SIP: నెల‌కు ₹9 వేలతో ప్రారంభించి.. 15 ఏళ్ల‌లో ₹కోటి పొందడమెలా..?

వార్షిక ఆదాయం పెరిగిన‌ప్పుడ‌ల్లా సిప్ మొత్తాన్ని పెంచుకుంటే మ‌దుపురులు త‌క్కువ స‌మ‌యంలో త‌మ పెట్టుబ‌డి ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌ల‌రు. 

Published : 04 Sep 2021 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధార‌ణంగా అంద‌రూ చేసే ప‌నినే మ‌రో కోణంలో ఆలోచించి చేస్తారు కొంద‌రు. త‌ద్వారా విజ‌యం సాధిస్తారు. ఇదే సూత్రం మదుపు చేసే విషయంలోనూ వ‌ర్తిస్తుంది. అంద‌రూ వెళ్లే దారిలో కాకుండా కొంచెం స్మార్ట్‌గా పెట్టుబ‌డులు పెడితే అధిక రాబ‌డి సాధించ‌వచ్చని అంటున్నారు నిపుణులు. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిస్ట‌మెటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ (సిప్‌) ద్వారా మదుపుచేస్తే కాంపౌండింగ్ ప్ర‌యోజ‌నాల‌తో దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డి పొందేందుకు అస్కారం ఉంటుందనేది చాలామందికి తెలిసిన విష‌య‌మే. అందువ‌ల్ల మ‌దుప‌రులు సిప్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేస్తారు. అయితే ఇలా మ‌దుపు చేసే వారిలో ఎంత మంది వారి జీతం పెరిగిన‌ప్పుడు సిప్ మొత్తాన్ని పెంచుతున్నారనేది ముఖ్యం. మ‌దుపరులు త‌క్కువ స‌మ‌యంలో త‌మ పెట్టుబ‌డి ల‌క్ష్యాన్ని సాధించేందుకు.. వార్షిక ఆదాయం పెరిగిన‌ప్పుడ‌ల్లా సిప్ మొత్తాన్ని పెంచుకుంటే మంచి రాబ‌డిని సాధించ‌వ‌చ్చ‌ని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

40 ఏళ్ల వ‌య‌సుకు ₹1 కోటి సేక‌రించాలంటే..?

ఎందులో మ‌దుపు చేయాలి?: మ‌దుప‌రులు 10 సంవ‌త్స‌రాలు అంత‌కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే రిస్క్ సామ‌ర్థ్యాన్ని బ‌ట్టి 8 నుంచి 12 శాతం రాబ‌డి పొందేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే 40 ఏళ్లు వ‌య‌సు వ‌చ్చేస‌రికి రూ.1 కోటి పొందాలన్న లక్ష్యంతో మ‌దుపు చేసే వారు కాస్త రిస్క్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు ఒక మంచి ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు.

స్టెప్‌-అప్ సిప్‌..: రూ.1 కోటి ల‌క్ష్యంతో మదుపు ప్రారంభించిన వారు అనుకున్న స‌మ‌యానికి త‌మ ల‌క్ష్యానికి చేరువయ్యేందుకు సాధార‌ణ ఫ్లాట్‌ మ్యూచువ‌ల్ ఫండ్ సిప్ స‌రిపోదు. ఇందుకోసం వార్షిక స్టెప్‌-అప్‌తో కూడిన ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో 12 శాతం కనీస రాబ‌డి ఉంటుంది. అలాగే క‌నీస నెల‌వారీ పెట్టుబ‌డితో సిప్‌ను ప్రారంభించి లక్ష్యాన్ని సాధించేందుకు ఈ స్టెప్-అప్ విధానం మ‌దుప‌రులకు స‌హాయ‌ప‌డుతుంది.

ఎంత పెట్టుబ‌డి పెట్టాలి.. ఏటా ఎంత పెంచాలి?: మదుపరులు 25 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే.. 40 ఏళ్ల వ‌య‌సుకు 15 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంటుంది. సాధార‌ణంగా 10 శాతం వార్షిక స్టెప్‌-అప్ ఉంటే మంచిద‌ని నిపుణులు సూచిస్తుంటారు. కానీ ఇక్క‌డ మ‌దుపరి లక్ష్యం పెద్ద‌ది కాబ‌ట్టి వార్షిక స్టెప్‌ అప్ సిప్ క‌నీసం 15 శాతం ఉండాలి. మ్యూచువల్ ఫండ్ సిప్ కాలిక్యులేటర్ ప్రకారం.. ఒక వ్యక్తి తన 25 సంవత్సరాల వయసులో సిప్ చేయ‌డం ప్రారంభిస్తే, 12 శాతం వార్షిక రాబడి అంచనాతో 40 ఏళ్ల వయసుకు అంటే త‌రువాతి 15 సంవత్స‌రాల్లో రూ.1కోటి లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రారంభంలో నెలకు రూ.9,000 పెట్టుబడి పెట్టాలి. అనంతరం 15 శాతం వార్షిక స్టెప్-అప్ రేటు ఉండాలి. అప్పుడు అతడు/ఆమె మదుపు చేసిన మొత్తం రూ.51,38,684, మొత్తం రాబడి రూ.50,96,594, మెచ్యూరిటీ మొత్తం రూ. 1,02,35,278 అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని