మరింత మంది వీధి వ్యాపారులకు పాయింట్‌ ఆఫ్‌ సేల్‌: ఆర్‌బీఐ

పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీఓఎస్‌) వసతుల ఏర్పాటును ప్రోత్సహించే పథకాన్ని మరింత మంది వీధి వ్యాపారులకు ఆర్‌బీఐ వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌నిధి (పీఎమ్‌ స్వనిధి)లో భాగంగా అర్హత...

Updated : 27 Aug 2021 01:29 IST

ఒకటో, రెండో శ్రేణి కేంద్రాలకూ వర్తింపు

ముంబయి: పాయింట్‌ ఆఫ్‌ సేల్‌(పీఓఎస్‌) వసతుల ఏర్పాటును ప్రోత్సహించే పథకాన్ని మరింత మంది వీధి వ్యాపారులకు ఆర్‌బీఐ వర్తింపజేయాలని నిర్ణయించింది. ప్రధాన మంత్రి స్ట్రీట్‌ వెండర్స్‌ ఆత్మనిర్భర్‌నిధి (పీఎమ్‌ స్వనిధి)లో భాగంగా అర్హత ఉన్న ఒకటో, రెండో శ్రేణి కేంద్రాల్లోని వీధి వ్యాపారులకూ ద పేమెంట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌(పీఐడీఎఫ్‌) పథకాన్ని అమలు చేయనున్నారు. మూడో శ్రేణి నుంచి ఆరో శ్రేణి కేంద్రాల్లో ఏటా 30 లక్షల కొత్త టచ్‌ పాయింట్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా రూ.345 కోట్ల మూలనిధితో ఈ పథకం ఏర్పడింది. ఈ ఏడాది జనవరి నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టిన ఈ పథకంలో మూడో శ్రేణి నుంచి ఆరో శ్రేణి కేంద్రాల్లో ఉన్న వీధివ్యాపారులతో పాటు ఇపుడు ఒకటి, రెండో శ్రేణి కేంద్రాల్లోని ఎంపిక చేసిన వీధి వ్యాపారులకూ ప్రయోజనాలు అందనున్నాయి. ఈ పథకం కింద ఒక ఏడాది గడువుతో ఎటువంటి హామీ లేకుండా రూ.10,000 రుణం అందిస్తారు.


కొవిడ్‌ పరిణామాలతో బ్యాంకు రుణాలకు నష్టభయం 

భారీ క్షీణత ఉండకపోవచ్చు: మూడీస్‌

దిల్లీ: కరోనా రెండో దశ పరిణామాలతో భారత బ్యాంకుల రుణ ఆస్తులకు నష్టభయం పెరిగిందని, అయితే తీవ్ర ప్రభావం పడకపోవచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ పేర్కొంది. వ్యక్తులు, చిన్న వ్యాపారులపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా తొలి దశలో బాగా దెబ్బతిన్న వారిపై ఇది కనిపించింది. అయితే బ్యాంకులు ముందుగానే రుణ నష్టాలను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా సరిపడా నిల్వలను ఏర్పాటు చేసుకున్నాయి.

* ఆర్థిక రికవరీకి తోడు.. రుణ మంజూరు అర్హతలను కఠినతరం చేయడం, ప్రభుత్వ మద్దతు కొనసాగున్నందున, రుణ సమస్యలు అధికం కావు.

* అత్యవసర రుణ అనుసంధాన హామీ పథకం(ఈసీఎల్‌జీఎస్‌) వంటి ప్రభుత్వ పథకాల వల్ల వ్యాపారులకు సత్వరం ద్రవ్యలభ్యత అందుతోంది.

* తక్కువ వడ్డీ రేట్లు, రుణ పునర్నిర్మాణ పథకాలు కూడా నష్టభయాలను తగ్గిస్తున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్‌షీట్లలో కరోనాకు ముందు మొదలైన మెరుగుదలను కరోనా కేసులు ఆలస్యం చేయగలవేమో కానీ.. గాడి తప్పించలేవు.

* వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల రుణాల్లో కొత్త నిరర్థక రుణాల (ఎన్‌పీఎల్‌) వాటా 0.5 శాతం పెరిగి ఏటా 1.5 శాతం మేర నమోదు కావొచ్చు. బ్యాంకుల సగటు ఎన్‌పీఎల్‌ స్థిరంగానే ఉండొచ్చు.


కూ ఖాతాలో కోటి మంది వినియోగదారులు

దిల్లీ: ట్విటర్‌కు పోటీగా ఆవిష్కరించిన దేశీయ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కూ’ కోటి మంది వినియోగదారుల మైలురాయిని అధిగమించింది. వచ్చే ఏడాదిలో 10 కోట్ల మంది ఖాతాదారులకు చేరుకోవడమే లక్ష్యమని సంస్థ సహ వ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ తెలిపారు. ఇంటర్నెట్‌ వినియోగించేవారిలో మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌లపై అభిప్రాయాలు తెలిపేవారి సంఖ్య 2 శాతంలోపే ఉందని వెల్లడించారు. మిగిలిన 98 శాతం మందిపై కూ దృష్టి పెట్టిందని అన్నారు. కూ ప్రారంభించిన 15-16 నెలల్లోనే కోటి మంది వినియోగదారులకు చేరుకుంది. ఇందులో దాదాపు 85 లక్షల డౌన్‌లోడ్‌లు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే రావడం గమనార్హం. మైక్రోబ్లాగింగ్‌ దిగ్గజం ట్విటర్‌తో ప్రభుత్వానికి విభేదాలు రావడంతో అనూహ్యంగా కూ యాప్‌కు ప్రజాదరణ పెరిగింది. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ శాఖలు ఇందులో ఖాతాలు తెరవడం సంస్థకు కలిసొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని