Paytm: 2 రోజుల్లో రూ.50 వేల కోట్ల పేటీఎం సంపద ఆవిరి!

పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు మదుపర్లకు తీవ్ర నష్టాన్ని కట్టబెడుతున్నాయి. గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అడుగిడిన తొలి రోజే భారీగా కుప్పకూలిన ఈ స్టాక్‌ విలువ మరింత దిగజారుతోంది....

Updated : 22 Nov 2021 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేటీఎం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేర్లు మదుపర్లకు తీవ్ర నష్టాన్ని కట్టబెడుతున్నాయి. గత గురువారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అడుగిడిన తొలి రోజే భారీగా కుప్పకూలిన ఈ స్టాక్‌ విలువ మరింత దిగజారుతోంది. ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో ఏకంగా 14 శాతం కుంగి మదుపర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇష్యూ ధర రూ.2,150 కంటే బీఎస్‌ఈలో దాదాపు 41 శాతం నష్టపోయి రూ.1,271 వద్ద కనిష్ఠాన్ని తాకింది. దీంతో ఇష్యూ ధర వద్ద కంపెనీ మార్కెట్‌ విలువ రూ.1.39 లక్షల కోట్లు కాగా.. దాంట్లో దాదాపు రూ.56 వేల కోట్ల సంపద ఆవిరైంది. చివరకు 12.89 శాతం నష్టంతో రూ.1,359.60 వద్ద స్థిరపడింది.

36 శాతం పెట్టుబడి ఆవిరి..

పేటీఎం పబ్లిక్‌ ఇష్యూలో ఒక లాట్‌కు 6 షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2,150 ప్రకారం ఒక లాట్‌కు పెట్టుబడి రూ.12,900 అయ్యింది. బీఎస్‌ఈలో ప్రస్తుతం ఉన్న రూ.1,366తో పోలిస్తే.. పెట్టుబడి విలువ రూ.8,196కి తగ్గింది. ఈ ప్రకారం చూస్తే.. మదుపరికి రూ.4,704 నష్టం వచ్చింది. అంటే 36 శాతం పెట్టుబడి ఆవిరైంది. ఐపీఓలో షేరు ధర అధికంగా నిర్ణయించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

రిలయన్స్ డౌన్‌..

ఇక సౌదీ ఆరామ్‌కోతో 15 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చొన్న రిలయన్స్‌.. దాన్ని పునఃమదింపు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, దాదాపు ఈ డీల్‌ రద్దయినట్లేనని మార్కెట్‌ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో రిలయన్స్‌ షేరు విలువ ఈరోజు ట్రేడింగ్‌లో ఓ దశలో 4.5 శాతానికి పైగా కుంగి రూ.2,352 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరకు 4.43 శాతం నష్టంతో రూ.2,363.75 వద్ద ముగిసింది.

ఎగబాకిన ఎయిర్‌టెల్‌..

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ ఛార్జీలను పెంచింది. దీంతో షేరు ధర ఈరోజు ట్రేడింగ్‌లో 4 శాతానికి పైగా పెరిగి రూ.756 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు రూ.742 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని