పాస్‌బుక్ బాధ్య‌త ఖాతాదారుల‌దే!

బ్యాంకు లావాదేవీల వివ‌రాలు పాస్‌బుక్‌లో పొందుప‌రిచి ఉంటాయి. వినియోగ‌దారునిగా దాని ప‌ట్ల బాధ్య‌త‌గా ఎలా వ్య‌వ‌హ‌రించాలో చూద్దాం..

Published : 15 Dec 2020 17:10 IST

బ్యాంకు ఖాతా తెరిచే సమయంలో ఖాతాదారుడికి బ్యాంకు పాస్‌బుక్‌, చెక్‌బుక్‌, ఏటీఎమ్‌ లాంటి సౌకర్యాలను కల్పిస్తుంది. పాస్‌బుక్‌లో ఖాతా సంబంధిత‌ లావాదేవీలన్నింటినీ నమోదు చేస్తారు. మనం చేసే డిపాజిట్లు, విత్‌డ్రాలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు, బ్యాంకు సేవలకు చెల్లించే రుసుములు తదితర వివరాలన్నీ పాస్‌బుక్‌లో నమోదు చేస్తారు. ఎంతో మంది చిన్న ఖాతాదారులకు ఇంటర్నెట్‌, కంప్యూటర్‌ సదుపాయం ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఖాతాలో జరిగే లావాదేవీలన్నీ ఒకచోట చూసుకునేందుకు వీలుగా పాస్‌బుక్‌ ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో పాస్‌బుక్‌ విషయంలో ఖాతాదారుడు జాగ్రత్త పడాల్సిన విషయాలేంటో తెలుసుకుందాం.

ఖాతాదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • ఖాతాదారుడు తరచూ బ్యాంకు పాస్‌బుక్‌లో లావాదేవీల వివరాలను నమోదు చేయించుకోవ‌డం మంచిది. ఏవైనా తప్పులు దొర్లితే వెంటనే బ్యాంకు దృష్టికి తీసుకెళ్లాలి. పాస్‌బుక్‌లోని సమాచారంతో ఖాతాలో ఉన్న వివరాలు స‌రిపోల్చి చూసుకోవాలి.
  • న‌మోదులో ఏవైనా తేడాలుంటే బ్యాంకు అధికారుల‌కు తెలిపి స‌రిచేయించుకోవాలి.
  • ఖాతాదారుడు స్వయంగా బ్యాంకుకు వెళ్లలేని సందర్భంలో పాస్‌బుక్‌ను పోస్ట్‌ ద్వారా పంపించి కూడా వివరాలు నమోదు చేయించుకోవచ్చు.
  • ఒక్కోసారి పాస్‌బుక్‌లో తప్పుగా నమోదు జరిగి ఖాతాలో ఉండాల్సిన డబ్బు కన్నా ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో బ్యాంకర్‌, ఖాతాదారుడు కింది విధంగా చేయవచ్చని చట్టం నిర్దేశిస్తోంది.
  • ఖాతాలో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా/తక్కువగా డబ్బు ఉంటే, సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదించి సమాచారం ఇవ్వాలి.
  • ఒకవేళ మీ ఖాతాపుస్తకంలో తప్పును వెంటనే గమనించకపోతే, గుర్తించిన తర్వాత బ్యాంకు అధికారికి తెలియపరచాలి. వెంటనే ఖాతాను సరిచేయించుకోవాలి.

పాస్‌బుక్ కియోస్క్

పెరుగుతోన్న సాంకేతికత ఫ‌లాల‌ను బ్యాంకులూ అందిపుచ్చుకున్నాయి. పాస్‌బుక్ ప్రింటింగ్ ను ఖాతాదారులే స్వ‌యంగా చేసుకునేలా కియోస్క్‌లు రంగంలోకి వ‌చ్చాయి. ఈ కియోస్క్ ను ఉప‌యోగించుకునేందుకు ఖాతాదారులు తొలుత బార్ కోడ్‌ను బ్యాంకు వారి వ‌ద్ద నుంచి పొందాలి. ఆ బార్ కోడ్ స‌హాయంతో స్కాన్ చేసి ప్రింటింగ్‌ను మ‌న‌మే స్వ‌యంగా చేసుకోవ‌చ్చు.

పాస్‌బుక్‌ పోగొట్టుకుంటే

  • ఎప్పుడైనా పాస్‌బుక్‌ పోగొట్టుకుంటే, నామ‌మాత్ర‌పు రుసుము వసూలు చేసి కొత్త పాస్‌బుక్‌ను జారీచేసి బ్యాంకు వారు మ‌న‌కు ఇస్తారు.
  • ఖాతా వివ‌రాలు పాస్‌బుక్ ద్వారా తెలిసే అవ‌కాశం ఉండి దుర్వినియోగానికి గుర‌య్యే వీలుంది. కాబ‌ట్టి పాస్‌బుక్ పోయిన విష‌యం వీలైనంత తొంద‌ర‌గా బ్యాంకు వారికి తెలియ‌జేయాలి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని