60 ఏళ్లు వచ్చాక.. నెల‌కు ₹3000 వచ్చేలా!

అసంఘ‌టిత రంగాల వారి కోసం ప్ర‌ధాన‌మంత్రి శ్ర‌మ్ యోగి మన్‌ధ‌న్ యోజ‌న అనే స్కీమ్‌ను తీసుకొచ్చారు... 

Published : 04 Jul 2021 16:34 IST

అసంఘ‌టిత రంగాల వారికి పెన్షన్లు ఇచ్చేలా... 2019లో ప్ర‌ధాన‌మంత్రి శ్ర‌మ్ యోగి మన్‌ధ‌న్ యోజ‌న అనే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పెన్ష‌న్ స్కీమ్‌లో చేరితే చందాదారుడికి 60 ఏళ్లు వచ్చాక నెల‌కు ₹3,000 వరకు పెన్ష‌న్ పొందొచ్చు.  ఈ స్కీమ్‌లో చేరాలంటే అర్హతలేంటి, ఏం చేయాలి, ఎలా నమోదు చేసుకోవాలో చూద్దాం!

అసంఘ‌టిత రంగాల్లో పనిచేస్తూ నెల‌కు ₹15,000 కంటే త‌క్కువ వేత‌నం తీసుకుంటున్న వాళ్లు ప్ర‌ధాన‌మంత్రి శ్ర‌మ్ యోగి మ‌న్‌ధ‌న్ యోజ‌న స్కీమ్‌కు అర్హులు. 18 నుంచి 40 సంవ‌త్స‌రాల వ‌య‌సు క‌లిగినవారు ఇందులో పేరు న‌మోదు చేసుకోవ‌చ్చు. ఇది స్వ‌చ్ఛంద పెన్ష‌న్ ప‌థ‌కం.. దీని ద్వారా వచ్చే ఆదాయంపై ఎలాంటి ఆదాయ ప‌న్ను వ‌ర్తించ‌దు. 50:50 నిష్ప‌త్తిలో చందాదారుడు ఎంత జ‌మ‌ చేస్తే, అంతే స‌మానంగా కేంద్ర ప్ర‌భుత్వం జ‌మ‌ చేస్తుంది. ఈ ప‌థ‌కం కింద చందాదారుడికి 60 ఏళ్లు వచ్చాక  నెల‌కు ₹3,000 చొప్పున పెన్ష‌న్ పొందుతాడు. 60 ఏళ్ల కంటే ముందే మ‌ర‌ణిస్తే వారి భార్య లేదా భ‌ర్త ఈ ప‌థ‌కాన్ని కొన‌సాగించొచ్చు.

ఎలా న‌మోదు చేసుకోవాలి..?

అర్హ‌త ఉన్న చందాదారులు కామ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్స్ (సీఎస్‌సీ)ల‌కు వెళ్లి వివరాలు న‌మోదు చేసుకోవ‌చ్చు. ఈ సెంట‌ర్ల జాబితా ఎల్ఐసీ ఇండియా శాఖల్లో లభిస్తుంది. ఈ పెన్షన్‌ ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు పొదుపు బ్యాంకు ఖాతా/ జ‌న్ ధ‌న్ ఖాతా, ఆధార్ కార్డ్ ఉండాలి. దేశ‌వ్యాప్తంగా 3.13 ల‌క్ష‌ల సీఎస్‌సీ సెంట‌ర్ల‌లో న‌మోదు చేసుకునే స‌దుపాయం ఉంది.

ఉప‌సంహ‌ర‌ణ నియ‌మాలేంటి...

ప‌థ‌కంలో చేరిన త‌ర్వాత‌ ప‌దేళ్ల కంటే ముందే నిష్క్ర‌మిస్తే, చందాదారుడు జ‌మ‌ చేసిన మొత్తానికి బ్యాంకు వ‌డ్డీతో క‌లిపి ఇస్తారు. ప‌దేళ్ల త‌ర్వాత, 60 ఏళ్ల‌కు ముందే ఉప‌సంహ‌రించుకుంటే ఫండ్ ద్వారా సంపాదించిన వడ్డీ లేదా పొదుపు బ్యాంకు వడ్డీ రేటులో ఏది ఎక్కువైతే అది ఇస్తారు. దాంతో పాటు, లబ్ధిదారుడి వాటా కూడా తిరిగి ల‌భిస్తుంది.

ఎలా ప‌నిచేస్తుందంటే...

18 ఏళ్ల వ‌య‌సులో ప‌థ‌కంలో చేరితే నెల‌కు ₹55 జ‌మ‌ చేయాల్సి ఉంటుంది. అంతే మొత్తం ప్రభుత్వమూ జమ చేస్తుంది. వ‌య‌సు పెరిగిన కొద్దీ కాంట్రిబ్యూష‌న్ మొత్తం పెరుగుతూ వ‌స్తుంది. మొద‌టి నెల చెల్లింపు న‌గ‌దు రూపంలో ఇస్తే... వారికి ర‌శీదు ఇస్తారు. దాంతోపాటు ప్ర‌త్యేక ఐడీ నంబ‌ర్లున్న కార్డుల‌ను కూడా సీఎస్‌సీలు వినియోగదారులకు అందిస్తాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని