SIP: నెలకు ₹14,500తో 35 ఏళ్లలో ₹23 కోట్లు!

సిప్ పెంచుకుంటూ పోతే కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో మంచి రాబ‌డి ల‌భిస్తుంది

Updated : 28 Jun 2021 17:15 IST

అందుబాటులో ఉన్న పెట్టుబడితో దీర్ఘకాల అవసరాల కోసం ఎవరైతే నెలవారీ కొంత మొత్తాన్ని సిప్‌ రూపంలో పెట్టుబడి పెట్టి లాభాలను పొందుతారో అతడిని తెలివైన పెట్టుబ‌డుదారుడు అనొచ్చు. దీనికోసం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి అవ‌స‌రం లేదు. నెల‌కు వీలైనంత మొత్తంతో సిప్ చేస్తూ దీర్ఘ‌కాలంలో మీరు ఊహించిన దానికంటే మంచి రాబ‌డి పొందొచ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవ‌నం కోసం లేదా పిల్ల‌ల చ‌దువులు, అవ‌స‌రాల కోసం ఎటువంటి దిగులూ ఉండ‌దు.

చాలా మంది మ్యూచువల్ ఫండ్లలో నెలవారీ సిప్ (క్రమానుగత పెట్టుబడి)లో పెట్టుబడులు పెడతారు. కానీ, వారిలో ఎంతమంది తమ పెట్టుబడి పద్ధతిలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటారు? అంటే వారి వార్షిక ఆదాయం పెరిగిన‌ప్పుడు సిప్‌ను పెంచ‌కుంటూ పోతారు?

సరళంగా చెప్పాలంటే, ఒక సిప్ పెట్టుబడిదారుడు 25 సంవత్సరాల వయస్సులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించి, పదవీ విరమణ వరకు కొనసాగితే, వారు మరో 35 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టగలుగుతారు. ఈ కాలంలో పెట్టుబడిదారుడు చ‌క్ర‌వ‌డ్డీ ప్రయోజనాన్ని పొందుతాడు. త‌క్కువ మొత్తంతో సిప్ ప్రారంభించి ఆ త‌ర్వాత సంవ‌త్స‌రానికి ఒక‌సారి ఆదాయం పెరిగిన‌ప్పుడు సిప్ పెంచుకుంటూ పోతే కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో మంచి రాబ‌డి ల‌భిస్తుంది. మ్యూచువల్ ఫండ్ సిప్‌లో 35 సంవ‌త్స‌రాలు పెట్టుబ‌డి కొన‌సాగిస్తే, దానిపై స‌గ‌టున‌ 12 నుంచి 16 శాతం వ‌ర‌కు వ‌డ్డీ ల‌భిస్తుంది. అయితే సిప్ ప్రారంభ స‌మ‌యంలోనే ల‌క్ష్యాన్ని రూ.20 కోట్లుగా నిర్దేశించుకోవాలి. అప్పుడే వార్షిక ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అధిగమించగలం.

25 సంవత్సరాల వయస్సులో నెల‌కు రూ.14,500తో పెట్టుబ‌డులు ప్రారంభించి, సంవ‌త్స‌రానికి 10 శాతం సిప్ మొత్తాన్ని పెంచుకుంటూ పోతే 60 సంవ‌త్స‌రాలు వచ్చేస‌రికి రూ.22.93 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. వ‌డ్డీ శాతం ఎక్కువ‌గా ఉంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్‌తో అంత‌కు ముందే కూడా ఇంత మొత్తాన్ని కూడ‌బెట్టుకోవచ్చు. అప్పుడు ఎటువంటి ఇబ్బందీ లేకుండా జీవితాన్ని కొన‌సాగించ‌వ‌చ్చు.

ఇక్కడ ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా నెల‌కు కొంత కేటాయిస్తున్నాం కాబ‌ట్టి, ఇప్పుడు ఉన్న జీవ‌నానికి ఎటువంటి ఇబ్బంది ఉండ‌దు. ఈ నేపథ్యంలో ఒక్క‌సారి సిప్ పెట్టుబ‌డుల‌ను ప‌రిశీలించి వెంట‌నే ప్రారంభించడం మంచిది. ఇత‌ర పెట్టుబ‌డులు, ఈఎంఐలు, బీమా ప్రీమియం.. ఏం ఉన్నా నెల‌కు కొంత సిప్ కోసం కేటాయిస్తుంటే, కొన్ని రోజుల‌కు అదే అల‌వాటుగా మారుతుంది. ఆటో-డెబిట్ ఆప్ష‌న్ పెట్టుకుంటే మనం గుర్తంచుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా ప్ర‌తి నెలా మ‌న ఖాతా నుంచి డ‌బ్బు సిప్ ఖాతాలో జ‌మ‌వుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు