Rakesh Jhunjhunwala: స్టాక్‌ మార్కెట్‌లో స్టార్‌ తిరిగింది!

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా ప్రయాణాన్ని ఔత్సాహిక మదుపర్లే కాదు, కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే...

Published : 05 Sep 2021 08:50 IST

స్టాక్‌ మార్కెట్‌కూ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకూ విడదీయలేని సంబంధం ఉంది. ఆయన ఆస్తి విలువ రూ.35వేల కోట్లు. దీన్లో సింహ భాగం స్టాక్‌ మార్కెట్‌ ద్వారానే సంపాదించారు. అందుకే రాకేష్‌ని ‘బిగ్‌ బుల్‌’, ‘వారెన్‌ బఫేట్‌ ఆఫ్‌ ఇండియా’ అని చెబుతుంటారు. త్వరలో ‘ఆకాశ’ సంస్థద్వారా విమానయాన రంగంలోకి అడుగుపెడుతున్నారు రాకేష్‌... మరోవైపు ‘ఫౌండేషన్‌’తో సేవాపథాన్ని సిద్ధం చేస్తున్నారు. రాకేష్‌ ప్రయాణాన్ని ఔత్సాహిక మదుపర్లే కాదు, కలల్ని నిజం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

రాజస్థాన్‌లోని ఝున్‌ఝును ప్రాంతం నుంచి ముంబయికి వలస వచ్చిన మార్వాడీ కుటుంబం మాది. కుటుంబ సభ్యులంతా ఇప్పటికీ సొంతూరు వెళ్లొస్తూ మేం పోషకులుగా ఉన్న ఆలయంలో పూజలు చేస్తుంటాం. నాన్న రాధేశ్యామ్‌ ఆదాయపు పన్నుల శాఖలో ఉద్యోగి. ఆయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉన్నపుడు నేను అక్కడే పుట్టాను. నలుగురు పిల్లల్లో చిన్నవాణ్ని. నాకు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. నాకు రెండున్నరేళ్లపుడు నాన్నకు ముంబయి బదిలీ అయింది. అప్పట్నుంచీ నా జీవితం ఆ నగరంలోనే. నాన్నకు స్టాక్‌ మార్కెట్‌లో మదుపుచేసే అలవాటుంది. ఇంటి దగ్గర తన స్నేహితులతో ఆ విషయాల్ని తరచూ చర్చించేవారు. వారి మాటల్ని నేను ఓ చెవితో వింటుండేవాణ్ని. స్టాక్‌ ధరల్లో హెచ్చుతగ్గులు ఎందుకు వస్తాయో తెలుసుకోవాలన్న కుతూహలం నాకు కలిగింది. ఆ విషయమే నాన్నని అడిగితే... ‘ఆ కంపెనీ వార్తల్లో ఉన్న తీరునిబట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. వార్తల్నీ, షేర్లనీ జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంద’ని చెప్పారు. 12-13 ఏళ్లు ఉన్నప్పట్నుంచీ వార్తల్నీ-షేర్లనీ గమనించడం మొదలుపెట్టా. 17 ఏళ్లు వచ్చేసరికి మార్కెట్‌లో మదుపు చేయడం ప్రారంభించా. డిగ్రీ తర్వాత ట్రేడింగ్‌నే కెరీర్‌గా ఎంచుకుంటానని నాన్నతో చెబితే... ‘మనకి కుటుంబ వ్యాపారాలూ, తరగని సంపదా లేవు. నీకు ఇష్టమైన పని చేయడాన్ని కాదనను. అయితే, స్టాక్‌ మార్కెట్‌ రిస్కుతో కూడుకున్నది. నువ్వు అక్కడ నిలదొక్కుకుంటే సరే, లేకపోతే ఏంటన్నది కూడా ఆలోచించాలి. అందుకే సీఏ పూర్తిచెయ్యి’ అని చెప్పారాయన. అమ్మ కూడా ‘షేర్లంటేే, పిల్లని కూడా ఇవ్వరెవ్వరూ’ అంది. వారి సూచనల్ని పాటిస్తూ సీఏకు దరఖాస్తు చేసుకున్నా. 1984లో సీఏ చేస్తున్నపుడు నెలకు తొంభై రూపాయలు స్టైపెండ్‌ వచ్చేది. నెలవారీగా కొంత మొత్తం రావడం అప్పుడే చూశా. ఎందుకంటే ఆ తర్వాత నేనెపుడూ ఉద్యోగం చేయలేదు.

ఐదు వేలతో మొదలు...

సీఏ పూర్తిచేశాక 1985లో స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌కు సిద్ధమయ్యా. ఆ సమయంలోనే బ్యాంకింగ్‌ రంగం మేలని కొందరు సలహా ఇచ్చారు. నేను మాత్రం వాటిని పట్టించుకోలేదు. షేర్లు కొనడానికి ఆ సమయంలో నా దగ్గర డబ్బుల్లేవు. నాన్నని కలిసి కొంత డబ్బు ఇవ్వమని అడిగితే, అందుకు నిరాకరిస్తూనే... ‘నీకు నచ్చినన్ని సంవత్సరాలు పైసా ఇవ్వకుండా ఇంట్లో ఉండొచ్చు. డబ్బులు మాత్రం నన్ను అడగొద్దు’ అని బదులిచ్చారు. అంతేకాదు, సీఏగా ఎప్పుడూ మరో ద్వారం తెరిచే ఉంటుంది కాబట్టి నిర్భయంగా ట్రేడింగ్‌ చేయమని సూచించారు. ఆరోజు నుంచీ అమ్మానాన్న బతికున్నంత వరకూ వారితోనే ఒకే ఇంట్లో ఉన్నాను. నాన్న కాదనడంతో ఛార్టెర్డ్‌ అకౌంటెంట్‌గా ప్రాక్టీసు చేస్తున్న అన్నయ్య రాజేష్‌ దగ్గర రూ.5000 అప్పుగా తీసుకుని ట్రేడింగ్‌ మొదలుపెట్టా. ఒక కంపెనీ సాధించిన ప్రగతినీ, వ్యవస్థాపకుల్లోని పోటీతత్వాన్నీ పరిగణనలోకి తీసుకుని మదుపు చేయాలనుకున్నా. అప్పటికి స్టాక్‌ మార్కెట్‌ సూచీ 150 పాయింట్లు. మార్కెట్‌ చాలా మందకొడిగా సాగేది. మొదట టాటా పవర్‌, టాటా టీ షేర్లు కొన్నా. ముఖ్యంగా టాటా టీ షేరుతో మూడు నెలల్లోనే మూడు రెట్ల లాభం వచ్చింది. ఆ లాభాలతో ఇనుము తవ్వకం జరిపే ‘సెసా గోవా’లో నాలుగు లక్షల షేర్లు కొన్నా. ఏడాది తర్వాత పావు వాటా మాత్రమే ఉంచుకుని మిగతావి అమ్మేశా. ఆ డబ్బుని వేర్వేరు కంపెనీల్లో పెట్టా. వాటిలో టైటాన్‌ నాకు ఊహించని లాభాల్ని తెస్తూ వచ్చింది. ముఖ్యంగా భారత్‌ అభివృద్ధి వైపు జోరుగా పరుగులు తీస్తున్నపుడు మదుపరిగా ఉండటం అనుకూలించింది. 1993 నాటికి మార్కెట్‌లో నా షేర్ల విలువ రూ.200కోట్లకు పెరిగింది. రాజకీయ అనిశ్చితి, కార్గిల్‌ యుద్ధం, వైటూకే భయంవల్ల 1996-2002 మధ్య స్టాక్‌ మార్కెట్‌ సూచీ కొన్నేళ్లపాటు పడకేసింది.   దాంతో 2002 నాటికీ నా షేర్ల విలువ రూ.250కోట్లుగానే ఉంది. మార్కెట్‌ పడినపుడు పెట్టుబడి పెంచడం, పైకెగిసినపుడు లాభాలు స్వీకరించడం నేను పాటించే నియమం. అందుకే సూచీ పడుతున్న సమయంలో అప్పుచేసి మరీ మార్కెట్‌లో పెట్టా. 2002 నాటికి నా షేర్లలో 40 శాతం అప్పులతో కొన్నవే. 2002-03లో మళ్లీ అనుకూల పవనాలు రావడంతో ఏడాదిలో మా షేర్ల విలువ రెట్టింపు కంటే ఎక్కువైంది. ఓవైపు  ట్రేడింగ్‌ చేస్తూనే ‘రేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ పేరుతో బ్రోకరేజీ సంస్థనూ ప్రారంభించా.

మూడుసార్లు రెట్టింపు...

1990-91, 2002-03, 2020-21... ఆర్థిక సంవత్సరాల్లో నా షేర్ల విలువ దాదాపు రెట్టింపు అవుతూ వచ్చింది. స్థిరాస్తి, మైనింగ్‌, రిటైల్‌, ఆయిల్‌, వైద్యసేవలు, బ్యాంకింగ్‌, తయారీ, ఔషధతయారీ రంగాల్లో ఎక్కువగా షేర్లు కొంటా. 2003-04లో సిమెంట్‌ కంపెనీల షేర్లు బాగా పెరిగాయి. దాన్ని  ఊహించలేకపోయా. కాబట్టి నా ఆలోచనలూ వంద శాతం కచ్చితంగా ఉంటాయనుకోవడానికి లేదు. ‘డి-మార్ట్‌’ వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ, ఆయన సోదరుడు రమేష్‌, రాజీవ్‌ షా... మేమంతా చర్చించుకుని షేర్లను కొనుగోలు చేసేవాళ్లం. నా ఆస్తి (ఫోర్బ్స్‌ అంచనా రూ.35వేల కోట్లు)లో అధిక భాగం మార్కెట్లో షేర్ల రూపం(రూ.20వేల కోట్లు)లోనే ఉంది. కొన్ని షేర్లతో నాది దశాబ్దాల అనుబంధం. రూ.1.5లక్షల కోట్ల విలువ చేసే టైటాన్‌ మార్కెట్‌ విలువలో నాకూ, రేఖకూ 4.8 శాతం వాటా(రూ.7200కోట్లు) ఉంది. టాటా మోటార్స్‌లో రూ.1500 కోట్లు, రేటింగ్స్‌ సంస్థ క్రిసిల్‌లో రూ.1000 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. కొన్ని షేర్లలో డబ్బు పోగొట్టుకున్నా కానీ, దాన్ని అనుభవంగానే భావించాను తప్ప నష్టంగా చూడలేదు.

పరిస్థితి మారుతుంది!

ట్రేడింగ్‌ చేసే తీరు మానసిక, వాస్తవ అంశాలపైన ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌ అంటేనే రిస్కు. నేను ఆ రిస్కుకి సిద్ధపడే వచ్చా. మార్కెట్‌లో రూ.5000 అప్పుచేసి పెట్టడమే జీవితంలో నేను చేసిన అతిపెద్ద రిస్కు. జ్యువెలరీ, బ్యాంకింగ్‌, ఫార్మా, హోటల్స్‌, అంకుర సంస్థలు ఇలా ప్రతి రంగం గురించీ లోతుగా తెలుసుకోవడం కష్టమే. అయినా నిత్యం సమాచారం సేకరిస్తూ కొత్తగా పెట్టుబడులు పెడతా. అలాగని పెద్ద ప్రణాళికలేవీ వేసుకోను. ప్రతిసారీ విజయవంతం కాలేం. నేర్చుకుంటూనే ఉండాలి. అరుదుగా స్టాక్‌ మార్కెట్‌ బయటా పెట్టుబడులు పెడతా. నిర్మాతగా మారి బాలీవుడ్‌లో సినిమాలూ (ఇంగ్లిష్‌-వింగ్లిష్‌, షమితాబ్‌, కీఅండ్‌కా) తీశా. త్వరలో ‘ఆకాశ’ పేరుతో ఓ విమానయాన సంస్థని మొదలుపెడుతున్నా. దీన్లో నా పెట్టుబడి రూ.300కోట్లు(40 శాతం) ఉంటుంది. భారతీయుల తలసరి ఆదాయం ఇంకాస్త పెరిగితే చాలు విమానయానం చేసేవాళ్లు ఒక్కసారిగా రెట్టింపు అవుతారు. వారిని ఆకర్షించేలా అత్యంత చౌక ధరల విమానయాన సంస్థని వచ్చే ఏడాది తేబోతున్నాం. చాలామంది ఈ రంగంలో నష్టపోతున్న కంపెనీల్ని గుర్తు చేస్తున్నారు. స్టాక్‌ మార్కెట్‌లోనూ చాలామంది నష్టపోతున్నారని వాళ్లకి బదులిస్తున్నా. ఏటా లక్షల మంది పిల్లలు జన్మిస్తున్నారు. వారి ఆరోగ్యం, చదువులూ, ఉద్యోగాలూ, సరదాలూ, విలాసాలూ, కనీస అవసరాలే మనకు అవకాశాలు. వ్యాక్సినేషన్‌ పూర్తయితే మన ఆర్థిక రంగం పుంజుకుంటుంది. భారత్‌ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యం, యుద్ధాల్లాంటి ఒడుదొడుకుల్ని తట్టుకుని నిలబడింది, కరోనానూ దాటుతుంది. విదేశీ పెట్టుబడిదారులు డబ్బు పట్టుకుని ఇండియా వైపు చూస్తున్నారు. నేను యువతకు ఒకటే చెబుతా... దేశం గురించి ఆశావాదంతో ఉండండి. మనం అద్భుతమైన ప్రగతిని చూడబోతున్నాం. త్వరలోనే 10 శాతం వృద్ధి సాధిస్తాం. నేను అదృష్టాన్ని నమ్ముతాను. అయితే, మనం శ్రమించడం మానేయకూడదు. మెదడుకు పని చెప్పండి. రిస్కులకు సిద్ధపడండి. కాకపోతే అవి కోలుకోలేనివిగా ఉండకూడదు.

సేవా పథంలో...

ఒకరోజు మాటల మధ్యలో సంపదను పంచాల్సిన బాధ్యతని చెప్పారు నాన్న. ‘నీనుంచి నాకు రూపాయి కూడా వద్దు. నా ఆదాయం నాకు చాలు. కానీ నువ్వు సమాజానికి తిరిగి ఇవ్వాల్సిందే’ అనిగట్టిగా చెప్పారు. అప్పట్నుంచీ ఇతోథికంగా సాయం చేస్తూ వచ్చా. 2008లో నాన్న చనిపోయాక ఆయన ఆత్మశాంతి కోసం సాధ్యమైనంత మేర దానం చేయాలనుకున్నా. అప్పట్నుంచీ నా నికర ఆదాయంలో 25 శాతం దానంగా ఇస్తూ వస్తున్నా. నాది మధ్య తరగతి జీవనశైలి. కాబట్టి డబ్బు తక్కువైందన్న ఇబ్బంది లేదు. విద్య, వైద్య రంగాలకు ఆర్థిక సాయం అందిస్తుంటా. ప్రయోగాలతో సైన్స్‌ విద్యను ప్రోత్సహించే ‘అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌’కు కొన్నేళ్లుగా ఆర్థికంగా మద్దతు ఇస్తున్నా. పిల్లల్లో సైన్స్‌ పట్ల కుతూహలం పెరిగితే వారు భవిష్యత్తులో దేశ ముఖచిత్రాన్ని మార్చగలరనేది నా ఉద్దేశం. ఈ ఏడాది జూన్‌లో ‘శంకర్‌ ఐ కేర్‌’తో కలిసి ముంబయిలో ‘ఆర్‌.ఝున్‌ఝున్‌వాలా శంకర్‌ ఐ హాస్పిటల్‌’ను ప్రారంభించా. ఇది లాభాపేక్షలేని సంస్థ. పేదలకూ, గ్రామీణులకూ సాయపడే మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకూ సాయం చేస్తున్నా. రూ.500 కోట్ల నిధులతో ఫౌండేషన్‌ను స్థాపించి వైద్య రంగంలో సేవలు అందించడానికి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నా. నా దగ్గర ఉన్న డబ్బుని విలాసాలకు ఖర్చు చేయడం ఇష్టం లేదు. దేవుణ్ని డబ్బు గురించి ప్రార్థించను. నా దగ్గరున్న సంపదను పంచే శక్తిని ఇవ్వమని అడుగుతా.


పశ్చాత్తాప పడుతున్నా...!

నా శ్రీమతి పేరు రేఖ. మా స్టాక్‌ బోక్రింగ్‌ సంస్థకు ‘రాకేష్‌- రేఖ’లలోని ఆంగ్ల అక్షరాలను కలిపి ‘రేర్‌’ అని పేరు పెట్టా. నా విజయంలో తన పాత్ర కూడా ఉంది. తనకు సహనం, ఓపిక ఎక్కువ. అమ్మానాన్నలకు నలుగురు పిల్లలం. కానీ అమ్మకు ఆరోగ్యం బాగాలేక మంచం పట్టి నపుడు తనే దగ్గరుండి అన్నీ చూసుకునేది. మాకో అమ్మాయి. మా పెళ్లి అయిన 17 ఏళ్లకు 2004లో పుట్టింది. 2009లో అబ్బాయిలు(కవలలు) పుట్టారు. పిల్లలకి మధ్య తరగతి జీవనశైలిని అలవాటు చేస్తున్నా. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలు చదివే స్కూల్లోనే చేర్పించా. ఒకప్పుడు వారాంతాల్లో రేసుల్లో పాల్గొనేవాణ్ని. అర్ధరాత్రి దాటాక ఇంటికి వచ్చేవాణ్ని. దాంతో నా భార్య ఇబ్బంది పడేది. పిల్లలు పుట్టాక వారాంతాలు వారికోసం కేటాయిస్తున్నా. జీవితంలో పశ్చాత్తాప్పడే అంశాలు ఏవైనా ఉన్నాయంటే నా అలవాట్లే. సిగరెట్లూ, మందూ ఎక్కువగా తాగేవాణ్ని. తిండిపైనా నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు సిగరెట్లు మానేశా. మందూ, తిండీ తగ్గించేశా. కానీ అప్పటికే వాటివల్ల కొంతమేర ఆరోగ్యం పాడైంది. గతాన్ని మార్చుకునే ఆస్కారం నాకు లేదు. కానీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం యువతకు ఉంది. అందుకే ఈ మాటలు చెబుతున్నా!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని