పోస్టాఫీస్ పొదుపు ఖాతాల వ‌డ్డీ రేట్లు... వివ‌రాలు...

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే ఆశించినంత లాభం లేద‌నుకున్న‌ప్పుడు ప్ర‌త్యామ్నాయ మార్గ‌మే పోస్టాఫీస్ డిపాజిట్స్. మీరు పెట్టుబ‌డి చేసేది కొంతే అయినా దీర్ఘ‌కాలీకంగా ఎలాంటి రాబ‌డినిస్తుందో దాన్ని బ‌ట్టి పెట్టుబ‌డులు చేయ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు.....

Updated : 02 Jan 2021 16:32 IST

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే ఆశించినంత లాభం లేద‌నుకున్న‌ప్పుడు ప్ర‌త్యామ్నాయ మార్గ‌మే పోస్టాఫీస్ డిపాజిట్స్. మీరు పెట్టుబ‌డి చేసేది కొంతే అయినా దీర్ఘ‌కాలీకంగా ఎలాంటి రాబ‌డినిస్తుందో దాన్ని బ‌ట్టి పెట్టుబ‌డులు చేయ‌డం చాలా ముఖ్య‌మ‌ని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. షేర్ మార్కెట్లో పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖ‌త చూపించ‌ని వారికి ఖ‌చ్చిత‌మైన ఆదాయ‌న్నిచ్చే రిక‌రింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ), ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్‌డీ) మేలైన‌వి.

ఇండియా పోస్ట్ రిక‌రింగ్‌, ఫిక్స్డ్, ట‌ర్మ్ డిపాజిట్ ఆఫ‌ర్లను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. వీటితో క‌లిపి ఇండియా పోస్ట్ 9 పొదుపు ప‌థ‌కాల‌ను అందిస్తుంది. పోస్టాఫీస్ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు చేసేందుకు తెలుసుకోవ‌ల‌సిన విష‌యాలు…

పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్‌

  • ప‌రిమిత‌ ఆదాయం క‌లిగి చిన్న మొత్తాల్లో పొదుపు చేయ‌గ‌లిగిన వారికి ఈ ప‌థ‌కం అనుకూలంగా ఉంటుంది.
  • ఈ ఖాతా క‌నీస కాల‌ప‌రిమితి 5ఏళ్లు.
  • నేరుగా న‌గ‌దు రూపంలో లేదా చెక్కు ద్వారా ఖాతాలో సొమ్ము జ‌మ‌చేయ‌వ‌చ్చు
  • ఒక‌రి పేరు మీద లేదా ఉమ్మ‌డిగానూ పొదుపు ఖాతాను పొందవచ్చు.
  • పదేళ్లు పై బడిన మైన‌ర్ల‌యితే సంరక్షకుని సమక్షంలో ఖాతా తెరవవచ్చు.
  • కనీసం రూ.10తో ఆర్‌డీ ప్రారంభించి, ఎంత సొమ్ము అయినా జమ చేయవచ్చు. గరిష్ఠ పరిమితి లేదు.
  • ప్రస్తుతం వడ్డీ రేటు 7.2 శాతంగా ఉంది. త్రైమాసికానికి ఒక‌సారి వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రిస్తారు.
  • ఖాతా ప్రారంభ సమయంలో లేదా ఎప్పుడైనా నామినీని పేర్కోవచ్చు.
  • ఒకరి పేరుపైనే ఉన్న ఖాతాను ఉమ్మడి ఖాతాగా మార్చుకునే వెసులుబాటు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల పేర్లపై ఉన్న ఉమ్మడి ఖాతాను ఒకే వ్యక్తికి బదిలీచేయవచ్చు.
  • నిర్ణీత సొమ్మును నెలనెలా నిర్ణీత తేదీలో చెల్లించాలి. సొమ్ము జమచేసే తేదీలో జాప్యం జరిగితే నెలకు ప్ర‌తి రూ.5కు అయిదు పైసలు జరిమానా క‌లిపి చెల్లించాల్సి ఉంటుంది.
  • వరుసగా నాలుగు సార్లు చెల్లింపులు చేయని పక్షంలో ఖాతా నిలిపివేయ‌బ‌డుతుంది.
  • ఖాతా పునురుద్ధరించుకునేందుకు మొత్తం డిపాజిట్‌ను జరిమానాతో కలిపి రెండు నెలల్లో చెల్లించాలి . అలా చేయని పక్షంలో ఖాతాలో ఎలాంటి సొమ్ము జమ చేసే అవకాశం ఉండ‌దు.
  • ఖాతా ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత మొత్తం సొమ్ములో గరిష్ఠంగా 50శాతం సొమ్ము మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఖాతాలోని సొమ్ముపై అద‌నంగా 2 శాతం వడ్డీ చెల్లించాలి.
  • ఆర్‌డీ ఖాతా మెచ్యూరిటీ సమయంలో సదరు ఖాతాదారు పూర్తి సొమ్మును తీసుకొని ఖాతా మూసివేయవచ్చు.
  • ఖాతాను కొన‌సాగించాలనుకుంటే ఒక్కో సంవ‌త్స‌రం చొప్పున అయిదేళ్ల దాకా పొడిగించుకునే వీలుంటుంది.

పోస్టాఫీస్ టైమ్‌ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లు:

  • నగదు లేదా చెక్కు అందించి ఖాతాలో సొమ్ము జ‌మ‌చేయ‌వ‌చ్చు.
  • సంర‌క్ష‌కుడి స‌హాయంతో 10ఏళ్లు నిండిన మైన‌ర్లు ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.
  • క‌నీసం రూ.200 పెట్టుబ‌డి పెట్టి ఈ ప‌థ‌కంలో చేరాల్సి ఉంటుంది. పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు.
  • 1,2,3 లేదా 5 ఏళ్ల కాల‌ప‌రిమితో కూడిన ట‌ర్మ్ డిపాజిట్లు మ‌దుప‌రుల‌కు అందుబాటులో ఉన్నాయి.
  • ఖాతా ప్రారంభ సమయంలో లేదా ఎప్పుడైనా నామినీని ప్రతిపాదించవచ్చు.
  • ఏదైనా పోస్టాఫీస్ కార్యాల‌యంలో ఖాతాను ప్రారంభించవచ్చు.
  • పూర్తి వివరాలతో నింపిన టర్మ్‌ డిపాజిట్‌ ఫారంతో పాటు గుర్తింపు, చిరునామా పత్రాలు, రెండు ఫొటోలు జతచేయాలి.
  • టర్మ్‌ డిపాజిట్‌ ఖాతాకు ఒకేసారి డిపాజిట్‌ చేయాలి. అదే ఖాతాకు మరోసారి డిపాజిట్‌ చేసే అవకాశం లేదు.
  • ఒక వ్యక్తి ఎన్ని టైమ్‌ డిపాజిట్‌ ఖాతాలైనా తెరిచేందుకు అవకాశం ఉంది.
  • టర్మ్‌ డిపాజిట్‌ను మరొకరి పేరుపై బదిలీ చేయవచ్చు.
  • మరో పోస్టాఫీసుకు మన ఖాతాను బదిలీ చేయించుకోవచ్చు.
  • ట‌ర్మ్ డిపాజిట్‌లోని పెట్టుబ‌డి పై వడ్డీ వార్షికంగా చెల్లిస్తారు.
  • గ‌డువు తేదీ ముగిశాక విత్‌డ్రా చేయని వడ్డీ సొమ్ము పై అదనంగా ఎలాంటి వడ్డీ జమ కాదు.
  • టైమ్‌ డిపాజిట్‌లో వచ్చే వడ్డీని పొదుపు ఖాతాకు మ‌ళ్లించుకునే వెసులుబాటు ఉంటుంది.
  • ఒక సంవత్సరం పూర్తికాక ముందు ఖాతాదారు తన ఖాతాను మూసివేయాలనుకుంటే సాధారణ పొదుపు ఖాతాకు వ‌ర్తించే వడ్డీ జమ చేస్తారు.
  • 2, 3 లేదా 5ఏళ్ల టైమ్‌ డిపాజిట్‌ ఖాతాలను ఒక సంవత్సరం తర్వాత మూసివేయదల్చుకుంటే టైమ్‌ డిపాజిట్‌పై పేర్కొన్న వడ్డీ కంటే 1శాతం తక్కువగా పెట్టుబడిదారుకు చెల్లిస్తారు.
  • 5 ఏళ్ల టైమ్‌ డిపాజిట్‌పై 3 సంవత్సరాల తర్వాత ఖాతా మూసివేయాలనుకుంటే పేర్కొన్న వడ్డీ రేటులో 2 శాతం తగ్గించి ఇస్తారు.
  • మెచ్యూరిటీ ముగిశాక మొత్తం సొమ్ము తీసేసుకొని ఖాతాను మూసివేయవచ్చు.
  • ఐదేళ్ల టర్మ్‌ డిపాజిట్ పెట్టుబ‌డుల‌పై సెక్షన్‌ 80సీ ప్రకారం గరిష్ఠ సొమ్ము రూ. 1,50,000 వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.
  • రూ.50వేలు ఆ పైన లావాదేవీలు జరిపేవారు ఆదాయపు పన్ను చట్టాన్ని అనుసరించి తప్పనిసరిగా పాన్ కార్డు సంఖ్యను పేర్కొనాలి.

పోస్టాఫీస్ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వ‌డ్డీ రేట్ల వివ‌రాలు…

  • సంవ‌త్స‌రానికి 6.90 శాతం
  • రెండేళ్ల‌కి 6.90 శాతం
  • మూడేళ్ల‌కి 6.90 శాతం
  • ఐదేళ్ల‌కి 7.70 శాతం
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని