విహార యాత్ర‌ల‌కు వెళ్తున్నారా.. ప‌క్కాగా ప్లాన్ చేయండి

విహర‌యాత్ర‌ల‌ను స్వ‌ల్ప‌కాలిక లక్ష్యంగా మీ వార్షిక బ‌డ్జెట్‌లో చేర్చి.. కావాల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవాలి

Updated : 30 Oct 2021 18:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వృత్తి, ఉద్యోగ‌, వ్యాపారాల్లో రోజుల త‌ర‌ప‌డి క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తూ ఒత్తిడికి లోన‌వుతుంటారు. ఇందులో నుంచి బ‌య‌ట ప‌డేందుకు కాస్త విరామం తీసుకుని కుటుంబంతో సంతోషంగా గ‌డిపేందుకు, ప్ర‌కృతిలో సేద తీరేందుకు ఏడాదికోసారైనా దూరప్రాంతాల‌కు విహార‌యాత్ర‌ల‌కు ప్లాన్ చేసుకుంటారు చాలామంది. ఆర్థిక ఇబ్బందులు ప‌డ‌కుండా, టూర్ మొత్తం సంతోషంగా సాగాలంటే ముందు నుంచీ ఎలాంటి ప్ర‌ణాళికలు అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ముందే ప్లాన్ చేయండి..
విమాన టికెట్ల ద‌గ్గ‌ర నుంచి హోట‌ల్ బుకింగ్ వ‌ర‌కు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎక్క‌డికైతే వెళ్లాల‌నుకుంటున్నారో అక్క‌డి ఆహార స‌దుపాయాలు, లోక‌ల్‌గా తిరిగి ప్రదేశాల‌ను చూసేందుకు ఎంత ఛార్జ్ చేస్తారు? ఎంత స‌మ‌యం వ‌ర‌కు వాహ‌నాలు అందుబాటులో ఉంటాయి? అనేవి తెలుసుకోవాలి. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోనే ఉంది కాబ‌ట్టి ఈ వివ‌రాల గురించి సుల‌భంగానే తెలుసుకోవ‌చ్చు. అంతేకాకుండా టికెట్లు బుకింగ్‌లో అందుబాటులో ఉన్న‌ ఆఫ‌ర్లు తెలుసుకోవ‌చ్చు. అదృష్ట‌వ‌శాత్తు ఆఫ‌ర్లు ఉంటే కొంత డ‌బ్బు ఆదా చేసుకునేందుకు వీలుంటుంది. ఏ దేశానికి వెళ్లినా డ‌బ్బును ఆ దేశ క‌రెన్సీ బ‌దిలీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబ‌ట్టి బ‌దిలీ రేట్లు, ఛార్జీల‌ను ముందుగానే తెలుసుకోవాలి. ముందుగా ప్లాన్ చేసుకోవ‌డం వ‌ల్ల ఇక్క‌డ కూడా మంచి మంచి డీల్స్ పొందొచ్చు. 

కొంచెం డ‌బ్బు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి..
ప్ర‌యాణంలో ఉన్న‌ప్పుడు ఎక్కువ మొత్తంలో న‌గ‌దు తీసుకెళ్ల‌డం మంచిది కాదు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల కోసం, చిన్న చిన్న ఖ‌ర్చుల కోసం కొంత మొత్తం ద‌గ్గ‌ర పెట్టుకుని.. మిగిలిన మొత్తాన్ని ప్రీపెయిడ్ కార్డులో ఉంచ‌డం మంచిది. ద‌గ్గ‌ర పెట్టుకున్న డ‌బ్బులో కూడా కొంత మొత్తాన్ని ప‌ర్సులోనూ, మ‌రికొంత మొత్తాన్ని ల‌గేజ్‌లోనూ ఉంచాలి. అలా చేయ‌డం వ‌ల్ల, అనుకోకుండా ప‌ర్సు పోగొట్టుకుంటే ఇది స‌హాయ‌ప‌డుతుంది.

బ‌డ్జెట్‌లో కొంత పక్క‌న పెట్టండి..
విహార యాత్ర‌కు వెళ్లేందుకు వేసుకున్న మొత్తం బ‌డ్జెట్ నుంచి 25 శాతం మొత్తాన్ని పక్కన పెట్టి.. మిగిలిన డ‌బ్బుతోనే టూర్ మొత్తం ప్లాన్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని అనుకోని ఖ‌ర్చుల కోసం ఉప‌యోగించుకోవ‌చ్చు. మీరు ప్లాన్ చేసినా దానికంటే ఎక్కువ ఖ‌ర్చ‌యినా, ఏవైనా కొత్త ఖ‌ర్చులు వ‌చ్చినా ఈ మొత్తం ఉప‌యోగ‌ప‌డుతుంది.

అప్పు చేయొద్దు..
విహార యాత్ర కోసం కొన్ని సంస్థ‌లు వ్య‌క్తిగ‌త రుణాల‌ను ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే రుణం తీసుకుని సుల‌భ వాయిదాల్లో బాకీ తీర్చ‌వ‌చ్చ‌ని.. అప్పు చేసి మ‌రీ విహార‌యాత్ర‌ల‌కు ప్లాన్ చేయ‌డం మంచి ప‌ద్ధతి కాదు. ఎందుకంటే ఈ విధమైన రుణాల‌కు వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గా ఉంటాయి. భ‌విష్య‌త్‌లో వ‌డ్డీ మొత్తం భారం కావొచ్చు. సంతోషం కోసం, ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం విహార యాత్ర‌కు వెళ్తుంటాం. అలాంటి వాటి కోసం అప్పు చేస్తే మ‌రింత ఒత్తిడికి లోన‌య్యే ప్ర‌మాదం ఉంది. విహర‌యాత్ర‌కు వెళ్ల‌డం అనేది స్వ‌ల్ప‌కాలిక లక్ష్యంగా మీ వార్షిక బ‌డ్జెట్‌లో యాడ్ చేసుకుని.. కావాల‌సిన మొత్తాన్ని స‌మ‌కూర్చుకోవాలి.

ప్రయాణ బీమా..
విహార యాత్ర ఆనంద‌క‌రంగా సాగాల‌ని అంద‌రూ అనుకుంటారు. తీపి జ్ఞాపకాలను మిగిల్చాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే క‌ష్టాలు చెప్పి రావు. ఒక వేళ వ‌చ్చినా పూర్తిగా సంసిద్ధంగా ఉండాలి. దాదాపు అన్ని సాధార‌ణ బీమా సంస్థ‌లు ప్ర‌యాణ బీమాను అందిస్తున్నాయి. ల‌గేజీ, క్రెడిట్‌, డెబిట్ కార్డులు పోగొట్టుకున్న‌ప్పుడు ఈ బీమా ప‌రిహారం అందిస్తుంది. ప్ర‌యాణాల్లో అనారోగ్యం పాలైనా స‌రే ఇలాంటి బీమా ఆదుకుంటుంది. రైల్వేలు కేవ‌లం కొన్ని పైస‌లు వ‌సూలు చేసి బీమా ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నాయి. ఇలాంటి వాట‌న్నిటినీ ప‌రిశీలించి త‌గిన బీమా తీసుకోవ‌డం మేలు.

రుణ వాయిదా చెల్లింపులు
దీర్ఘ‌కాలం పాటు అంటే ఆరు నెల‌ల నుంచి ఏడాది పాటు విహార‌యాత్ర‌లు వెళ్లాల‌నుకునేవారు ముందుగానే అందుకు సంసిద్ధంగా ఉండాలి. విహార యాత్ర చేస్తున్న‌న్ని రోజులు ఆదాయం ఉండ‌క‌పోవ‌చ్చు. పైగా ఎప్ప‌టిలాగే కొంద‌రికి గృహ, వ్య‌క్తిగ‌త‌, వాహ‌న రుణ వాయిదాలు ఉంటాయి. అవ‌న్నీ బ‌కాయి ప‌డ‌కుండా చూసుకోవ‌డం ముఖ్యం. ముందుగానే వాటికి చెల్లించాల్సిన మొత్తం జ‌మ‌చేసుకొని పెట్టుకోవ‌డం మేలు. 

సెలవుల్లో విహార యాత్ర‌లకు వెళ్ల‌డం వెనుక ప్రాథమిక ఉద్దేశం కుటుంబంతో సంతోషక‌ర‌మైన క్ష‌ణాల‌ను గ‌డుపుతూ.. జ్ఞాపకాలను పోగుచేసుకోవ‌డం. ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల‌లో త‌ప్పులు చేస్తే సంతోషం మాట ప‌క్క‌డ పెడితే తీవ్ర ఒత్తిడికి లోన‌య్యే ప్ర‌మాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని