RBI governor: ఆర్‌బీఐ గవర్నర్‌గా మరో మూడేళ్లు శక్తికాంత దాస్‌

భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది...

Updated : 29 Oct 2021 14:38 IST

ముంబయి: భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ మరో మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రధానమంత్రి నేతృత్వంలోని కేబినెట్‌ నియామకాల కమిటీ నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 10తో ఆయన తొలి మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. మాజీ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేయడంతో 2018లో దాస్‌ గవర్నర్‌ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

సంక్షోభంలో సమర్థంగా..

కరోనా సంక్షోభ సమయంలో ఆర్థిక కార్యకలాపాలన్నీ దెబ్బతిని వ్యవస్థలో ద్రవ్యలభ్యత సమస్య ఏర్పడ్డ విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన దాస్‌ ఆ సమస్యను పరిష్కరించేందుకు కీలక చర్యలు చేపట్టారు. వడ్డీరేట్లను తగ్గిస్తూ ద్రవ్యపరపతి విధానంలో సర్దుబాటు వైఖరిని కొనసాగించారు. ప్రభుత్వ ఉద్దీపనలతో పాటు ఆర్‌బీఐ తరఫున ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా లోన్ మారటోరియం సత్ఫలితాలిచ్చింది. పైగా దాన్ని రూపొందించిన విధానం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక మినహాయింపులు ప్రకటించారు. అదే విధంగా కీలక సమయంలో ప్రభుత్వంతో సమన్వయంతో ముందుకు నడిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్థిక వ్యవస్థకు మరింత శక్తిని నింపేందుకు శక్తికాంత దాస్‌ వ్యూహాలు మరింత అవసరమని ప్రభుత్వం భావించినట్లుంది!

1980వ బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన శక్తికాంతదాస్‌.. కీలక బాధ్యతల్ని నిర్వర్తించారు. కేంద్ర రెవెన్యూ విభాగం, ఆర్థిక వ్యవహారాల విభాగంలో కార్యదర్శిగా పనిచేశారు. 2016లో పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖలో పనిచేస్తున్న సమయంలో దాదాపు 8 బడ్జెట్ల రూపకల్పనలో ఆయన కృషి ఉంది. ఆర్థిక, ట్యాక్సేషన్‌, పరిశ్రమలు, మౌలిక వసతుల వంటి రంగాల్లో రాష్ట్ర, కేంద్ర స్థాయిలో కీలక హోదాల్లో పనిచేశారు. ప్రపంచ బ్యాంకు ప్రత్యామ్నాయ గవర్నర్‌గా, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గవర్నర్‌గానూ వ్యవహరించారు. ఐఎంఎఫ్‌, జీ20, బ్రిక్స్‌, సార్క్‌ వంటి అంతర్జాతీయ స్థాయి సమావేశాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు