Paytm IPO: ఇన్వెస్టర్లకు నో ‘క్యాష్‌బ్యాక్‌’.. లిస్టింగ్‌ రోజే 27 శాతం క్షీణించిన పేటీఎం షేరు!

ఎన్నో అంచనాల మధ్య స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ మదుపర్లకు నిరాశ మిగిల్చింది.

Updated : 18 Nov 2021 20:22 IST

దిల్లీ: ఎన్నో అంచనాల మధ్య స్టాక్‌ మార్కెట్‌లో లిస్టింగ్‌ అయిన పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్‌ మదుపర్లకు నిరాశ మిగిల్చింది. లిస్టింగ్‌ రోజైన గురువారం ప్రారంభంలోనే 9 శాతం మేర క్షీణించిన షేరు విలువ.. ట్రేడింగ్‌ ముగిసేనాటికి 27 శాతం మేర పడిపోయింది. ఇష్యూ ధర రూ.2,150 కాగా.. బీఎస్‌ఈలో ఆరంభంలోనే రూ.1955 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ముగిసేనాటికి 27.25 శాతం క్షీణించిన షేరు విలువ రూ.1564కు పరిమితమైంది. ఇక ఎన్‌ఎస్‌ఈలోనూ 1,950 వద్ద ప్రారంభమైన షేరు విలువ ట్రేడింగ్‌ ముగిసే నాటికి 27.34 శాతం క్షీణించి రూ.1562కి పరిమితమైంది.

ఓ వైపు కంపెనీ షేరు విలువ క్షీణించినప్పటికీ కంపెనీ మార్కెట్‌ విలువ మాత్రం రూ.లక్ష కోట్లు దాటింది. గురువారం మధ్యాహ్నం కంపెనీ మార్కెట్‌ విలువ బీఎస్‌ఈలో రూ.1,01,484.00 (లక్ష కోట్లు)గా నమోదైంది. ఇటీవల ఐపీవోకు వచ్చిఇన జొమాటో (1.22 లక్షల కోట్లు) కంటే ఇది తక్కువే అయినప్పటికీ.. మరో కంపెనీ నైకా (1.01 లక్షల కోట్లు) కంటే కాస్త ఎక్కువగా ఉండడం గమనార్హం. రూ.18,300 కోట్ల సమీకరణే లక్ష్యంగా పేటీఎం నిర్వహించిన ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు 1.89 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు వచ్చాయి. కేవలం భారత్‌లోనే కాదు.. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అతిపెద్ద ఐపీవో. దీని కంటే ముందు మన దేశంలో 2010లో కోల్‌ ఇండియా తీసుకొచ్చిన రూ.15,200 కోట్ల ఐపీవోనే ఇప్పటి వరకు అతిపెద్దది.

షేరు విలువ పడిపోవడానికి కారణాలివేనా...?

* పేటీఎం షేరు విలువను అధికంగా నిర్ణయించడం వల్లే లిస్టింగ్‌ రోజు షేరు విలువ పడిపోవడానికి కారణమని మార్కెట్‌ అనలిస్టులు చెబుతున్నారు.
* పేటీఎంకు చెందిన ప్రమోటర్లలో 75 శాతం మంది ఇతర దేశాలకు చెందిన వారే కావడం మరో కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీవోలో వీరి వాటానే రూ.10వేల కోట్లకు పైగా ఉండడం గమనార్హం.
* వన్‌97 కమ్యూనికేషన్‌ అనుసరిస్తున్న వ్యాపార నమూనాకు ఒక దిశ అంటూ ఏదీ లేదని విదేశీ బ్రోకరేజీ సంస్థ మాక్వరీ తప్పుబట్టింది. కంపెనీ లాభదాయకత సాధించడం అంత సులువేమీ కాదని పేర్కొనడం కూడా షేరు విలువపై ప్రభావం చూపించింది.
* బిల్‌ పేమెంట్స్‌, రీఛార్జి వంటి ఆర్థిక సేవలు అందిస్తున్న పేటీఎం.. మార్కెట్‌లో ఒక పోటీ సంస్థగా ఉందే తప్ప మార్కెట్‌లో అగ్రగామిగా లేదు. ఫోన్‌పే, గూగుల్‌పే, అమెజాన్‌ పే వంటివి గట్టి పోటీనిస్తుండడంతో మదుపర్లు పేటీఎం షేరును కొనుగోలుకు ఆసక్తి చూపలేదనేది విశ్లేషకుల మాట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని