ఏ పెట్టుబడి ఎంత వరకు అనుకూలం? పార్ట్‌-3

అధిక మొత్తంలో బంగారం ఉంటే, బ్యాంకు లాకర్ లో ఉంచవలసి వస్తే, అద్దె చెల్లంచాల్సివుంటుంది. ఐతే, అక్కడ కూడా భద్రతకు హామీ లేదు......

Published : 22 Dec 2020 17:19 IST

అధిక మొత్తంలో బంగారం ఉంటే, బ్యాంకు లాకర్ లో ఉంచవలసి వస్తే, అద్దె చెల్లంచాల్సివుంటుంది. ఐతే, అక్కడ కూడా భద్రతకు హామీ లేదు.

మునుపటి క‌థ‌నాల‌లో చిన్న పొదుపు పథకాలైన రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, ఎన్పీఎస్, సుకన్య సమృద్ధి యోజన, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు వంటి వాటి అనుకూలతలు, ప్రతికూలతలు తెలుసుకున్నాము. భారతీయలు ఎక్కువగా ఇష్టపడి మదుపు చేసే ముఖ్య సాధనాలు బంగారం, ఇళ్ళు , స్థలాలు. ఎందుకంటే ఇవి మన కంటికి కనిపిస్తాయి, చేతితో తడిమి చూసుకోవచ్చు. ఎందుకంటే అవి మన కళ్ళ ఎదుటే ఉంటాయనే ఒక మానసిక భరోసా. ఇప్పుడు బంగారం, ఇళ్ళు స్థలాల అనుకూలతలు, ప్రతికూలతలు గురించి తెలుసుకుందాము.

బంగారం :

అనుకూలతలు : కొద్ది మొత్తంలో కూడా మదుపు చేయవచ్చు. అత్యవసర సమయంలో నగదు కోసం కుదువ పెట్టవచ్చు.

ప్రతికూలతలు : దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తుందే కానీ, అధిక రాబడిని ఇవ్వదు. భద్రత చాలా ముఖ్యం. క్రమానుగత ఆదాయాన్ని ఇవ్వదు. తరుగుదల, తయారీ చార్జీల వలన విలువ తగ్గుతుంది.

ఒకవేళ మీ దగ్గర అధిక మొత్తంలో బంగారం ఉన్నట్లయితే, దానిని బ్యాంకు లాకర్ లో ఉంచడానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అయితే, అక్కడ కూడా భద్రతకు హామీ లేదు.

ఇల్లు లేదా అపార్టుమెంట్ :

అనుకూలతలు : 80 నుంచి 85 శాతం వరకు రుణం పొందే అవకాశం. అసలు చెల్లింపుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద వార్షికంగా రూ 1.50 లక్షల వరకు మినహాయింపు. వడ్డీ చెల్లింపుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24బీ కింద వార్షికంగా రూ. 2 లక్షల వరకు మినహాయింపు. రెండవ ఇంటిపై వచ్చే అద్దెను నెలవారీ ఖర్చులకు వాడుకోవచ్చు.

ప్రతికూలతలు : అద్దె ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువ. పెట్టుబడిఫై రాబడి సుమారుగా 3 నుంచి 4 శాతం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇంటిపై తరుగుదల, అద్దెకు ఉండే వారి అభిరుచులలో మార్పులు, అదే అద్దెకు కొత్త ఇళ్ళు లభించటం వంటి కారణాల వలన ఇంటి విలువ తగ్గుతుంది. తాత్కాలిక అవసరాల కోసం కొద్ది మొత్తంలో సొమ్ము చేసుకోలేకపోవడం.

ఖాళీ స్థలాలు :

అనుకూలతలు : నాకు ఆస్తి ఉన్నది అన్న భావన ఉంటుంది.

ప్రతికూలతలు : నగరాలలో పెట్టుబడికి అధిక సొమ్ము కావాలి. ఊరికి వెలుపల దూరంగా కొంటే చౌకగా రావచ్చు. కానీ అక్కడ అభివృద్ధి చెంది మంచి ధర రావటానికి దీర్ఘకాలం పట్టవచ్చు. అన్యులు ఆక్రమించుకోకుండా చూసుకోవాలి. నెలసరి లేదా వార్షిక క్రమానుగత ఆదాయం రాకపోవచ్చు.

ముగింపు :

ప్రతి ఒక్కరూ ఎదో ఒక పధకంలో మదుపు చేస్తూ ఉంటారు. అయితే, ఆర్ధిక లక్ష్యాలను స్వల్ప కాలిక , మధ్య కాలిక, దీర్ఘ కాలిక అవసరాలను గుర్తించడం ద్వారా మదుపు చేస్తే మరింత లాభం పొందవచ్చు. ప్రతి ఒక్కరి కోరికలు, జీవిత లక్ష్యాలు వంటివి వేరు వేరుగా ఉంటాయి. కావున దానికి అనుగుణంగా మదుపు చేయగలిగితే మీ లక్ష్యాలను చేరవచ్చు.

మనం చేసే ప్రతి పెట్టుబడికి భద్రత, సమయానికి చేతికి సొమ్ము అందడం (లిక్విడిటీ) , రాబడి, ఆర్ధిక లక్ష్యం చేరుకోటానికి ఉన్న సమయం, మన రిస్క్ సామర్ధ్యం, పన్ను ప్రభావం వంటి విషయాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

ప్రతి లక్ష్య సాధనకు రెండు లేదా మూడు పథకాలలో మదుపు చేయటం ద్వారా అనుకున్న లక్ష్యం చేరవచ్చు. ఒక లక్ష్యం కొరకు ఒక మదుపు సాధనాన్ని ఎంచుకుంటే, దాని వలన ఒక్కోసారి ఆశించిన రాబడిని పొందలేకపోవడం, పూర్తి మొత్తం చేతికి రాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఉదాహరణకు రెండు నుంచి మూడు సంవత్సరాల తరువాత వివాహానికి అవసరమైన సొమ్మును ఇళ్ళు , స్థలాల మీద గానీ, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో గాని పెట్టరాదు. ఆ సొమ్ముని బ్యాంకు ఫిక్సెడ్ డిపాజిట్ చేయడం మంచిది. అలాగే క్రమానుగణ ఆదాయం కోసం ఉంచిన సొమ్ముని ఇళ్ళు , స్థలాలపై పెట్టుబడి పెట్టరాదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని