ప్రై‘వేటు’ బాట! 

దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. గతేడాది భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రైవేటు సంస్థలను ఆహ్వానించినా.. కరోనా పరిస్థితులు, అంతర్జాతీయంగా........

Updated : 12 Feb 2021 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. గతేడాది భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రైవేటు సంస్థలను ఆహ్వానించినా.. కరోనా పరిస్థితులు, అంతర్జాతీయంగా కుదేలైన మార్కెట్ల కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ ఏడాది ఆ ప్రక్రియను కచ్చితంగా పూర్తి చేయాలనే లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర సర్కార్‌ పెట్టుబడుల ఉపసంహరణల ద్వారానే 1.70 లక్షల కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు ఉన్నా స్వదేశీ ఉత్పత్తి నామమాత్రంగానే ఉందని మదనపడుతున్న మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణ, నిధుల ఉపసంహరణతో ఆ లోటు భర్తీ చేస్తామని ధీమాగా చెబుతోంది. అసలు ప్రైవేటీకరణపై కేంద్రం ఆలోచనలేంటి? అనుసరిస్తున్న విధివిధానాలేంటి?

రెండో దఫాలో మరింత దూకుడుగా..!
స్వాతంత్ర్యం అనంతరం పరిపాలన మొదలైనప్పటి నుంచి భిన్నమైన ఆర్థిక విధానాలను భారత్‌ అనుసరిస్తోంది‌. పూర్తి పారిశ్రామిక విధానాలకు మొగ్గు చూపని నాటి పాలకులు మొత్తం కూడా ప్రభుత్వం చేతుల్లో ఉంచుకునేందుకూ ప్రయత్నించలేదు. మిశ్రమ విధాన ఆర్థిక వ్యవస్థను రూపొందించి అవసరాల మేరకు ఎప్పటికప్పుడు విధివిధానాలను మార్చుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రైవేటీకరణ విధానం వేగం పుంజుకుంటోంది. 1991లో అప్పటి ఆర్థిక మంత్రి డా.మన్మోహన్‌ సింగ్‌ అనుసరించిన విధానాలకు కొనసాగింపుగా మరింత దూకుడు ప్రదర్శిస్తోంది మోదీ సర్కార్‌. తన రెండో దఫా పాలనలో దేశంలోని మరిన్ని ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిధులు సమీకరించాలని వడివడిగా అడుగులు వేస్తోంది. 

అయితే ప్రైవేటీకరణ లేకపోతే మూత..!
అయితే, ప్రైవేటీకరణ.. లేదంటే పూర్తిగా మూత. గతంలో ఇంత బలంగా ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చిన ప్రభుత్వాలు లేవు. ప్రజల నుంచి, ఆయా సంస్థల ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడిలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటీకరణకు మొగ్గు చూపలేదు. ఏళ్లకు ఏళ్లు నష్టాల బాటలో నడుస్తున్నా.. చూస్తూ ఉండిపోయాయి. కానీ మోదీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఏదిఏమైనా తాము అనుకున్న సంస్థలను ప్రైవేటీకరించి తీరుతామని చెబుతోంది. కరోనా కారణంగా భారీగా తగ్గిపోయిన ఆదాయం, పెరిగిపోయిన ఖర్చులను సర్దుబాటు చేయడంతో పాటు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యాలు చేరుకునేందుకు ప్రైవేటీకరణ ద్వారా నిధులు సమకూర్చుకోవడమే సరైన మార్గమని చెబుతోంది.

ప్రైవేటీకరణకు ముఖ్యకారణం నిధుల సమీకరణే కాదంటున్న కేంద్రం.. కొన్ని సంస్థలు ప్రభుత్వానికి గుదిబండలా మారి ఏటికేడు అప్పుల కుప్పలుగా మారుతున్నాయని చెబుతోంది. అలాంటి సంస్థలను వదిలించుకోవటం మేలని భావిస్తోంది. ఇప్పటికే అనేక పర్యాయాలు నిధులు అందించినా కోలుకోలేని సంస్థలను ఇంకా నడపడం ప్రభుత్వానికి అదనపు భారమంటున్న కేంద్రం..  వాటిని పూర్తిగా ప్రైవేటు పరం చేయనున్నట్లు చెబుతోంది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ గురించి. ప్రారంభ దశలో దేశవాసులకు మొబైల్‌ సేవలందించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రైవేటు పోటీతో వెనుకబడిపోయింది. వినియోగదారుల్ని చేరుకోవడంలో ఇబ్బందులు పడుతోంది. తగ్గిన కేటాయింపులు, కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకోవడంలో లేని తోడ్పాటే ఈ పరిస్థితికి కారణమని నిపుణులు విమర్శిస్తున్నా.. వాటిని పట్టించుకోని పాలక పక్షాలు ప్రైవేటీకరణ తథ్యమని తేల్చి చెబుతున్నాయి.

ఎయిరిండియా ద్వారా రూ.15వేల కోట్లు
దేశవ్యాప్తంగా 1.75లక్షల మంది ఉద్యోగులతో అన్ని ప్రాంతాలకు విస్తరించి ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ వివిధ కారణాలతో అప్పుల ఊబిలో చిక్కుకుపోయింది. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బయటపడే మార్గం కనిపించడం లేదంటున్న కేంద్రం.. ఈ సంస్థను త్వరలోనే ప్రైవేటు వ్యక్తులకు విక్రయించనున్నట్లు తెలిపింది. దీంతో పాటే ప్రైవేటు పరం కానున్న మరో సంస్థ మహారాజుగా కీర్తి గడించిన ఎయిర్‌ఇండియా. ప్రభుత్వ అధీనంలో విమానయాన రంగంలో విశేషంగా సేవలందించిన ఈ సంస్థ కూడా అప్పుల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. అందుకే ఎప్పుడెప్పుడు విక్రయిద్దామా అని ప్రయత్నాలు చేస్తోంది కేంద్రం. గతంలోనే ఎయిరిండియా విక్రయానికి బిడ్లు ఆహ్వానించినా పెద్దగా స్పందన రాలేదు. దీంతో వాటిని రద్దు చేసిన కేంద్రం ఇప్పుడు మరో మారు విక్రయ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ సంస్థ విక్రయం ద్వారా రూ.15వేల కోట్లు సమీకరించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

26 సంస్థల విక్రయానికి నిర్ణయం?
సమాచార హక్కు చట్టం ప్రకారం వివిధ మాధ్యమాలు ప్రభుత్వం విక్రయించనున్న సంస్థల జాబితా కోరాయి. వాటిలో ఏయే సంస్థల్లో వాటాలు విక్రయించనున్నారని అడిగాయి.  అందుకు కేంద్ర ఆస్తుల నిర్వహణ సంస్థ అందించిన వివరాల ప్రకారం దాదాపు 26 సంస్థల విక్రయానికి లేదా వాటాలు వదులుకొనేందుకు కేంద్రం నిర్ణయించినట్లు వెల్లడైంది. వాటిలో ఎరువుల మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్న మినీరత్న సంస్థ ప్రాజెక్టు అండ్‌ డెవలపమెంట్‌ ఇండియా లిమిటెడ్‌ (పీడీఐఎల్‌), ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్సు (ఈపీఐఎల్‌), పవన్‌ హన్స్‌ (పీహెచ్‌ఎల్‌),  బీ అండ్‌ ఆర్ కంపెనీ లిమిటెడ్‌‌, ఎయిరిండియా, సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌  (సీఈఎల్‌), సిమెంట్‌ కార్పోరేషన్‌ ఇండియా లిమిటెడ్‌ (సీసీఐఎల్‌), ఇండియన్‌ మెడిసిన్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐఎంపీసీఎల్‌), సేలం స్టీల్‌ ప్లాంట్‌, భద్రావతి స్టీల్‌ ప్లాంట్‌, దుర్గాపూర్‌ స్టీల్‌ ప్లాంట్‌లను ప్రైవేటు పరం చేయనున్నారు.

ఏయే సంస్థల ప్రై‘వేటు’
ఫెర్రో స్క్రాప్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఎఫ్‌ఎస్‌ఎన్‌ఎల్‌), ఎన్‌డీఎంసీ నాగర్నార్‌ స్టీల్‌ ప్లాంట్‌, బీఈఎంఎల్‌, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్‌‌, దేశంలోనే అతిపెద్ద చమురు విక్రయదారుగా ఉన్న భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌)ను సైతం విక్రయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటే ప్రతిష్ఠాత్మక షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ‌), భారతీయ రైల్వేలకు చెందిన నవరత్న సంస్థ అయిన కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఓఎన్‌సీఓఆర్‌), నీలాచల్‌ ఇస్పత్‌ నిగమ్‌ లిమిటెడ్ (ఎన్‌ఐఎన్‌ఎల్‌)‌, హిందూస్థాన్‌ ప్రీఫాబ్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీఎల్‌) సంస్థలు ప్రైవేటు పరం కానున్నాయి.  కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సెంట్రిప్యూజ్‌ పంపులు, తీవ్ర ఒత్తిడి ఉండే గ్యాస్‌ సిలిండర్లను, ఇతర ఎన్నో విద్యుత్‌ పంపులను తయారు చేసే భారత్‌ పంప్స్‌ అండ్‌ కంప్రెసర్స్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహనాలు, వాహన విడి భాగాలు తయారు చేసే స్కూటర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఐఎల్‌), హిందుస్థాన్ న్యూస్‌ ప్రింట్స్‌ లిమిటెడ్ (హెచ్‌ఎన్‌ఎల్‌), కర్ణాటక యాంటీ బయోటిక్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్ (‌కేఎల్‌పీఎల్‌), బెంగాల్‌ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్ (బీసీపీఎల్‌)‌, హిందుస్థాన్‌ యాంటీ బయెటిక్స్‌ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్‌),  ఇండియన్‌ టూరిజం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ (ఐటీడీసీ), హిందుస్థాన్‌ ఫ్లోరోకార్బన్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎఫ్‌ఎల్‌) నుంచి తన భాగస్వామ్యాన్ని వదులుకుని అందుకు ప్రతిగా భారీగా నిధులు రాబట్టుకోవాలని చూస్తోంది కేంద్రం.

వీటికి అదనంగా త్వరలోనే 2 ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఓ బీమా సంస్థను ప్రైవేటు పరం చేయనున్నట్లు ఇటీవలి బడ్జెట్‌లో స్పష్టం చేశారు ఆర్థిక మంత్రి సీతారామన్‌. అయితే ఏయే సంస్థలు అనే వివరాలు తెలపలేదు. మొత్తంగా ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో 348 సంస్థలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలో వీటిని ప్రైవేటు సంస్థలకు విక్రయించడం ద్వారా 24 సంస్థలు మాత్రమే అంటిపెట్టుకోవాలని కేంద్రం దృఢ నిశ్చయంతో ఉంది. కాగా ఈ ప్రక్రియను నీతి ఆయోగ్‌ నేరుగా పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే కొన్ని సంస్థలను గుర్తించి వాటిని పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని, లేకుంటే మెజారిటీ నిధులను ఉపసంహరించుకోవాలని సూచించింది. అందుకు తగ్గట్టే ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది.

వర్గీకరణ ఇలా..

సంస్థల విక్రయాన్ని, నిధుల ఉపసంహరణకు వ్యూహాత్మక సంస్థలు, వ్యూహాత్మకం కాని సంస్థలుగా వర్గీకరించారు. వ్యూహాత్మక రంగంలో ప్రస్తుతానికి 18 సంస్థల్ని గుర్తించింది ప్రభుత్వం. వాటిలో బ్యాంకింగ్‌, బీమా, స్టీలు, ఎరువులు, ముడిచమురు, గ్యాస్‌, రక్షణ పరికరాల ఉత్పత్తి, అణు ఇంధనం, అంతరిక్షం, రవాణా, టెలికం, విద్యుత్‌, బొగ్గు, ఇతర ఖనిజాలు, నౌకా నిర్మాణం, విమానాశ్రయాలు, అభివృద్ధి నిర్వహణ, పోర్టులు, హైవేలు, కాంట్రాక్టు నిర్మాణం, సాంకేతిక సహకార సేవలు, ఆర్థిక సేవలకు వీటిలో చోటు కల్పించారు. ఇకపై కేవలం ఈ రంగాలల్లోని సంస్థల్లోనే ప్రభుత్వం యాజమాన్య హోదాలో కొనసాగనుండగా.. మిగిలిన వాటాలను విక్రయించనుంది.

ఎన్డీయే సర్కార్‌ మొదట్నుంచీ ఇదే మంత్రం జపిస్తోంది. ప్రైవేటీకరణే తమ విధానంగా చెబుతోంది. ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించాలంటే ఇది తప్పదంటోంది. అయితే ప్రైవేటీకరణ అని.. కాకపోతే నిధుల ఉపసంహరణ అని వివరిస్తోంది. మొదటి దఫా నుంచే ఈ ప్రక్రియ చేపడుతున్నా.. ఇప్పుడు అది వేగం పుంజుకుంది. బ్యాంకులు, రైల్వే శాఖ సహా ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటు ముద్ర కనిపిస్తునే ఉంది. అయితే ఈ ఉనికిని మరింత విస్తరించి క్రమంగా ఆయా కంపెనీల సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగానే మొదటి నుంచి ఈ ప్రక్రియను చేపడుతూ వచ్చింది మోదీ ప్రభుత్వం. 

‘‘ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా నిధుల ఉపసంహరణ చేపడతాం. దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటాం. గత విధానాలకు చెల్లుచీటీ రాసి కొత్తగా తీసుకువస్తున్న విధానమిది. గతేడాది మే 17న ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం ప్రకటించిన సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పిన మాటలివి. ఆ ప్రకటనకు కొనసాగింపుగా ఈ ఏడాది పద్దులను ఇందుకు సంబంధించి స్పష్టతనిచ్చారు ఆర్థికమంత్రి సీతారామన్‌. పీఎస్‌యూలను ప్రైవేటీకరణ చేయాలంటే ముందుగా ఆయా సంస్థల జాబితా తయారు చేసి వాటిలో నిర్ణీత కంపెనీలనే ప్రైవేటుపరం చేసేవారు. ఇప్పుడు ఈ ప్రక్రియలోనూ మార్పు తీసుకువచ్చింది కేంద్రం. నిర్దిష్ట సంస్థల్లో పూర్తిగా నిధుల ఉపసంహరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. 

1996 నుంచి ఉపసంహరణ వేగం!

ప్రైవేటీకరణలో భాగంగా మోదీ సర్కారు అనుసరిస్తున్న విధానమే పెట్టుబడుల ఉపసంహరణ. దేశంలో పెట్టుబడుల ఉపసంహరణ 1991లో మొదలైనప్పటికీ.. 1996లో వేగం పుంజుకుంది. అప్పటి ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దాదాపు 7 సంస్థల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. అయితే ఇవన్నీ సమస్యల వలయంలో చిక్కకున్నాయి. ఆ తర్వాత వచ్చిన మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం పదేళ్లలో 3 సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించింది. ఆరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధుల ఉపసంహరణ చేసింది. పలు సంస్థల్లో 50శాతం కంటే తక్కువకు ప్రభుత్వ వాటా తగ్గించుకున్నారు.

1991 నుంచి చూస్తే మొత్తం రూ.3.63లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా; వాటిలో రూ.2.1లక్షల కోట్ల ఉపసంహరణలు ఎన్డీయే-1 పాలనలోనే మొదలైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. యూపీఏ హయాంతో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు. ఎన్డీయే-1 హయాంలో 9 అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను ఐటీడీసీ హోటళ్లు విక్రయించి రూ.5544 కోట్లు సమకూర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. భారత్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ విక్రయం విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ సంస్థకు చెందిన 51శాతం వాటాలను అనిల్‌ అగర్వాల్‌ వేదాంత గ్రూప్‌నకు రూ.551కోట్లకు విక్రయించింది కేంద్రం.

తొలిసారి 31 పీఎస్‌యూల నుంచి..

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలంటే ముందుగా ప్రభుత్వం వాటి నిర్వహణ బాధ్యతలనుంచి క్రమంగా తప్పుకోవాలి. అంటే ఆయా సంస్థల్లో పెట్టే పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలి. మొదటిసారి 1991-92 మధ్య కాలంలో 31 పీఎస్‌యూల నుంచి రూ.3,300 కోట్ల మేర పెట్టుబడులు ఉపసంహరించారు. 1996 ఆగస్టులో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్‌ మరో 57 పీఎస్‌యూల నుంచి నిధుల ఉపసంహరణకు మార్గనిర్దేశనం చేసింది. 1991-92 నుంచి 2000-01 వరకు రూ.54,300 కోట్లు సమీకరిస్తారని అంచనా వేసినా ఇది మొత్తంగా రూ.20 వేల కోట్లకు మించలేదు. మార్కెట్‌లో ఒడిదొడుకులు, ప్రభుత్వం-పెట్టుబడిదారుల మధ్య సయోధ్య కుదరకపోవడం, పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలు చాలా రోజులపాటు వెంటాడాయి.

బ్యాంకుల విషయానికొస్తే..

రెండు ప్రభుత్వరంగ బ్యాంకులను త్వరలోనే ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఆయా బ్యాంకులను నిరర్ధక ఆస్తుల సమస్య నుంచి బయటపడేసేందుకే విలీన విధానాన్ని అనుసరించింది. రైల్వే శాఖలోనూ ప్రైవేటీకరణకు పచ్చ జెండా ఊపింది. 150 రైల్వేస్టేషన్ల నిర్వహణను కార్పొరేట్లకు అప్పగించాలని చూస్తోంది. 109 మార్గాల్లో 151 ఆధునిక రైళ్ల ద్వారా ప్యాసింజర్‌ రైళ్లను నడపడానికి రైల్వే మంత్రిత్వశాఖ ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తులని కోరింది. ఈ ప్రాజెక్టులో ప్రైవేటురంగ పెట్టుబడులు రూ.30 వేల కోట్లు. ఇప్పటికే ఐఆర్‌సీటీసీ మొదటి ప్రైవేటు రైలు లఖ్‌నవూ-దిల్లీ తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. నిర్వహణ వ్యయం తగ్గించడం, ఉద్యోగావకాశాలను పెంచడం కేంద్రం ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని