RBI: ఈ సారి కీలక రేట్లు యథాతథం.. రేపటి నుంచి ఎంపీసీ భేటీ

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు అలముకొన్న వేళ కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published : 05 Dec 2021 16:16 IST

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు అలముకొన్న వేళ కీలక వడ్డీ రేట్లను రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా (ఆర్‌బీఐ) యథాతథంగా ఉంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలన్న లక్ష్యాన్ని కొనసాగిస్తూనే వృద్ధికి దోహదం చేసే విధంగా కీలక వడ్డీ రేట్లను సవరించే విషయంలో మరింత అనుకూల సమయం కోసం ఆర్‌బీఐ వేచి చూడొచ్చని పేర్కొన్నారు. సోమవారం (డిసెంబర్‌ 6) నుంచి మూడ్రోజుల పాటు ఆర్‌బీఐ గవర్నర్‌ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) భేటీ కానుంది. కీలక వడ్డీ రేట్లపై బుధవారం ఆర్‌బీఐ ప్రకటన చేయనుంది.

కొత్త కొవిడ్‌ వేరియంట్‌ పట్ల గందరగోళం నెలకొన్న వేళ పూర్తి స్థాయి స్పష్టత వచ్చాకే వడ్డీ రేట్లపై ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంటుందని కోటక్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌ అభిప్రాయపడింది. రివర్స్‌ రెపో రేట్లను నామమాత్రంగా సవరించే అవకాశం ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ అభిప్రాయపడింది. ఒకవేళ ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచితే అది వరుసగా తొమ్మిదో సారి అవుతుంది. చివరి సారిగా 2020 మే 22న వడ్డీ రేట్లను సవరించింది. భవిష్యత్‌లో అయితే రెపో రేట్లు పెరుగుతాయని, గృహ రుణ వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని అన్‌రాక్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ అనుజ్‌ పురీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని