పాల‌సీల‌నూ పోర్ట్ చేసుకుందాం!

పునరుద్ధరణ సమయానికి 45రోజుల ముందుగా మనం ఎంచుకున్న కొత్త బీమా కంపెనీని సంప్రదించి అక్కడ పాలసీ బదిలీ చేసుకోవాలని విజ్ఞప్తి చేయాలి

Published : 27 Dec 2020 17:57 IST

మన ఆరోగ్య బీమా కంపెనీ అందిస్తున్న సేవలతో సంతృప్తి చెందకపోతే వేరే బీమా కంపెనీకి మన ఆరోగ్య బీమా పాలసీని బదిలీచేసుకునే సౌల‌భ్యాన్ని భారత బీమా నియంత్రణ, ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) కల్పిస్తోంది. బీమా పునరుద్ధరించుకునే ముందు ఈ అవకాశం కల్పిస్తోంది. దీన్నే బీమా పరిభాషలో పాలసీ పోర్టబిలిటీ అని అంటారు.

పోర్టబిలిటీకి పట్టే సమయం:

  • పునరుద్ధరణ సమయానికి 45రోజుల ముందుగా మనం ఎంచుకున్న కొత్త బీమా కంపెనీని సంప్రదించి అక్కడ పాలసీ బదిలీ చేసుకోవాలని విజ్ఞప్తి చేయాలి.

  • కొత్త బీమా కంపెనీ 7 పనిదినాల్లోగా పాత బీమా కంపెనీని వివరాల కోసం సంప్రదిస్తుంది.

  • పాత బీమా కంపెనీ 7 పనిదినాల్లోగా వివరాలను కొత్త బీమా కంపెనీకి అందించాలి.

  • బదిలీ కోసం మనం విజ్ఞప్తి చేసిన కంపెనీ వచ్చే 7రోజుల్లో మన వివరాలు పరిశీలించి మన పాలసీని బదిలీకి అనుమతిస్తున్నారా లేదా అనే విషయాన్ని మనకు తెలియచేస్తుంది .

  • కొత్త కంపెనీ నుంచి 15రోజుల్లోగా ఎలాంటి సమాచారం అందకపోతే ఐఆర్‌డీఏ నియమనిబంధనల ప్రకారం బీమా కంపెనీ మన విజ్ఞప్తిని అంగీకరించిందని భావించాలి. ఆ తర్వాత తిరస్కరించే హక్కు కంపెనీకి ఉండదు.

కావలసిన పత్రాలు:

  • పాలసీ డాక్యుమెంట్లు,

  • ప్రీమియం చెల్లించిన రశీదులు,

  • క్లెయింలకు సంబంధించిన పత్రాలు…
    అన్ని ముఖ్యమైన పత్రాలను, మారాలనుకున్న కొత్త‌ కంపెనీకి అందించాల్సి ఉంటుంది.

కొన్ని మార్పులు వ‌ర్తించ‌వు :
*ఇంతకు ముందు మనం బీమా ద్వారా పొందిన ప్రయోజనాలను కొత్త కంపెనీకి బదిలీ చేయించుకునే అవకాశమున్నా, కొన్ని మాత్రం యథాతథంగా పొందేందుకు వీలుండదు.

  • ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌కు సంబంధించి ఇంతకు ముందున్న కంపెనీతో వెయిటింగ్‌ పీరియడ్‌ పూర్తయితే దాన్ని పరిగణిస్తారు. లేదా వెయిటింగ్‌ పీరియడ్‌లో కొంత పూర్తయినా అక్కడి నుంచి మిగిలిన సమయాన్ని లెక్కిస్తారు. పాత బీమా కంపెనీ వ‌ద్ద క్రమానుసారంగా పాల‌సీని పున‌రుద్ధ‌రించుకున్న‌ట్ల‌యితేనే కొత్త కంపెనీ పాల‌సీని బ‌దిలీ చేసేందుకు ఆస‌క్తి చూపిస్తుంది. అయితే, కొత్త బీమా కంపెనీ వారి షరతులకు అంగీకరిస్తేనే పాలసీ పోర్ట్ చేసుకునే వీలుంటుంది.

  • పాలసీ తీసుకున్న తర్వాత 30రోజుల వెయిటింగ్‌ పీరియడ్‌ ఉంటుంది.

ప్రీమియం ఒక్క‌టే ప్రామాణికం కాకూడ‌దు!

  • ప్రీమియంలు సరిగ్గా చెల్లించకపోయినా, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పాలసీ బదిలీని విజ్ఞప్తిని తిరస్కరించే అవకాశము బీమా కంపెనీకి ఉంటుంది.

  • పాలసీ బదిలీ చేయించుకునేటప్పుడు కొత్త కంపెనీ అదే ప్రీమియాన్ని విధిస్తుంది అని భావించనక్కర్లేదు. కంపెనీ నియమనిబంధనలను అనుసరించి విధించే ప్రీమియం ఎక్కువ ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు.
    కేవలం ప్రీమియంను దృష్టిలో ఉంచుకొని అధికంగా ఉందని వేరే కంపెనీకి మారడం సమంజసం కాదు. మనకు సేవలు సరిగ్గా అందక, నెట్‌వర్క్‌ ఆసుపత్రుల పరిధిలో లేకుండా ఉండి, కొత్త కంపెనీ సేవలు ఇంకా బాగా అందిస్తుందని భావించినట్టయితేనే కొత్త కంపెనీకి మారడం అన్ని విధాల మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని