సూలు చేస్తాయి. 

కెన‌రా బ్యాంక్‌..
కెన‌రా బ్యాంకు కూడా సుర‌క్షా ప‌ర్స‌న‌ల్ లోన్ పేరుతో ఇదే విధ‌మైన రుణాన్ని ఆఫ‌ర్ చేస్తుంది. క‌నీసం రూ.25వేలు, గ‌రిష్టంగా రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం అందిస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు లేదు. ఈ కెన‌రా సుర‌క్షా ప‌థ‌కం కూడా 6 నెల‌ల మారిటోరియంతో వ‌స్తుంది. ఈ రుణాలు సెప్టెంబ‌రు30,2021 వ‌ర‌కు అందుబాట‌లో ఉంటాయ‌ని బ్యాంకు తెలిపింది.

అర్హ‌త‌..
ఈ కింది మూడు అర్హ‌త ప్ర‌మాణాలు ఉన్న‌వారికి రుణం మంజూరు చేస్తున్నాయి బ్యాంకులు
1. గ‌త 12 నెల‌లుగా బ్యాంకు ద్వారా జీతాలు, పెన్ష‌న్ తీసుకుంటున్న వినియోగ‌దారులు
2. బ్యాంకు నుంచి రిటైల్ (గృహ‌, వాహ‌న‌, త‌న‌ఖా, వ్య‌క్తిగ‌త రుణం, క్యాష్ లోన్)  రుణాలు తీసుకున్న‌వారు
3. జీతం ద్వారా కాకుండా ఇత‌ర మార్గాల ద్వారా ఆదాయం పొంద‌తూ బ్యాంకులో పొదుపు ఖాతా, క‌రెంటు ఖాతాను నిర్వ‌హిస్తూ క్ర‌మం త‌ప్ప‌కుండా ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేస్తున్న వ్య‌క్తులు.

చివ‌రిగా..
కోవిడ్‌-19 చికిత్స కోసం త‌క్కువ వ‌డ్డీకే వ్య‌క్తిగ‌తం రుణం ల‌భిస్తున్నా.. తాత్కాలికంగా లిక్విడిటీ స‌మ‌స్య‌ను ఎదురైన‌ప్పుడు మాత్ర‌మే వీటిని ఎంచుకోండి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో అప్పులు తీసుకోవ‌డం అంత మంచిది కాదు. కొత్త‌గా రుణం తీసుకునేకంటే ప్ర‌స్తుతం ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి వాటిని ర‌ద్దు చేయ‌డం మంచిద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని