బడ్జెట్‌ 2021: రాజకీయ పదనిసలు

నేటి బడ్జెట్‌ 2021పై వివిధ రాజకీయవేత్తల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

Published : 01 Feb 2021 20:22 IST

దిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2021-21 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను నేడు లోక్‌సభలో సమర్పించారు. కాగా, దీనిపై వివిధ రాజకీయవేత్తల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ప్రధాని నరేంద్ర మోదీ

‘‘కేంద్రం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యుడికి అండగా నిలిచేలా ఉంది. ఇది అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా ఉండటమే కాకుండా పారదర్శకంగా ఉంది. ఈ బడ్జెట్‌ దేశంలో అన్ని రంగాల అభివృద్ధికీ దోహదం చేస్తుంది.’’

యోగి ఆదిత్యనాథ్‌, యూపీ ముఖ్యమంత్రి

‘‘కొవిడ్‌-19 సమయంలో అభివృద్ధే లక్ష్యంగా గల బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రికి, ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు. రైతులు, యువత, మహిళలు, పేదవారు.. ఇలా సమాజంలో అన్ని వర్గాల వారికీ బడ్జెట్‌లో అనుకూల అంశాలున్నాయి. మౌలికసదుపాయాల పరంగా కూడా ఇది ప్రశంసనీయం.’’

హర్షవర్ధన్‌, కేంద్ర ఆరోగ్యమంత్రి

‘‘ఆరు ముఖ్యమైన మూలస్తంభాల గురించి ఆర్థిక మంత్రి నేటి బడ్జెట్‌లో వివరించారు. వీటిలో ఆరోగ్యం, సంక్షేమం అతి ముఖ్యమైనవి. ఆరోగ్యరంగంలో పెట్టుబడి 137 శాతం పెరిగింది. ఇది గత సంవత్సరం బడ్జెట్‌ అంచనాల కంటే 2.47 రెట్లు అధికం. ఇది మన విజయం.’’

నితిన్‌ గడ్కరీ, కేంద్ర రవాణాశాఖ మంత్రి

‘‘నేడు ప్రకటించిన స్క్రాపింగ్‌ విధానం కింద 20 ఏళ్ల కంటే పాతవైన 51 లక్షల తేలికపాటి వాహనాలు, పనికిరానివిగా పరిగణించబడతాయి. ఈ చర్య ఆటోమొబైల్‌ రంగాన్ని బలోపేతం చేస్తుంది.’’

రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ మంత్రి

‘‘ప్రభుత్వం ఇప్పటికే ఐదు మినీ బడ్జెట్లను ప్రవేశపెట్టింది. ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి అనేక ప్యాకేజీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటువంటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగలదని ఎవరూ ఊహించలేదు. ఇది ఓ అద్భుతమైన బడ్జెట్‌.’’

రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నేత
‘‘ప్రజల చేతిలో నగదు ఉంచటం మాట అటుంచి, మోదీ ప్రభుత్వం తన కార్పొరేటు దిగ్గజ మిత్రులకు భారతదేశ సంపదను కట్టబెట్టేందుకు ప్రణాళిక రచిస్తోంది.’’

డెరిక్‌ ఓబ్రెయెన్‌, తృణమూల్‌ ఎంపీ

‘‘భారత్‌ నేడు ప్రవేశపెట్టిన తొలి కాగిత రహిత బడ్జెట్‌, 100 శాతం దూరదృష్టి లేనిది. దీనిలో సామాన్య ప్రజలు, రైతులను విస్మరించారు. ఈ బడ్జెట్‌ పేదలను మరింత పేదరికంలోని, ధనికులను మరింత సంపద వైపుకు తీసుకెళ్తుంది. ఇక దీనివల్ల మధ్య తరగతి వారికి కూడా దక్కేదేమీ లేదు.’’

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ 

‘‘నేడు సమర్పించిన బడ్జెట్‌, కేంద్ర బడ్డెట్‌ మాదిరిగా కాకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల బడ్జెట్‌లా ఉంది. దీనిలో కేటాయింపులన్నీ ఎన్నికలు దగ్గర్లో ఉన్న రాష్ట్రాలకే ఇవ్వడం దుర్మార్గం. ఇక తెలంగాణకు ఈ బడ్జెట్‌లో దక్కింది శూన్యం. రైతుల ఆందోళనలను పెడచెవిన పెట్టి, కనీస మద్దతు ధరపై ప్రకటన కూడా చేయలేదు.’’

ఇవీ చదవండి..

బడ్జెట్‌ 2021: పెరగనున్న ఫోన్ల ధరలు

రైల్వేను ఇలా పట్టాలకెక్కించారు..

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని