తప్పనిసరి ఖర్చులనూ తగ్గించుకుంటున్నారు!

‘పెట్రోలు, డీజిలు ధరలు పెరగడంతో ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. నిత్యావసరాలు, ఆరోగ్యం, వినియోగ వస్తువుల కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంధన ధరలు పెరగడానికి కారణమవుతున్న...

Published : 14 Jul 2021 18:21 IST

ఆరోగ్యం, నిత్యావసరాలపైనా నియంత్రణ
ఇంధన ధరలు పెరగడమే కారణం
ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు

ముంబయి: ‘పెట్రోలు, డీజిలు ధరలు పెరగడంతో ప్రజలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు సిద్ధం అవుతున్నారు. నిత్యావసరాలు, ఆరోగ్యం, వినియోగ వస్తువుల కొనుగోళ్లలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంధన ధరలు పెరగడానికి కారణమవుతున్న పన్నులు తగ్గించి, వాటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాల’ని ఎస్‌బీఐ ఆర్థికవేత్తల బృందంలోని చీఫ్‌ ఎకానమిక్‌ సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ విడుదల చేసిన ఒక నివేదికలో సూచించారు. దేశ వ్యాప్తంగా పెట్రోలు ధర రూ.100 దాటేసింది. డీజిల్‌ ధర సైతం దీనికి దరిదాపుల్లోనే ఉంది. ఇందులో రూ.40 వరకూ కేంద్ర, రాష్ట్రం విధిస్తున్న వివిధ పన్నుల రూపంలోనే ఉంటోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పుడు.. ప్రభుత్వాలు ఈ పన్నులను పెంచాయి. ఆ తర్వాత వీటిని సవరించలేదు. ‘వినియోగదారులు పెట్రోలు, డీజిల్‌పైనే ఎక్కువగా ఖర్చు చేస్తుండటంతో తప్పనిసరి అవసరాలైన ఆరోగ్యానికి సంబంధించిన, ఇతర నిత్యావసరాల కొనుగోళ్లపైన వ్యయాన్ని నియంత్రించుకుంటున్నారు. ఎస్‌బీఐ కార్డు వినియోగదారుల ఖర్చులను విశ్లేషించిన తర్వాత ఇది అర్థమయ్యింది. దీంతోపాటు వినియోగ వస్తువుల కొనుగోళ్లనూ వాయిదా వేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఫలితంగా ఈ వస్తువులకు గిరాకీ బాగా తగ్గింది’ అని సౌమ్య కాంతి తెలిపారు.

ఇంధన ధరలు అదుపు లేకుండా పెరిగితే.. ద్రవ్యోల్బణమూ ఆర్‌బీఐ అంచనాలను మించిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీన్ని నివారించాలంటే.. తక్షణమే పెట్రోలు, డీజిల్‌పై పన్నులను తగ్గించాలన్నారు. మేలో ద్రవ్యోల్బణం 6.30శాతం మాత్రమే ఉందని చెప్పడం సరైన లెక్క కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కుటుంబాల్లో పొదుపు మొత్తం తగ్గి, ఆర్థికంగా సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోందన్నారు. జల, వాయు, రైల్వే మార్గాల్లో సరకు రవాణా, తయారీ రంగం తదితర కీలకమైన గణాంకాలు మేతో పోలిస్తే జూన్‌లో మరింత క్షీణించాయని నివేదిక వెల్లడించింది. కొవిడ్‌-19 రెండో దశ ఇంకా ముగియలేదని పేర్కొంది. రోజుకు కనీసం 70లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినా.. మొత్తం 18 ఏళ్లు నిండిన దేశ ప్రజలకు రెండు డోసులు పూర్తయ్యేసరికి వచ్చే ఏడాది మార్చి వస్తుందని నివేదిక అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు