Paytm shares: బ్రోకరేజీ సంస్థ అంచనాలతో మరోసారి పేటీఎం షేర్‌ డౌన్‌..!

పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు విలువ మరింత పతనమైంది. కంపెనీ భవిష్యత్‌ ఆదాయం మునుపటి అంచనాల కంటే తక్కువే ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకేరేజీ సంస్థ మాక్వరీ సెక్యూరిటీస్‌ ఇండియా అంచనాలతో షేరు విలువ మరింత క్షీణించింది.

Published : 10 Jan 2022 21:26 IST

ముంబయి: పేటీఎం మాతృ సంస్థ వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ షేరు విలువ మరింత పతనమైంది. కంపెనీ భవిష్యత్‌ ఆదాయం మునుపటి అంచనాల కంటే తక్కువే ఉండొచ్చని అంతర్జాతీయ బ్రోకేరేజీ సంస్థ మాక్వరీ సెక్యూరిటీస్‌ ఇండియా అంచనాలతో షేరు విలువ మరింత క్షీణించింది. దీంతో జనవరి 10 (సోమవారం) నాటి ట్రేడింగ్‌లో 5 శాతం మేర షేరు విలువ కుంగి రూ.1159కి చేరింది. ఐపీవోకు వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు షేరు విలువ 45 శాతం పడిపోవడం గమనార్హం.

ఎన్నో అంచనాల మధ్య ఐపీవోకు వచ్చిన పేటీఎం.. మార్కెట్లోకి అడుగు పెట్టినరోజే బోల్తా కొట్టింది. ఇష్యూ ధర రూ.2,150 కాగా.. అంతకంటే తక్కువకే లిస్ట్‌ అయ్యింది. ఇదే మాక్వరీ సంస్థ అప్పట్లో పేటీఎం షేరు విలువ రూ.1200కు చేరుతుందని అంచనా వేసింది. తాజాగా ఆ అంచనాలను సవరించింది. భవిష్యత్‌లో షేరు విలువ రూ.900కు చేరుతుందని పేర్కొంది. అందుకు పలు కారణాలను పేర్కొంది.

డిజిటల్‌ పేమెంట్స్‌ ఛార్జీలపై ఆర్‌బీఐ పరిమితి విధించడం వల్ల కంపెనీ రెవెన్యూపై ప్రభావం పడుతుందని మాక్వరీ సంస్థ పేర్కొంది. పేటీఎం చేసుకున్న ఇన్సూరెన్స్‌ బ్రోకింగ్‌ దరఖాస్తును ఐఆర్‌డీఏ తిరస్కరించిందని, బ్యాంక్‌ లైసెన్స్ సాధించాలన్న పేటీఎం యత్నాలపైనా దీని ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇటీవల ఒకేసారి ముగ్గురు సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఆ సంస్థకు రాజీనామా చేయడాన్ని కారణంగా చూపుతూ.. భవిష్యత్‌లో పేటీఎం షేరు విలువ రూ.900కు చేరుకుంటుందని తెలిపింది. ఐపీవో నాటి విలువతో పోలిస్తే 58 శాతం తక్కువకు చేరుకునే అవకాశం ఉందని మాక్వరీ పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నాటి ట్రేడింగ్‌లో పేటీఎంకు షాక్‌ తప్పలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని