Updated : 08 Dec 2021 11:23 IST

RBI Monetary Policy: కీలక వడ్డీరేట్లు మళ్లీ యథాతథం

ముంబయి: మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) మరోసారి యథాతథంగా ఉంచింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఈసారి కూడా కీలక రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. రెపో రేటు 4శాతంగా ఉంచగా.. రివర్స్‌ రెపో రేటును 3.35 శాతంగా కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్‌ తెలిపారు. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటు 4.25 శాతంగానే ఉండనుంది. అక్టోబరులో జరిగిన సమావేశంలోనూ వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇలా రేట్లను యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది తొమ్మిదోసారి. కరోనాతో ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచేందుకు చివరిసారి ఆర్‌బీఐ రెపోరేటును మే 2020లో 4 శాతానికి కుదించింది. నాటి నుంచి దాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది.

కరోనా సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటుండడంతో ద్రవ్య లభ్యతను తగ్గించే దిశగా ఆర్‌బీఐ చర్యలు చేపట్టనుందని రెండు వారాల క్రితం అంతా భావించారు. జీఎస్టీ వసూళ్లు పుంజుకోవడం, తయారీ, సేవా కార్యకలాపాలు గాడిన పడడం అందుకు దోహదం చేశాయి. కానీ, మధ్యలో అకస్మాత్తుగా వచ్చి పడిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ పరిస్థితుల్ని తలకిందులు చేసింది. ఈ వేరియంట్‌ వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండకపోవచ్చునన్న సంకేతాలు వెలువడుతున్నప్పటికీ.. మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కలవరపెడుతోంది. దీంతో ఈసారి కూడా సర్దుబాటు ధోరణినే కొనసాగించనున్నట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు.

ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో వినిమయానికి గిరాకీ..

కొవిడ్‌ కారణంగా కుంగిన భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుందని శక్తికాంత దాస్‌ తెలిపారు. మహమ్మారిని మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఇటీవల పన్నులు తగ్గించిన నేపథ్యంలో వినిమయ గిరాకీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నవంబరులో ముడి చమురు ధరలు తగ్గడం సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉందన్నారు. ద్రవ్యోల్బణం కిందకు దిగొచ్చే సూచనలు కనిపిస్తున్నాయన్నారు.

ద్రవ్యోల్బణం 5.3%..

సెమీకండక్టర్ల కొరత, కమొడిటీ ధరలు పెరగడం, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ల ఒడుదొడుకుల నేపథ్యంలో ఈ ఏడాది ద్రవ్యోల్బణం 5.3శాతంగా అంచనా వేసింది. అక్టోబరు- డిసెంబరులో 5.1%, జనవరి- మార్చిలో 5.7%, ఏప్రిల్‌-జూన్‌లో 5%, జులై-సెప్టెంబరులో 5% ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ అంచనా వేసింది.

వృద్ధి అంచనాల్లో స్వల్ప మార్పులు..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధిరేటు అంచనాను 9.5 శాతంగా కొనసాగించింది. అక్టోబరు- డిసెంబరులో 6.6%, జనవరి- మార్చిలో 6.4%, ఏప్రిల్‌-జూన్‌లో 17.2%, జులై-సెప్టెంబరులో 7.8% వృద్ధిని ఆర్‌బీఐ అంచనా వేసింది.

సమీక్షలోని ఇతర కీలకాంశాలు..

* దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఒమిక్రాన్‌ భయాలు అలముకున్నాయి.

* యూపీఐ ఆధారిత ఫీచర్‌ ఫోన్‌ ఉత్పత్తుల విడుదల.

* ఐపీఓలకు యూపీఐ పరిమితి రూ.5 లక్షలకు పెంపు.

* ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు కొవిడ్‌ మునుపటి స్థాయికి చేరుకుంటున్నాయి.

* ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ద్రవ్యలభ్యత నిర్వహణ కొనసాగుతుంది.

* విదేశీ శాఖల్లో మూలధనాన్ని నింపడానికి, లాభాలను స్వదేశానికి రప్పించడానికి బ్యాంకులకు ఆర్‌బీఐ ముందస్తు అనుమతి అవసరం లేదు.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని