E-comm: ఆ సంస్థలది అహంకారం

విదేశీ ఇ-కామర్స్‌ సంస్థలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడా సంస్థలు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ దేశ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు....

Updated : 28 Jun 2021 12:49 IST

బడా ఇ-కామర్స్‌ సంస్థలపై కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌ మండిపాటు

దిల్లీ: విదేశీ ఇ-కామర్స్‌ సంస్థలపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్‌ గోయల్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడా సంస్థలు అహంకారపూరితంగా వ్యవహరిస్తూ దేశ చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని తెలిపారు. ధరల విషయంలో అనైతిక విధానాలను అమలు చేస్తున్నాయన్నారు.

తమకున్న భారీ ఆర్థిక వనరులు, మార్కెట్‌లో గణనీయ వాటా కలిగి ఉండడం వంటి అనుకూల అంశాలను ఆసరాగా చేసుకొని చిన్న దుకాణాలను దెబ్బకొట్టేలా ధరల విషయంలో ఇ-కామర్స్‌ సంస్థలు అనైతిక విధానాలను అమలు చేస్తున్నాయని గోయల్‌ స్పష్టం చేశారు. వీరితో పలుసార్లు తాను సంప్రదింపులు జరిపానని.. ముఖ్యంగా అమెరికన్‌ సంస్థలు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నట్లు గమనించానన్నారు.

అమెజాన్‌, వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న ఫ్లిప్‌కార్ట్‌ పేర్లు గోయల్‌ నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఆయన వాటిని ఉద్దేశించే అన్నట్లు స్పష్టమవుతోంది. భారత చట్టాలను అమెజాన్‌, ఫిప్‌కార్ట్‌ ఉల్లంఘిస్తున్నాయంటూ ఇటీవల దేశ వర్తక, వ్యాపార సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. గోయల్‌ వ్యాఖ్యలపై స్పందించడానికి అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ నిరాకరించాయి. అయితే, వర్తక సంఘాలు చేస్తున్న ఆరోపణల్ని మాత్రం ఖండించాయి.

అలాగే కోర్టుల్లో ఈ ఇ-కామర్స్‌ సంస్థలు ‘ఫోరం షాపింగ్‌’ అనే అనైతిక విధానానికి పాల్పడుతున్నాయని గోయల్‌ ఆరోపించారు. తద్వారా ‘కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా-(సీసీఐ)’ ప్రారంభించిన దర్యాప్తులో పాల్గొనేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ఒకవేళ వ్యాపారంలో ఎటువంటి అవినీతి, అక్రమ విధానాలు అమలు చేయకపోతే దర్యాప్తులో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నించారు. సీసీఐ దర్యాప్తును సవాల్‌ చేస్తూ అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గోయల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశంలో ఇ-కామర్స్‌ సంస్థలు వస్తు, సేవల ఫ్లాష్‌ సేల్‌ నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధన విధించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఇటీవల ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వినియోగదారుల హక్కుల సంరక్షణ చట్టానికి సవరణలను సూచించింది. జులై 6లోపు దీనిపై సూచనలు, సలహాలు తెలిపే వీలుంది. ముసాయిదా ప్రకారం.. ఆయా కంపెనీలు చీఫ్‌ కంప్లయన్స్‌ ఆఫీసర్, రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారిని నియమించాల్సి ఉంటుంది. అలాగే, చట్టబద్ద ఏజెన్సీలతో సమన్వయం కోసం 24×7 అందుబాటులో ఉండే వ్యక్తి నంబర్‌ అందుబాటులో ఉంచాలి. దీంతో పాటు పలు నిబంధనలను ప్రతిపాదించింది. వీటిని బడా ఇ-కామర్స్ సంస్థలు వ్యతిరేకిస్తుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని