Personal Loan Vs OD: పర్సనల్‌ లోన్‌.. ఓవర్ డ్రాఫ్ట్.. ఏది మేలు?

ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో, ఇది ఒకే ఖాతాగా ఉంటుంది. అలాగే దానిని నిర్వహించడం కూడా చాలా సులభంగా ఉంటుంది.

Updated : 17 Aug 2021 17:34 IST

ఎప్పుడైనా మనకు నగదు అవసరం రావచ్చు. మీకు అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు, అత్యవసర నిధిని ఉపయోగించుకోవడమో లేదా బంధువుల నుంచి నగదును తీసుకోవడమో చేస్తుంటాం. ఒకవేళ స్నేహితులు లేదా బంధువులు మీకు సహాయం చేయలేకపోయినట్లైతే, అప్పుడు బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం లేదా ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌’ సదుపాయాన్ని ఎంచుకోవచ్చు. వ్యక్తిగత రుణం అనేది కారు రుణం లేదా గృహ రుణాల మాదిరిగా సురక్షితమైనది కాదు. ఒకవేళ మీరు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఎంచుకున్నట్లైతే.. మీ కరెంట్ ఖాతా ద్వారా డబ్బును తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇక్కడ మనం వ్యక్తిగత రుణం, ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని పోల్చి, ఈ రెండిటిలో ఏది ఉత్తమమైందో తెలుసుకుందాం!

వ్యక్తిగత రుణం..

* వ్యక్తిగత రుణాన్ని బ్యాంకు ఎలాంటి తనఖా లేకుండానే అందిస్తుంది. దీనిని అసురక్షిత రుణం అంటారు.

* ఈ రుణాన్ని పొందేందుకు ఆదాయ రుజువును తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మీ ఆదాయం, క్రెడిట్ చరిత్ర, తిరిగి చెల్లించే సామర్ధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా వ్యక్తిగత రుణాన్ని అందిస్తారు.

* వైద్య ఖర్చులు, వివాహ ఖర్చులు, గృహ మరమ్మత్తులు, గృహ వస్తువులను కొనుగోలు చేయడం లేదా మీ క్రెడిట్ కార్డు రుణాన్ని చెల్లించడం వంటి వాటితో పాటు ఏవైనా ఇతర అవసరాల కోసం వ్యక్తిగత రుణాలను ఉపయోగించవచ్చు.

* ఈ రుణాన్ని వేతన జీవులకు, స్వయం ఉపాధి కలిగిన వారికీ ఇస్తారు. 

* వ్యక్తిగత రుణ గరిష్ట కాలపరిమితి 5 సంవత్సరాలు.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతా..

* బ్యాంకు మీ ఖాతాపై ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని అందిస్తుంది. ఓవర్‌ డ్రాఫ్ట్‌ లో, మీరు బ్యాంకు ఖాతా నుంచి అదనపు సొమ్మును తీసుకోవచ్చు.

* రుణ మొత్తంపై వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది.    

* ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం అనేది ఎంపిక చేసిన వినియోగదారులకు ముందుగా ఆమోదించిన సౌకర్యం.  

* ఒకవేళ మీరు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం కోసం ఎంపిక చేసుకున్నట్లైతే, అప్పుడు మీ ఖాతాను ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాగా పరిగణిస్తారు. మీ ఖాతాలోని అదనపు డబ్బును ఉపసంహరించుకున్న వెంటనే ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం ఆటోమేటిక్గా యాక్టీవేట్ అవుతుంది.

* ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతా నుంచి డబ్బు తీసుకోవటానికి ఎలాంటి కాలపరిమితి లేదు. 

ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం ఎలా పని చేస్తుంది?

ఓవర్‌ డ్రాఫ్ట్‌ రుణ సౌకర్యం అనేది ఆన్-డిమాండ్ రుణం మాదిరిగా ఉంటుంది. ఈ సౌకర్యంలో,ఒక నిర్దిష్ట పరిమితికి అదనపు డబ్బుని అందించే ఒక బ్యాంకుతో మీరు ఒప్పందం చేసుకుంటారు. ఈ పరిమితిని బ్యాంకు నిర్ణయిస్తుంది. ఈ సదుపాయం అందిన తర్వాత మీరు అదనపు డబ్బును (మీ బ్యాంకు బ్యాలెన్స్ కంటే ఎక్కువ) ఉపసంహరించుకోవచ్చు. మీరు అదనపు డబ్బుని ఉపసంహరించుకున్న తర్వాత, ఇది అదనపు డబ్బును అవుట్ స్టాండింగ్ డిమాండ్ గా చూపుతుంది. మీరు డబ్బును జమ చేసినప్పుడు, ఈ డిమాండ్ మొత్తం తగ్గుతుంది. మీరు డబ్బును తీసుకున్న సమయం నుంచి వడ్డీ వర్తిస్తుంది.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని పొందడానికి కొన్ని బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్, బీమా పాలసీ, షేర్ సర్టిఫికెట్ వంటి వాటిని అడుగుతారు.

వ్యక్తిగత రుణం, ఓవర్‌ డ్రాఫ్ట్‌ మధ్య తేడాలు : 

* త్వరితగతిన నగదు విడుదల, సులభ ప్రక్రియ :

వ్యక్తిగత రుణంలో, మీరు చాలా పేపర్ వర్క్ చేయవలసి ఉంటుంది. మీకు డబ్బు అవసరమైన ప్రతిసారీ, అదే విధమైన పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే, మీ దరఖాస్తును ఆమోదించిన తరువాత, మీరు రుణ మొత్తాన్ని పొందడానికి కొంత సమయం పడుతుంది.

ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం లో, ఒకసారి ఆమోదం పొందిన తరువాత, మీరు ఎప్పుడైనా డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. డబ్బు అవసరమైన ప్రతిసారీ, మీరు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఖాతాను సెట్ అప్ చేయాల్సిన అవసరం లేదు. త్వరితగతిన డబ్బు పొందడానికి ఇది సులువైన మార్గం.

 ఫ్లెక్సిబిలిటీ : 

వ్యక్తిగత రుణం అంత  అందించదు. మీరు నెలవారీ వాయిదాల ప్రకారం డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. రుణ కాలపరిమితి ఫిక్స్డ్ గా ఉంటుంది, అలాగే  ముందస్తు చెల్లింపు ఛార్జీలు వర్తిస్తాయి. ఒకవేళ మీరు నెలవారీ స్థిర ఆదాయాన్ని కలిగి ఉండకపోతే, అప్పుడు ఇది మీకు సమస్యగా మారవచ్చు. 

ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం మీకు చాలా సౌలభ్యాన్ని అందిస్తుంది. మీరు ఎప్పుడైనా ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని పొందవచ్చు. మీరు నెలవారీ వాయిదాల ప్రకారం డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు. మీ సౌలభ్యం ప్రకారం రుణ చెల్లింపు చేయవచ్చు.

 వడ్డీ  :

వ్యక్తిగత రుణం విషయంలో, రుణ మొత్తం మీ ఖాతాకు బదిలీ అయిన వెంటనే, వడ్డీ వర్తిస్తుంది. నగదు వినియోగంతో సంబంధం లేకుండా, మీరు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అసలు, వడ్డీ తో పాటు ముందస్తు చెల్లింపు ఫీజును కూడా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. 

ఓవర్ డ్రాఫ్ట్ ఖాతా విషయంలో, మీ ఓవర్‌ డ్రాఫ్ట్‌ పరిమితి నుంచి ఉపసంహరించుకోని డబ్బుకు వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ పై అదనపు ఫీజు లేదా ముందస్తు చెల్లింపు చార్జీలు వర్తించవు.


 సిబిల్ స్కోర్  :

ఒకవేళ మీరు తరచుగా వ్యక్తిగత రుణాలను తీసుకుంటే, మీ సిబిల్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి సందర్భంలో మీరు రుణాన్ని తిరిగి చెల్లించడంలో జాగ్రత్త వహించాలి. ఒకవేళ సిబిల్ స్కోర్ తగ్గినట్లయితే, భవిష్యత్ లో మీరు తీసుకునే రుణాలు లేదా క్రెడిట్ కార్డు దరఖాస్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 

ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం విషయంలో, మీకు కేవలం ఒకటే రుణం ఉంటుంది, అలాగే మీరు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తారు. ఇది మీ సిబిల్ స్కోర్ ను రక్షించడంలో సహాయపడుతుంది.

రుణ నిర్వహణ :

ఒకవేళ మీరు అనేక వ్యక్తిగత రుణాలు తీసుకున్నట్లైతే, మీరు ప్రతి రుణానికి సంబంధించిన తిరిగి చెల్లింపు షెడ్యూల్ ను గుర్తుంచుకోవాలి. అలాగే అనేక రుణాలను నిర్వహించడం కూడా చాలా కష్టంతో కూడుకున్న విషయం. 

ఓవర్ డ్రాఫ్ట్ విషయంలో, ఇది ఒకే ఖాతాగా ఉంటుంది. అలాగే దానిని నిర్వహించడం కూడా చాలా సులభంగా ఉంటుంది.

 చివరిగా :

పైన చర్చించిన దాని ప్రకారం, వ్యక్తిగత రుణంతో పోలిస్తే, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాను ఎంచుకోవడం మంచిది. అయితే, ఒకవేళ మీరు వ్యక్తిగత రుణం తీసుకోవాలనుకుంటే, గడువు తేదీలోగా మీ బకాయిలను క్లియర్ చేయాలని గుర్తుంచుకోండి. ఇది మీ క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడకుండా చేస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని