Papad-GST: అప్పడంపై జీఎస్టీ.. గొయెంకా ట్వీట్‌పై సీబీఐసీ క్లారిటీ

మనం భోజనంతో పాటు తీసుకునే ఆహార పదార్థాల్లో ఒకటైన అప్పడం ఏ ఆకారంలో ఉన్నా దానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తించబోదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) స్పష్టతనిచ్చింది.

Published : 01 Sep 2021 21:01 IST

దిల్లీ: మనం భోజనంతో పాటు తీసుకునే ఆహార పదార్థాల్లో ఒకటైన అప్పడం ఏ ఆకారంలో ఉన్నా దానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వర్తించబోదని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) స్పష్టతనిచ్చింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్షా గొయెంకా మంగళవారం దీనిపై ట్వీట్‌ చేయడంతో సోషల్‌మీడియాలో దీనిపై పెద్ద చర్చే నడిచింది. ఆ ట్వీట్‌కు తాజాగా సీబీఐసీ బదులివ్వడంతో చర్చకు తెరపడింది.

‘‘చతురస్రాకారంలో ఉన్న అప్పడంపై జీఎస్టీ వేస్తున్నారు. మరి వృత్తాకారంలో ఉన్న అప్పడంపై మాత్రం ఎందుకు వేయడం లేదు?’’ అంటూ ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ హర్షా గొయెంకా మంగళవారం ట్వీట్‌ చేశారు. దీని వెనుక ఉన్న లాజిక్‌ ఏంటో తనకు అంతుపట్టడం లేదని, ఎవరైనా ఛార్టెట్‌ అకౌంటెంట్‌ తనకు వివరిస్తారా అంటూ పేర్కొన్నారు. దీనిపై అక్కడికి కొద్ది గంటల్లోనే సీబీఐసీ స్పందించింది. ఆకారంతో సంబంధం లేకుండా అప్పడం ఏదైనా జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని పేర్కొంది. జీఎస్టీ నోటిఫికేషన్‌ No.2/2017-CT(R)లోని No. 96లో పేర్కొన్నట్లు తెలిపింది. సంబంధిత నోటిఫికేషన్‌ cbic.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందంటూ గొయెంకా ట్వీట్‌కు బదులిచ్చింది.

గొయెంకా ట్వీట్‌ చేయడం, అక్కడికి కొద్ది గంటల్లోనే సీబీఐసీ బదులు ఇవ్వడం జరిగిపోయినప్పటికీ.. హర్షా గొయెంకా చేసిన ట్వీట్‌కు మాత్రం నెటిజన్లు ఆసక్తికరంగా సమాధానాలు ఇవ్వడం గమనార్హం. ‘వృత్తాకారంలో ఉన్నవి చేత్తో చేస్తారు.. వేరే ఆకారంలో ఉన్నవి మెషిన్‌తో చేస్తారు’ అంటూ తమకు తోచిన రీతిలో ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ‘‘వృత్తాకార అప్పడమనేది పాత కాలం నాటిది కాబట్టి జీఎస్టీ లేదు. అదే చతురస్రాకారంలో ఉన్నవి సంప్రదాయాలకు చెల్లుచీటి పాడుతున్నాయ్‌ కాబట్టి జీఎస్టీ ఉంది’ అంటూ మరో నెటిజన్‌ తన విజ్ఞాన ప్రదర్శనను చూపెట్టాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని