సెప్టెంబరు కల్లా ఎయిరిండియా ప్రైవేటీకరణ

ఎయిరిండియాను విక్రయించడానికి ఆర్థిక బిడ్లు ఆహ్వానించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని.. సెప్టెంబరు కల్లా ఒప్పందం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్‌తో పాటు పలు కంపెనీలు గతేడాది డిసెంబరులో ప్రాథమిక బిడ్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే

Published : 14 Apr 2021 01:42 IST

 ఆర్థిక బిడ్‌ల ప్రక్రియ ప్రారంభం

దిల్లీ: ఎయిరిండియాను విక్రయించడానికి ఆర్థిక బిడ్లు ఆహ్వానించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించిందని.. సెప్టెంబరు కల్లా ఒప్పందం పూర్తవుతుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్‌తో పాటు పలు కంపెనీలు గతేడాది డిసెంబరులో ప్రాథమిక బిడ్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక బిడ్లు విశ్లేషింశాక అర్హతగల బిడ్డర్లకు ఎయిరిండియాకు చెందిన వర్చువల్‌ డేటా రూమ్‌(వీడీఆర్‌)కు యాక్సెస్‌ లభించింది. ఇందులో పెట్టుబడుదార్ల ప్రశ్నలకు సమాధానాలు లభించాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం లావాదేవీ ఆర్థిక బిడ్‌ల దశకు చేరిందని.. మొత్తం ఒప్పందం సెప్టెంబరు కల్లా పూర్తి కావొచ్చని వారు అంచనా వేస్తున్నారు. ఎయిరిండియాలో ప్రభుత్వం తనకున్న 100 శాతం వాటాను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రభుత్వం అయిదు సార్లు ప్రాథమిక బిడ్‌ల గడువు తేదీని పొడిగించిన విషయమూ విదితమే.
జేఎల్‌ఆర్‌ విక్రయాల్లో 12% వృద్ధి
దిల్లీ:  గత ఆర్థిక సంవత్సరం (2020-21) నాలుగో త్రైమాసికంలో టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) రిటైల్‌ విక్రయాలు 12.4 శాతం వృద్ధి చెంది 1,23,483 యూనిట్లుగా నమోదయ్యాయి. ఏడాది క్రితంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో చైనాలో అమ్మకాలు 127 శాతం పెరిగాయని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికాలో అమ్మకాలు 10.4 శాతం వృద్ధి చెందగా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొవిడ్‌ మునుపటి స్థాయుల కంటే తక్కువగా అమ్ముడయ్యాయి. అమ్మకాలు తగ్గిన వాటిలో విదేశీ మార్కెట్లు (10 శాతం), బ్రిటన్‌ (6.8 శాతం), ఐరోపా (4.9 శాతం)లు ఉన్నాయి. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌ అంతర్జాతీయ రిటైల్‌ అమ్మకాలు 13.6 శాతంతగ్గి 4,39,588 యూనిట్లకు పరిమితమయ్యాయి. కొవిడ్‌-19 ప్రతికూల ప్రభావమే ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది. ఈ సమయంలో కంపెనీకి చెందిన కొత్త ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ అత్యధికంగా 45,244 అమ్మకాలు సాధించింది.
12,000 క్రూజ్‌ సెడాన్‌లలో ఎయిర్‌బ్యాగ్‌లు మారుస్తాం: షెవ్రొలె
దిల్లీ: అమెరికా వాహన దిగ్గజం జనరల్‌ మోటార్స్‌కు చెందిన షెవ్రొలె ఇండియా, తమ 12,000 క్రూజ్‌ సెడాన్‌ వాహనాల్లో లోపాలున్న ఎయిర్‌బ్యాగ్‌ల్ని మారుస్తామని తెలిపింది. 2009-17 మధ్యకాలంలో తయారైన క్రూజ్‌ సెడాన్‌ వాహనాల్లో ఈ తరహా ఎయిర్‌బ్యాగ్‌లుంటే తనిఖీ చేసి, మారుస్తామని పేర్కొంది. జపాన్‌కు చెందిన టకాటా కార్ప్‌ తమ ఎయిర్‌బ్యాగ్‌ల్లో కొన్ని లోపాలతో తయారయ్యాయని వెల్లడించడంతో, 2019 ఫిబ్రవరి 25న రీకాల్‌కు పిలుపునివ్వగానే ప్రపంచ వ్యాప్తంగా లక్షల వాహనాల యజమానులు స్పందించి, తరలి వెళ్లారు. ఈ కార్లను తనిఖీ చేసి లోపాలున్న ఎయిర్‌బ్యాగ్‌లు మార్చారు. మన దేశంలోనూ టకాటా ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్న క్రూజ్‌ సెడాన్‌ వాహనాల్లో వాటిని తొలగించి, కొత్త వాటిని అమరుస్తున్నట్లు షెవ్రొలె తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని