ప్ర‌ధాన మంత్రి వ‌య వంద‌న యోజ‌న‌

ఈ ప‌థ‌కం 60ఏళ్లు దాటిన భార‌తీయుల‌కు మాత్రమే. 10ఏళ్ల కాలానికి ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.

Published : 20 Dec 2020 14:14 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత క్ర‌మ‌మైన ఆదాయం గురించే ఎక్కువ చింత‌గా ఉంటుంది. సుర‌క్షిత‌మైన పథ‌కాలతో పాటు మంచి రాబ‌డినిచ్చే వాటిలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని మ‌దుపరులు చూస్తుంటారు. వీరి అవ‌స‌రాల కోస‌మే అన్న‌ట్టుగా భార‌త ప్రభుత్వం ప్ర‌ధాన‌మంత్రి వ‌య వంద‌న యోజ‌న‌ను తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కం 60 ఏళ్లు దాటిన భార‌తీయుల‌కు మాత్రమే. 10 ఏళ్ల కాలానికి ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది. భార‌త ప్ర‌భుత్వ సీనియ‌ర్ సిటిజ‌న్స్ మేలు కోరి వారికి స‌బ్సిడైజ్డ్ ప‌థ‌కంలా దీన్ని ప్ర‌వేశ‌పెట్ట‌డం విశేషం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ ప‌థ‌కాన్ని నిర్వ‌హించే బాధ్య‌త‌లను స్వీక‌రించింది కాబ‌ట్టి భ‌రోసాకు లోటు లేదు. ప‌థ‌కంలో చేరేందుకు అర్హులైన‌వారు…ఈ ప‌థ‌కంలో చేరేవారి వ‌య‌సు 60ఏళ్లు పూర్తి అయి ఉండాలి, ప‌థ‌కం కాలావ‌ధి 10 ఏళ్లు, పాల‌సీ కొనుగోలు చేసేందుకు ఎలాంటి వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోన‌వ‌స‌రం లేదు. కొనుగోలు ఇలా…ఎవ‌రైనా ఎల్ఐసీ ఏజెంటును సంప్ర‌దించో లేదా స‌మీపంలోని కార్యాల‌యానికి వెళ్లి నేరుగా పాల‌సీని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఆన్‌లైన్‌లోనూ ఎల్ఐసీ వెబ్‌సైట్ ద్వారా ప‌థ‌కంలో చేరొచ్చు. వ‌య‌సు ధ్రువీక‌ర‌ణ గుర్తింపు కార్డు త‌ప్ప‌నిస‌రి. ఆధార్ కార్డు, బ్యాంకు వివ‌రాలు పొందుప‌ర్చాలి.

ప్రీమియం ఇలా …ఒక్క‌సారికి ప్రీమియం చెల్లించి పాల‌సీలో చేరాల్సి ఉంటుంది. క‌నీసం రూ.1.5 ల‌క్ష‌లు గ‌రిష్టంగా రూ.15 లక్ష‌లు పెట్టి పాల‌సీ కొనుగోలు చేయ‌వ‌చ్చు. చెక్కు, డీడీ, బ్యాంక‌ర్స్ చెక్కు ద్వారా చెల్లించాలి. పింఛ‌ను ఇస్తారిలా… పెట్టుబడిగా రూ.1.5ల‌క్ష‌ల నుంచి రూ. 15ల‌క్ష‌ల దాకా పెట్టాక‌, నెల నెలా వ‌డ్డీతో పింఛ‌ను అందిస్తారు. పెట్టిన సొమ్ముకు తగిన‌ట్టు నెల‌వారీ చెల్లింపులు ఉంటాయి. వ‌డ్డీ 8.3శాతంగా నిర్ణయించారు. నెల‌కు రూ.1000 నుంచి రూ.5వేల దాకా పింఛ‌ను వ‌స్తుంది. నెల నెలా వ‌ద్ద‌నుకుంటే మూడు మాసాల‌కు, ఆరు నెల‌ల‌కు లేదా సంవ‌త్స‌రానికి ఒక‌సారి పింఛ‌ను అందుకునే వెసులుబాటు ఉంది. అదే మూడు నెల‌ల‌కు- క‌నీసం రూ.3వేలు గ‌రిష్టంగా రూ.15వేలు వస్తాయి. 6నెల‌ల కాలాన్ని పించ‌ను అందుకోవాల‌నుకుంటే క‌నీసం రూ.6000, గ‌రిష్టంగా రూ.30వేలు. ఏడాదికి ఒక‌సారి … క‌నసం రూ.12వేలు, గ‌రిష్టంగా రూ.60వేలు పొందొచ్చు. ఎల‌క్ట్రానిక్ క్లియ‌రింగ్ స‌ర్వీస్‌(ఈసీఎస్‌) ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాకే పింఛ‌ను జ‌మ అవుతుంది. ఆధార్ అనుసంధానిత చెల్లింపుల విధానం ద్వారా జ‌మ‌.

మెచ్యూరిటీ నాటికి… పాల‌సీ కొనుగోలు చేసిన 10ఏళ్ల‌కు ఎంత ప్రీమియంకైతే కొన్నామో అది మొత్తం ఇచ్చేస్తారు. దీంతో పాటు పింఛ‌ను చివ‌రి వాయిదాను పొందుతాం. పాల‌సీదారుకు/ పింఛ‌నుదారుకు అనుకోకుండా ఏమైనా జ‌రిగితే మెచ్యూరిటీ సొమ్మును నామినీ లేదా చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సుల‌కు అంద‌జేస్తారు. రుణ స‌దుపాయం - పాల‌సీ కొనుగోలు చేసిన తర్వాత 3ఏళ్ల‌కు రుణ స‌దుపాయాన్ని పొందొచ్చు. కొనుగోలు ధ‌ర‌లో గ‌రిష్టంగా 75శాతం మేర‌కు రుణం ఇస్తారు. స్వాధీనం చేయాలన్పిస్తే…అత్య‌వ‌స‌ర వైద్య స‌హాయ స‌మ‌యాల్లో పాల‌సీని స్వాధీనం చేసి 98శాతం పెట్టిన పెట్టుబ‌డిని వెన‌క్కి తీసేసుకోవ‌చ్చు. అత్య‌వ‌స‌న వైద్య స‌హాయం లేదా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల వ‌ల్ల డ‌బ్బు కావాల్సి వ‌చ్చి ఎక్క‌డా దొర‌క‌క‌పోతే ఈ పాల‌సీని స్వాధీనం చేయోచ్చు. సొంత వైద్య ఖ‌ర్చుల‌తో పాటు జీవిత భాగ‌స్వామి అనారోగ్య ఖ‌ర్చు అవ‌స‌రాల‌కు పాల‌సీని స్వాధీన‌ప‌ర్చ‌వ‌చ్చు. ఎప్ప‌టిదాకా అవ‌కాశం? ఈ ప‌థ‌కంలో చేరేందుకు 2020 దాకా స‌మ‌యం ఉంది. గ‌డువు పొడిగించే ప్ర‌స్తావ‌న ఇప్ప‌టి వ‌ర‌కు రాలేదు. బ‌హుశా అప్ప‌టికి చేయ‌వ‌చ్చు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని