వ్య‌క్తిగ‌త రుణం Vs బైనౌ పేలేట‌ర్ Vs క్రెడిట్‌కార్డు.. ఇందులో ఏది మంచిది?

రుణం ఏదైనా బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌కపోతే అధిక వ‌డ్డీల‌ను చెల్లించాల్సి వ‌స్తుంది. 

Updated : 26 Nov 2021 17:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక అవ‌స‌రాల్లో ముందుగా గుర్తుకు వ‌చ్చేది వ్యక్తిగ‌త రుణం, క్రెడిట్ కార్డులు. ఎలాంటి హామీ, తాక‌ట్టు లేకుండా సుల‌భంగా రుణం తీసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా క్రెడిట్‌కార్డ్‌. నిర్ణీత కాలం పాటు వ‌డ్డీ లేని రుణాన్ని అందిస్తుంది కాబ‌ట్టి దీనికి క్రేజ్‌ ఎక్కువ. ఇలాంటి సేవ‌ల‌నే అందిస్తుంది బైనౌ-పేలేట‌ర్ (ఇప్పుడు కొనండి.. త‌రువాత చెల్లించండి) విధానం. ఇది క్రెడిట్ కార్డుల‌కు ప్ర‌త్యామ్నాయ మార్గమనే చెప్పాలి. మీకు కావ‌ల‌సిన వ‌స్తువుల‌ను ముందుగా కొనుగోలు చేసి నిర్ణీత తేదీలోపుగా డ‌బ్బు చెల్లించొచ్చు. కానీ క్రెడిట్ కార్డుకు, బైనౌ‍ పే‍ లేట‌ర్ విధానానికి వ్య‌త్యాసం ఉంది. అయితే క్రెడిట్ కార్డు మాదిరిగానే బ‌కాయిల‌ను స‌కాలంలో చెల్లించ‌కపోతే అధిక వ‌డ్డీల‌ను చెల్లించాల్సి వ‌స్తుంది.

వ్య‌క్తిగ‌త రుణం: మెడిక‌ల్ బిల్లులు, వాహనాల కొనుగోలు, వివాహం, గృహ రిపేర్లు వంటి వాటికి పెద్ద మొత్తంలో ఖ‌ర్చువుతుంది. ఇలాంటి వాటికి వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు. బ్యాంకులు రుణం జారీ చేసిన వెంట‌నే ఆ మొత్తం బ్యాంక్ ఖాతాలో జ‌మ‌వుతుంది. కాల‌వ్య‌వ‌ధి సాధార‌ణంగా 1-5 సంవ‌త్స‌రాలు ఉంటుంది. ఈ రుణాల‌పై వడ్డీ రేట్లు క్రెడిట్ కార్డుల‌తో పోలిస్తే త‌క్కువ‌గా ఉంటాయి. వార్షిక వ‌డ్డీ రేటు 10 నుంచి 24 శాతం వ‌ర‌కు ఉండే అవ‌కాశం ఉంది. ఇందులో రుణం తీసుకున్న తేది నుంచి వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. క్రెడిట్ కార్డుల మాదిరిగా వ‌డ్డీ లేని కాల‌వ్య‌వ‌ధి ఉండ‌దు. అలాగే చెల్లింపుల‌ను క్ర‌మానుగ‌తంగా చేయాల్సి ఉంటుంది. ముందస్తు చెల్లింపుల‌కు ఛార్జీలు వ‌ర్తించే అవ‌కాశం ఉంది.

బైనౌ-పేలేట‌ర్‌: బైనౌ-పేలేట‌ర్ (బీఎన్‌పీఎల్) విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఈ ప‌ద్ధ‌తిలో వ‌స్తువుల‌ను సుల‌భ వాయిదాల్లో కొనుగోలు చేయొచ్చు. అయితే ఇది అన్నిర‌కాల వ‌స్తు, సేవ‌ల‌కు అందుబాటులో ఉండే ఎండ్‌-టు-ఎండ్ క్రెడిట్ ఉత్ప‌త్తి కాదు. అర్హ‌త గ‌ల కొనుగోళ్ల‌కు మాత్ర‌మే ఈ విధానాన్ని వినియోగించుకోవ‌చ్చు. సుల‌భంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే, సున్నా వ‌డ్డీతో ఈఎంఐ స‌దుపాయంతో రుణం పొందొచ్చు. ఈ విధానం ప్రధానంగా ఇ-కామర్స్, ఫుడ్-ఆర్డరింగ్, రైడ్-షేరింగ్, ట్రావెల్ బుకింగ్, ఆన్‌లైన్ కిరాణా, సేవల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంది. స‌రైన ప్ర‌ణాళిక వేసుకుంటే వివాహానికి సంబంధించిన షాపింగ్‌, విహార యాత్ర‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు.

క్రెడిట్ కార్డులు: వ్యక్తిగ‌త రుణాల‌కు, బీఎన్‌పీఎల్‌కు మధ్య‌స్తంగా క్రెడిట్ కార్డులు ప‌నిచేస్తాయి. మీ క్రెడిట్ లిమిట్‌ ఉన్నంత‌వ‌ర‌కు అన్ని ర‌కాల చెల్లింపులు చేయవచ్చు. దీనిలో వ‌డ్డీ లేని కాలం ఉంటుంది కాబ‌ట్టి చెల్లింపులు స‌కాలంలో చేస్తే మంచిది. ఒక‌వేళ చెల్లించాల్సి మొత్తం ఎక్కువ‌గా ఉంటే క‌నీస మొత్తాన్ని చెల్లించి మిగిలిన అవుట్ స్టాండింగ్‌ మొత్తాన్ని 3 నుంచి 24 నెల‌ల కాలానికి ఈఎంఐలుగా మార్చుకుని చెల్లించే వీలుంటుంది. అయితే వ‌డ్డీ ఎంత ఉంటుంది అనేది కార్డు జారీదారు, చెల్లించాల్సిన మొత్తం, ఇత‌ర అంశాల‌పై ఆధారప‌డి ఉంటుంది. ఏది ఏమైనా స‌కాలంలో చెల్లింపులు చేస్తేనే మంచిది లేదంటే అధిక వ‌డ్డీ రేటు కార‌ణంగా ఖ‌రీదైన‌దిగా మారుతుంది. సాధారణంగా, క్రెడిట్ కార్డుపై వార్షిక వడ్డీ రేట్లు 36 శాతం పైనే ఉండొచ్చు.

క్రెడిట్ కార్డ్‌కు, బైనౌ-పేలేట‌ర్‌కు మ‌ధ్య వ్య‌త్యాసం ఏంటి?

క్రెడిట్ కార్డ్‌..
* క్రెడిట్ కార్డుల‌పై హిడెన్ ఛార్జీలు ఉంటాయి.

* క్రెడిట్ కార్డు పొందాలంటే మంచి క్రెడిట్ చ‌రిత్ర ఉండాలి.

* దాదాపు అన్నిచోట్ల క్రెడిట్ కార్డు వాడొచ్చు.

* నిర్దిష్ట వ‌డ్డీలేని కాల‌వ్య‌వ‌ధి ఉంటుంది.

* సుల‌భంగా ఆమోదం పొందొచ్చు.

* క‌నీస మొత్తాన్ని చెల్లించేందుకు అవ‌కాశం ఉంది. మిగిలిన బ‌కాయిల‌ను త‌ర్వాతి నెలలకు బ‌దిలీ చేయ‌వ‌చ్చు.

* కొనుగోళ్ల‌పై క్యాష్‌బ్యాక్‌, రివార్డు పాయింట్లు, ఎయిర్‌మైల్స్ పొందొచ్చు.

బైనౌ-పేలేట‌ర్‌..
* బీఎన్‌పీఎల్ పార‌ద‌ర్శ‌కంగా, త‌క్కువ‌ ధ‌ర‌లో వ‌స్తుంది.

* క్రెడిట్ చ‌రిత్ర త‌ప్ప‌నిస‌రికాదు.

* బీఎన్‌పీఎల్ సేవ‌లు/స‌దుపాయం ఎంపిక చేసిన ఇ-రీటైల‌ర్లు, ఫిన్‌టెక్ సంస్థ‌లు మాత్ర‌మే అందిస్తున్నాయి.

* వ‌డ్డీలేని కాల‌వ్య‌వ‌ధి 15 నుంచి 45 రోజుల వ‌ర‌కు ఉంటుంది.

* నిర్ణీత తేదీకి ఫిక్స్‌డ్‌ ఈఎంఐని చెల్లించాలి.

కొనుగోళ్ల‌పై క్యాష్‌బ్యాక్‌, రివార్డు పాయింట్లు, ఎయిర్‌మైల్స్ వంటి ప్ర‌యోజ‌నాలు ల‌భించ‌వు.

రుణం ఏ విధంగా తీసుకోవ‌డం మంచిది?
మూడు ప‌ద్ధ‌తుల్లోనూ అవసరాలు, వినోదం కోసం నిధులు స‌మ‌కూర్చుకోవ‌చ్చు. అయితే, మీ అవసరం, ఖర్చు, ప్రయోజనం, ముఖ్యంగా మీ రీపేమెంట్ సామర్థ్యం ఆధారంగా వీటిని ఎంచుకోవాలి. ఆలస్యమైనా లేదా తిరిగి చెల్లించని పక్షంలో మూడింటికీ భారీ జరిమానాలు విధిస్తారు. అలాగే, ఈ ప్ర‌భావం క్రెడిట్ స్కోరుపైనా ప‌డుతుంది. కాబ‌ట్టి రుణం తీసుకునే ముందే తిరిగి చెల్లించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసుకోండి. ఆ త‌రువాత రుణం కోసం ద‌రఖాస్తు చేసుకోండి. అలాగే దీర్ఘ‌కాల‌ ల‌క్ష్యాల కోసం పెట్టుబ‌డులు చేయ‌డం చాలా ముఖ్యం. రుణం తిరిగి చెల్లించేట‌ప్పుడు ఈ పెట్టుబ‌డులు ప్ర‌భావితం కాకుండా ప్లాన్ చేయ‌డం ముఖ్యం. అనవసరమైన వస్తు కొనుగోళ్ల కోసం క్రెడిట్ కార్డు వాడకం అయినా లేక బీఎన్పీఎల్, వ్యక్తిగత రుణం అయినా సరైనది కాదు. ఇది మీ ఆర్థికస్థితిగతులను దెబ్బ తీస్తుంది.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని