ప్రధానమంత్రి స్నేహ బంధన్‌ యోజన గురించి విన్నారా?

ప్ర‌ధాన మంత్రి స్నేహ బంధ‌న్ యోజ‌న పేరిట ప్ర‌భుత్వం మూడు ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ పెట్టింది

Published : 20 Dec 2020 17:13 IST

దేశ ప్రజలందరూ బీమా పొందే విధంగా 2015 లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన పథకాలను ప్రారంభించారు. అదే పరంపరలో రక్షా బంధన్‌ సందర్భంగా మరో మూడు కొత్త పథకాలను ప్రధానమంత్రి స్నేహ బంధన్‌ యోజన పేరుతో ప్రారంభించారు. ప్రధానమంత్రి స్నేహ బంధన్‌ యోజన పథకాలు బహుమతులుగా అందించేందుకు ఉద్దేశించినవి. ముందుగా నిర్దేశించిన డబ్బు చెల్లించి బ్యాంకుల్లో వీటిని కొనుగోలు చేయవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజనలకు ఏడాది ప్రీమియం చెల్లింపు (జీవన్‌ సురక్ష డిపాజిట్‌ చెక్కు). ఒకసారి రూ. 351 బ్యాంకుల్లో చెల్లించడం ద్వారా దీన్ని కొనుగోలు చేసి ఒక ఏడాదికి వ్యక్తిగత ప్రమాద, జీవిత బీమాలను కల్పించవచ్చు. ఇందులో రూ. 12 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు, రూ. 330 ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజనకు కేటాయిస్తారు. మిగిలిన రూ. 9 బీమాదారుడి పొదుపు ఖాతాలో జమచేస్తారు.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు చెల్లింపు (సురక్ష డిపాజిట్‌ పథకం):

మొత్తం రూ. 201 చెల్లించి ఒక వ్యక్తికి సురక్ష బీమా యోజన కింద బీమాను కల్పించవచ్చు. ఇందులో భాగంగా మొదటి ఏడాది ప్రీమియంగా రూ. 12 మినహాయిస్తారు. రెండో ఏడాది ప్రీమియం కోసం రూ. 12 పొదుపు ఖాతాలో ఉంచుతారు. మిగిలిన రూ. 177 లను పదేళ్ల టర్మ్‌ డిపాజిట్‌ చేస్తారు. 8 శాతం వడ్డీ రేట్ల వర్తింపుతో వార్షిక వడ్డీ రూ. 14.16 వస్తుంది. ఇది ఏటా సురక్ష బీమా యోజన ప్రీమియం కోసం పదేళ్ల కాలానికి సరిపోతుంది.

ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (జీవన్‌ సురక్ష డిపాజిట్‌ పథకం):

బహుమతి ఇవ్వదలచుకున్న వారి పొదుపు ఖాతాలో రూ. 5001ని జీవన్‌ సురక్ష డిపాజిట్‌ పథకం కింద జమచేయాలి.ఇందులో రూ. 342 మొదటి ఏడాది ప్రీమియంలకు చెల్లిస్తారు.మరో రూ. 342 రెండో ఏడాది ప్రీమియంల కోసం పొదుపు ఖాతాలో పెట్టి ఉంచుతారు.మిగిలిన రూ. 4317లను ఐదు లేదా పదేళ్ల పాటు 8 శాతం వడ్డీ వచ్చేలా టర్మ్‌ డిపాజిట్‌ చేస్తారు. దీనికి ఏటా రూ. 345.36 వడ్డీ వస్తుంది. ఇది ఏటా సురక్ష బీమా యోజన, జీవన్‌జ్యోతి బీమా యోజనల ప్రీమియం కోసం పదేళ్ల కాలానికి సరిపోతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని