అందరికీ అనుకూలం పోస్టాఫీస్‌ పథకాలు

పోస్టల్‌ కేంద్రాలు అపారమైన తపాలా సేవలతో పాటు ప్రజలకు అనేక ఆర్థిక సేవలనూ అందిస్తున్నాయి.....

Updated : 01 Jan 2021 18:48 IST

పోస్టల్‌ కేంద్రాలు అపారమైన తపాలా సేవలతో పాటు ప్రజలకు అనేక ఆర్థిక సేవలనూ అందిస్తున్నాయి.

ప్రపంచంలోనే భారత దేశ పోస్ట్‌ ఆఫీస్‌ నెట్‌వెర్క్‌ అతిపెద్దది, విశిష్టమైనది. దాదాపు ఒకటిన్నర లక్షల పోస్టల్‌ కార్యాలయాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. 90శాతం గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్‌ సేవలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. పోస్టల్‌ కేంద్రాలు అపారమైన తపాలా సేవలతో పాటు ప్రజలకు అనేక ఆర్థిక సేవలనూ అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం వివిధ పొదుపు పథకాలను అందుబాటులోకి తెచ్చింది.

పోస్టాఫీసు అందిస్తోన్న వివిధ పథకాలు:
పోస్ట్‌ ఆఫీస్‌ పొదుపు ఖాతా:
పోస్ట్‌ ఆఫీస్‌ పొదుపు ఖాతా ఓ సాధారణ బ్యాంకు పొదుపు ఖాతాలాగే ఉంటుంది. డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌ లాంటి సేవలతోపాటు చెక్‌ సదుపాయాన్ని ఎస్‌బీ కల్పిస్తోంది.

రికరింగ్‌ డిపాజిట్లు:
నెలవారీగా పొదుపు చేసేందుకు రికరింగ్‌ డిపాజిట్‌ పథకం ఉపయోగంగా ఉంటుంది. ఐదేళ్ల కాలపరిమితికి నిర్ణీత రాబడి ఉంటుంది. ఈ పరిమితిని ఇంకా పెంచుకునే అవకాశం ఉంటుంది.

నెలవారీ ఆదాయ పథకం(మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌):
ఈ పథకంలో మొదట తగినంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయిదేళ్ల కాలపరిమితి తర్వాత పెట్టుబడిదారులకు నెలవారీ వడ్డీతో కలిపి రాబడిని అందిస్తారు. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలో దానంతట అదే జమ అయ్యేలా చూసుకునే వెసులుబాటును తపాలా కార్యాలయాలు అందిస్తున్నాయి.

ప్రజా భవిష్య నిధి(పీపీఎఫ్‌):
దీర్ఘకాలంపాటు మదుపు చేయాలనుకునే వారికి ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది. 15ఏళ్ల కాలపరిమితితో ఉండే వీటిలో పెట్టుబడి పెట్టేందుకు గరిష్ఠ పరిమితి లేదు. కొన్ని నిబంధనలతో పన్ను మినహాయింపు ఉంటుంది. పీపీఎఫ్‌పై విత్‌డ్రాయల్‌ తోపాటు రుణసౌకర్యం ఉంటుంది.

టైమ్‌ డిపాజిట్‌:
ఇవి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లాంటివి. 1,2,3, లేదా 5 ఏళ్ల నిర్ణీత కాలపరిమితితో ఉండే ఈ పథకంలో సంవత్సరానికి రాబడిపై చక్రవడ్డీ లెక్కించి ఇస్తారు. వచ్చిన రాబడి పొదుపు ఖాతాలోకి నేరుగా మళ్లించేలా సౌలభ్యం ఉంటుంది.

పెద్దల పొదుపు ఖాతా:
ఈ పథకం ప్రత్యేకంగా పెద్దల(సీనియర్‌ సిటిజన్స్‌) కోసం రూపొందించింది. అయిదేళ్ల వరకూ నిర్ణీత సొమ్ము పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకం కల్పిస్తోంది. ఆ తర్వాత రాబడిని మూడు నెలలకోసారి వడ్డీ కలిపి అందిస్తారు. అధిక వడ్డీతో అయిదేళ్ల కాలపరిమితిని పెంచుకునే వెసులుబాటు ఉంది.

జాతీయ పొదుపు పత్రాలు:
(ఎన్‌ఎస్‌సీ): జాతీయ పొదుపు పత్రాలు పోస్టాఫీస్‌లో వివిధ డినామినేషన్లలో అందుబాటులో ఉంటాయి. ఈ పత్రాలను ఉపయోగించి బ్యాంకుల్లో రుణం తీసుకునే అవకాశం ఉంది.

కిసాన్ వికాస్ ప‌త్రాలు:
మ‌దుప‌ర్ల‌ను ప్రోత్స‌హించేందుకు ఈ ప‌థ‌కాన్ని తీసుకొచ్చారు. జాతీయ పొదుపు ప‌త్రాల‌కు ద‌గ్గ‌రి పోలిక‌లున్న ఈ కేవైపీలో పెట్టిన పెట్టుబ‌డి 110 నెల‌ల్లో రెట్టింపు అవుతుంది.

సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం:
ఆడ‌పిల్ల‌ల చ‌దువు, పెళ్లి స‌మ‌యంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌కుండా అవ‌స‌రానికి త‌గినంత సొమ్ము స‌మ‌కూర్చుకునే అవ‌కాశాన్ని సుక‌న్య స‌మృద్ధి ప‌థ‌కం క‌లిగిస్తుంది.

ఇవే కాక పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (పీఎల్‌ఐ), రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ (ఆర్‌పీఎల్‌ఐ) పేరిట‌ వివిధ రకాల బీమా పథకాలను పోస్టాఫీసులు అందిస్తున్నాయి…

తపాలా కార్యాలయాలు వాటి సొంత పథకాలనే కాకుండా న్యూ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌), మ్యూచువల్‌ ఫండ్లు, సెక్యూరిటీస్‌, బాండ్లను ప్రజలకు అందుబాటులో ఉంచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని