RBI: వడ్డీరేట్లలో మార్పు లేదు

మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను

Updated : 04 Jun 2021 16:53 IST

ముంబయి: మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌. ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. కొవిడ్‌ ఉద్ధృతి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపో రేటు 3.35శాతంగా ఉన్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. ఏప్రిల్‌లో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన విషయం తెలిసిందే. ఇక కొవిడ్ వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ రికవరీ కాస్త నెమ్మదించింది. దీంతో ఈసారి కూడా సర్దుబాటు విధాన వైఖరినే కొనసాగించనున్నట్లు దాస్‌ వెల్లడించారు. 

సమీక్షలో కొన్ని ముఖ్యాంశాలు..

* 2021-22 ఆర్థిక సంవత్సర జీడీపీ అంచనాలను 10.5శాతం నుంచి 9.5శాతానికి ఆర్‌బీఐ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాలను కూడా 26.2శాతం నుంచి 18.5శాతానికి సవరించింది. 

* ఈ ఏడాది సగటు వర్షాపాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది. 

* 2021- 22 ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యోల్బణం 5.1శాతంగా నమోదు కావొచ్చని అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో 5.2శాతం, రెండో త్రైమాసికంలో 5.4శాతం ఉండొచ్చని తెలిపింది. 

* ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహకారం అందించడం కోసం రూ. 16వేల కోట్ల ద్రవ్యాన్ని స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐడీబీఐ)కి ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

* జీ-శాప్‌ 2.0 కింద జూన్‌ 17న రూ. 40వేల కోట్ల విలువైన సెక్యూరిటీస్‌ కొనుగోలు చేయనున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

ఇకపై గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులు కూడా డిపాజిట్ల సర్టిఫికేట్లు జారీ చేసేందుకు అనుమతి కల్పించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని