Insurance: బీమా రిజెక్ట్ కాకూడ‌దంటే.. ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి!

ప్రీమియం కొంచెం అధికంగా ఉన్న‌ప్ప‌టికీ అధిక‌ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉన్న సంస్థ నుంచి పాల‌సీ కొనుగోలు చేయ‌డం మంచిది.   

Updated : 20 Nov 2021 15:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఊహించ‌ని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు ఆర్థికంగా అండ‌గా ఉంటుంద‌నే ఉద్దేశంతో బీమాను కొనుగోలు చేస్తాం. తీరా క్లెయిమ్ చేసే స‌మ‌యం వ‌చ్చే స‌రికి పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు గురైతే.. కుటుంబం మొత్తం ఆర్థికంగా న‌ష్ట‌పోతుంది. ఒక్కోసారి అప్పుల్లో చిక్కుకుపోయే ప్ర‌మాదం కూడా రావ‌చ్చు. అందువ‌ల్ల బీమా క్లెయిమ్‌ల‌ను ఏ కార‌ణంతో రిజ‌క్ట్ చేస్తారో తెలుసుకుంటే.. పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలో, ఆ త‌ర్వాత కూడా త‌ప్పులు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్రమాదం కార‌ణంగా లేదా అనుకోకుండా పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే, అత‌డు/ఆమె కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది జీవిత బీమా. జీవిత బీమాను కొనుగోలు చేసేప్పుడు ఈ పాయింట్ల‌ను గుర్తించుకోవాలి.

స్వ‌యంగా ద‌ర‌ఖాస్తు ఫారం నింపాలి: బీమా కొనుగోలు స‌మ‌యంలో ఎప్పుడైనా పాల‌సీ తీసుకునే వ్య‌క్తి స్వ‌యంగా ప్ర‌తిపాద‌న లేదా ద‌ర‌ఖాస్తు ఫారం పూర్తి చేయాలి. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల త‌ప్పులు దొర్లే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. బీమా సంస్థ‌కు మీ గురించిన అన్ని విష‌యాలూ తెలియ‌జేయాలి. ఏదీ దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు. ఈ విష‌యాన్ని ఒక‌టికి రెండుసార్లు నిర్ధారించుకోవాలి.

ఆల‌స్యం వ‌ద్దు: క్లెయిమ్ చేయాల్సి వ‌స్తే ఆల‌స్యం చేయ‌కూడ‌దు. ఒక‌వేళ మీకు ఏదైనా జరిగి మీ జీవిత భాగస్వామి స‌మాచారం అందించ‌లేని స్థితిలో ఉంటే.. విశ్వ‌స‌నీయులైన‌ స్నేహితులు లేదా బంధువుల ద్వారా బీమా సంస్థ‌కు స‌మాచారం అందేలా చూడాలి. ఈ విషయాలను ముందే మీ కుటుంబానికి చెప్పడం మంచిది.

వైద్య పరీక్షలు: కొనుగోలుదారు ఆరోగ్య స్థితిగ‌తుల‌ను పూర్తిగా అంచనా వేసేందుకు వైద్య పరీక్షలు స్పాన్సర్ చేయొచ్చు. బీమా సంస్థ సూచించిన‌ వైద్య ప‌రీక్ష‌ల‌ను చేయించుకోవ‌డం మంచిది. దీని వ‌ల్ల మీరు ఏమీ దాచిపెట్ట‌లేద‌ని అర్థం అవుతుంది. అలాగే ఏమైనా వ్యాధులు బ‌య‌ట‌ప‌డితే.. పాల‌సీ కొనుగోలుకు ముందే పాల‌సీదారుడితో పాటు మీకు తెలుస్తుంది. ప్రాథ‌మిక స్థాయిలోనే.. అవ‌స‌ర‌మైన  చికిత్స తీసుకుని వాటి నుంచి బ‌యటప‌డొచ్చు.

ప‌త్రాల ప‌రిశీల‌న‌: మీ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా పాల‌సీ ఉన్న‌దీ.. లేనిదీ తెలుసుకునేందుకు పాల‌సీకి సంబంధించిన అన్ని ప‌త్రాల‌ను పూర్తిగా చ‌ద‌వాలి. బీమా సంస్థ పొర‌పాటున వివ‌రాల‌ను త‌ప్పుగా పొందుప‌రిచే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ర‌శీదు పొందిన వెంట‌నే పాల‌సీ ప‌త్రాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాలి.

త‌ప్పులు లేకుండా: వ‌య‌సు, ఆదాయం, వృత్తి, జీవ‌న‌శైలి (ధూమ‌పానం, మ‌ధ్య‌పానం వంటి) అల‌వాట్లు గురించి తెలియ‌జేయండి. ఇప్ప‌టికే ఉన్న ఇత‌ర‌ పాల‌సీలు, ఇప్ప‌టి వ‌ర‌కు క్లెయిమ్ వివ‌రాలు (చేసివుంటే), ఇత‌ర వివ‌రాల‌ను ప్ర‌తిపాద‌న ఫారంలో త‌ప్పులు లేకుండా పూరించాలి. చిన్న చిన్న పొర‌పాట్లు కూడా త‌ప్పులుగా భావించి పాల‌సీని తిరస్క‌రించే ప్ర‌మాదం ఉంది. అందువ‌ల్ల ఫారం నింపేట‌ప్పుడు ఒక‌టి రెండు సార్లు జాగ్ర‌త్త‌గా అక్ష‌ర దోషాలు,  తప్పులు లేకుండా చూసుకోవాలి.

స‌కాలంలో చెల్లించండి: త‌ర‌చూ ప్రీమియం చెల్లింపులు ఆల‌స్యం కావ‌డం కూడా పాల‌సీ తిర‌స్క‌ర‌ణ‌కు కార‌ణం కావ‌చ్చు. వాయిదా నాటికి బీమా సంస్థ ప్రీమియం చెల్లింపు నోటీసు పంపుతుంది. ఒక‌వేళ పాల‌సీ ర‌ద్దు చేయాల్సి వ‌స్తే.. ఏ కారణంగా ర‌ద్దు చేస్తారో ముందుగానే నోటీసు పంపాలి. ఈ నోటీసులు స‌రైన చిరునామాకే సంస్థ పంపిందా? లేదా? తెలుసుకునే హ‌క్కు పాల‌సీదారునికి ఉంటుంది. ఏది ఏమైనా పెనాల్టీలు ప‌డ‌కుండా, అలాగే క్లెయిమ్‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి ప్రీమియంల‌ను స‌కాలంలో చెల్లించాలి.

నామినీ: బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, బీమా ప్ర‌యోజ‌నాలు నామినీకి అంద‌జేస్తాయి బీమా సంస్థ‌లు. అందువ‌ల్ల మీ చిరునామా, ఫోన్ నంబర్‌ వంటి వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బీమా సంస్థ వ‌ద్ద అప్‌డేట్ చేస్తుండాలి. అలాగే పాల‌సీ గురించి ఇంట్లో ఒక‌రిద్ద‌రికైనా తెలియ‌జేయాలి. పాల‌సీ సంబంధించిన ప‌త్రాల‌ను ఎక్క‌డ భ‌ద్ర‌ప‌రిచారో వారికి తెలియ‌జేయాలి.


ఆరోగ్య బీమా: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లను తిరస్కర‌ణ గురికాకుండా పాలసీదారు కింది జాగ్రత్తలు తీసుకోవాలి.

పున‌రుద్ధ‌ర‌ణ‌: ఆరోగ్య బీమా పాల‌సీలు సాధార‌ణంగా వార్షిక ఒప్పందంతో వ‌స్తాయి. అందువ‌ల్ల ప్ర‌తి సంవ‌త్స‌రం చేయాల్సిన మొట్ట‌మొద‌టి ప‌ని ఆరోగ్య బీమాను స‌కాలంలో పున‌రుద్ధ‌రించ‌డం. ఎందుకంటే పాల‌సీ ముగిసిన ఒక్క‌రోజు త‌ర‌వాత మీరు ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌చ్చినా, పాల‌సీని క్లెయిమ్ చేయ‌లేరు. పైగా అప్ప‌టివ‌ర‌కు ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ వంటి ప్రయోజనాలను కోల్పోతారు.

స‌రైన స‌మాచారం ఇవ్వండి: య‌సు, వార్షిక ఆదాయం, జీవ‌న‌శైలి అల‌వాట్లు, వైద్య చ‌రిత్ర మొద‌లైన వాటి గురించి స‌రైన స‌మాచారం ఇవ్వండి. త‌ప్పుడు స‌మాచారం వ‌ల్ల క్లెయిమ్‌లు తిర‌స్క‌ర‌ణ‌కు గురికావ‌చ్చు. లేదా పాల‌సీ ర‌ద్దు కావ‌చ్చు. కొన్ని బీమా సంస్థ‌లు ముందుగా ఉన్న వ్యాధుల (పీఈడీ)ను క‌వ‌ర్ చేయవు. ఇలాంటి వాటికి క్లెయిమ్ కోసం ప్ర‌య‌త్నిస్తే స‌మ‌యం వృథా అవుతుంది త‌ప్ప క్లెయిమ్ పొంద‌లేరు.

స‌మ‌యానికి తెల‌పండి: ఒక‌వేళ ఆసుప‌త్రిలో చేరితే 24 గంట‌ల‌లోపుగా బీమా సంస్థ‌కు తెలియ‌జేయాల‌ని చాలా వ‌ర‌కు ఆరోగ్య బీమా సంస్థ‌లు స్పష్టంగా పేర్కొంటాయి. అందువ‌ల్ల ఆసుప‌త్రిలో చేరిన విష‌యాన్ని స‌కాలంలో తెలియ‌జేయండి. ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండే బీమా సంస్థ నుంచి పాల‌సీ తీసుకోవ‌డం మంచిది.

మినహాయింపు జాబితా తెలుసుకోండి: పాల‌సీలో క‌వ‌ర‌య్యే వ్యాధులు, కవ‌ర్‌కానీ వ్యాధులు గురించి తెలుసుకోండి. వీటి జాబితా పాల‌సీ ప‌త్రాల‌లో ఉంటుంది. ఆరోగ్య బీమాను తీసుకునేందుకు ఈ జాబితాను ప‌రిశీలించండి. మీ వైద్య చ‌రిత్ర‌, కుటుంబ వైద్య చ‌రిత్ర ఆధారంగా మీకు అనువైన పాల‌సీని ఎంపిక చేసుకోవ‌చ్చు.

గుర్తుంచుకోండి: బీమా పాల‌సీ ఏదైనా స‌కాలంలో ప్రీమియం చెల్లించ‌డం చాలా అవ‌స‌రం. పెనాల్టీలు చెల్లించ‌కుండా, అలాగే ఇత‌ర ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోకుండా ఉంటారు. పాల‌సీ తీసుకునే ముందు సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను తెలుసుకోండి. ప్రీమియం కొంచెం అధికంగా ఉన్న‌ప్ప‌టికీ 95 శాతం కంటే ఎక్కువ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఉన్న సంస్థ‌ను ఎంచుకోవ‌డం మంచిది. అలాగే పాల‌సీదారునికి త‌ప్పుడు స‌మాచారం అందించ‌డం గానీ, వివ‌రాలు దాచిపెట్ట‌డం గానీ చెయొద్దు. తీసుకున్న బీమా ఏదైనా అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డేలా ఉండాలి. దానికి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని