Petrol: 2 నెలల్లో పెట్రోల్‌ ధర ఎంత పెరిగిందంటే..?

పెట్రోల్‌ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కన్పించట్లేదు. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో బండి బయటకు తీయాలంటేనే వాహనదారుడి గుండె

Updated : 05 Jul 2021 10:53 IST

14 రాష్ట్రాల్లో సెంచరీ కొట్టిన పెట్రోల్‌

దిల్లీ: పెట్రోల్‌ ధరల నుంచి సామాన్యుడికి ఇప్పుడప్పుడే ఊరట లభించేలా కన్పించట్లేదు. నిరంతర ప్రక్రియలా మారిపోయిన పెట్రో ధరల బాదుడుతో బండి బయటకు తీయాలంటేనే వాహనదారుడి గుండె  గుబేలుమంటోంది. రెండు నెలల క్రితం మొదలైన ఇంధన ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా ఈ రెండు నెలల కాలంలో పెట్రోల్‌పై దాదాపు రూ.10 వరకు పెరగడం గమనార్హం. అటు డీజిల్‌ కూడా దాదాపు రూ.9 పెరిగింది.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజుల పాటు దేశంలో ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ తర్వాత మే 4 నుంచి చమరు సంస్థలు వరుసగా ధరలను పెంచుతూ వస్తున్నాయి. సోమవారం మరోసారి పెట్రోల్‌పై 34-35 పైసలు పెంచారు. అయితే డీజిల్‌ ధరలో నేడు ఎలాంటి మార్పు లేదు. కాగా.. మే నెల నుంచి ఇప్పటివరకు మొత్తం 35 సార్లు పెట్రోల్‌ ధరలను సవరించారు. డీజిల్‌ ధరను 33 సార్లు పెంచారు. మే నెలలో 16 సార్లు, జూన్‌లో 16 సార్లు, జులైలో ఐదు రోజుల్లోనే మూడు సార్లు పెట్రోల్‌ ధరను పెంచారు. దీంతో ఈ రెండు నెలల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.9.46 పెరిగింది. 33 సార్లు పెంపుతో లీటర్‌ డీజిల్‌పై రూ.8.63 పెరిగింది.

రూ.100 దాటేసిన డీజిల్‌..

ఇప్పటికే 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్‌ ధర సెంచరీ కొట్టేసింది. తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ సహా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, జమ్మూకశ్మీర్‌, తమిళనాడు, కేరళ, బిహార్‌, పంజాబ్‌, లద్దాఖ్‌, సిక్కింలలో పెట్రోల్‌ ధర రూ.100 పైనే ఉంది. మహారాష్ట్రలో లీటర్‌ ధర రూ.105 దాటగా.. రాజస్థాన్‌లోని ఓ జిల్లాలో అత్యధికంగా రూ.110పైనే ఉంది. దేశ రాజధాని దిల్లీలోనూ రూ.100కు చేరువైంది. ఇక కొన్ని ప్రాంతాల్లో డీజిల్ ధర కూడా రూ.100 దాటేసింది. రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.100పైనే ఉంది. 

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశీయంగా ఇంధన ధరలకు రెక్కలొచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 2019 ఏప్రిల్‌ తర్వాత తొలిసారి ‌75 డాలర్ల మార్క్‌ను తాకింది.

దేశంలోని ప్రధాన నగారాల్లో ఇంధన ధరలు(లీటరు చొప్పున) ఇలా.. 

* దిల్లీ: పెట్రోల్‌ రూ.99.86, డీజిల్ రూ.89.36

* ముంబయి: పెట్రోల్‌ రూ.105.92 , డీజిల్ రూ.96.91

*  కోల్‌కతా: పెట్రోల్‌ రూ.99.84 , డీజిల్ రూ.92.27

*  చెన్నై: పెట్రోల్‌ రూ.100.75 , డీజిల్ రూ.93.91

* హైదరాబాద్‌: పెట్రోల్‌ రూ.103.78, డీజిల్ రూ.97.40

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని