RBI MPC Decisions: యథాతథ స్థితి వైపే ఆర్‌బీఐ మొగ్గు..!

ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వైపే మొగ్గుచూపింది....

Updated : 08 Oct 2021 15:10 IST

ముంబయి: ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వైపే మొగ్గుచూపింది. దీంతో రెపోరేటు 4 శాతంగా.. రివర్స్‌ రెపోరేటు 3.35 శాతంగా కొనసాగనున్నాయి. ఇలా వడ్డీరేట్లను మార్చకపోవడం ఇది వరుసగా ఎనిమిదోసారి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ మరోసారి సర్దుబాటు వైఖరి వైపే మొగ్గుచూపింది. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారి ఆర్‌బీఐ రెపోరేటును మే 2020లో 4 శాతానికి కుదించింది. నాటి నుంచి యథాయథ స్థితిని కొనసాగిస్తూ వస్తోంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడిలో ఉంచడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ పేర్కొంది. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

గవర్నర్‌ ప్రసంగంలోకి కీలకాంశాలు..

* పెట్టుబడుల్లో కూడా స్పష్టమైన పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నాయి. గిరాకీ సైతం పుంజుకుంటోంది. పండగ సీజన్‌లో పట్టణ ప్రాంతాల్లో గిరాకీ మరింత వేగంగా ఊపందుకుంటుందని భావిస్తున్నాం.

*  ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటు 9.5 శాతంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధి రేటును 17.1 శాతంగా నిర్దేశించుకుంది.

* ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని శక్తికాంత దాస్‌ తెలిపారు. కీలక ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలోనే ఉందన్నారు. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగానే ఉందని పేర్కొన్నారు.

* చివరి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నాటితో పోలిస్తే ఆర్థికంగా భారత్‌ ప్రస్తుతం మెరుగైన స్థాయిలో ఉందని ఆర్‌బీఐ పేర్కొంది.

* క్యాపిటల్‌ గూడ్స్‌కి గిరాకీ పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తోంది.

* ఈ ఆర్థిక సంవత్సర రిటైల్‌ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని 5.7 శాతం నుంచి 5.3 శాతానికి ఆర్‌బీఐ సవరించింది. జులై-సెప్టెంబరులో అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం. అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక లక్ష్యాన్ని సైతం 5.3 శాతం నుంచి 4.5 శాతానికి కుదించారు.

* రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి నేపథ్యంలో వచ్చే నెల ఆహార ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండనుంది.

* వృద్ధికి సరిపడా ద్రవ్య లభ్యతకు ఆర్‌బీఐ హామీ.

* ఐఎంపీఎస్‌ పరిమితిని రూ.2లక్షల నుంచి రూ.5లక్షలకు పెంపు.

* దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ విధానంలో రిటైల్‌ డిజిటల్‌ పేమెంట్‌ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆర్‌బీఐ ప్రతిపాదన.

* ఎన్‌బీఎఫ్‌సీల్లో పెద్ద కస్టమర్ల ఫిర్యాదులను పరిష్కరించేందుకు అంతర్గత అంబుడ్స్‌మన్‌ ఏర్పాటు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని