సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే క‌లిగే 5 ప్రయోజనాలు

పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) లేక‌పోవ‌డం వంటివి గృహ కొనుగోలు దారుల‌ను సిద్ధంగా ఉన్న గృహాల వైపు ఆక‌ర్షిస్తున్నాయి  

Published : 18 Dec 2020 16:52 IST

గ‌త కొంత కాలంగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో, ముఖ్యంగా రెసిడెన్షియల్ విభాగంలో మంద‌గింపు క‌నిపిస్తుంది. అమ్మకాలు గ‌రిష్ట‌స్థాయి నుంచి 10 శాతం మేర త‌గ్గాయి. డెవలపర్లు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వెన‌క‌డుగు వేస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా డీఎల్ఎఫ్ లిమిటెడ్ మాత్రం ‘ది అల్టిమా’ పేరుతో నిర్మిస్తున్న‌ విలాస‌వంత‌మైన గృహ నిర్మాణ ప్రాజెక్ట్ రెండ‌వ ద‌శ‌ను ప్రారంభించ‌డం మాత్ర‌మే కాకుండా మొద‌టి రోజునే 75 శాతం యూనిట్ల‌(మొత్తం 504 యూనిట్ల‌లో 376 యూనిట్లు)ను విక్ర‌యించ గ‌లిగింది. ఈ ప్రాజెక్లులో రూ.1.6 కోట్ల‌కు పైన విలువ చేసే మూడు, నాలుగు బెడ్‌రూమ్‌ల‌తో కూడిన ప్లాట్లు కూడా ఉండ‌డం విశేషం.

రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ మంద‌గ‌మ‌నంలో ఉన్న స‌మ‌యంలో డీఎల్ఎఫ్ సంస్థ ప్లాట్ల‌ను ఏవిధంగా విక్ర‌యించ‌గ‌లిగింది. ప్రాజెక్ట్ ఇప్ప‌టికే పూర్త‌వ‌డ‌మే ఇందుకు ముఖ్య కార‌ణంగా చెప్పుకోవ‌చ్చు. ప్లాటు కొనుగోలు చేసిన వెంట‌నే కొత్త ఇంటికి మారేందుకు అవ‌కాశం ఉంటుంది. గురుగ్రామ్ రియ‌ల్ ఎస్టేట్ డెవ‌ల‌ప‌ర్, ఎమ్‌3ఎమ్ గ్రూప్ డైరెక్ట‌ర్ పంకజ్ బన్సాల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సిద్ధంగా ఉన్న గృహాల‌కు డిమాండ్ ఎక్కువ‌గా ఉంద‌ని, పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) ప్ర‌యోజ‌న్, కొనుగోలు చేసిన వెంట‌నే ఇంటిని వినియోగించుకునే అవ‌కాశం వంటివి ముఖ్య‌కార‌ణాల‌ని బ‌న్సాల్ తెలిపారు.

అయితే త‌గిన మొత్తంలో లిక్విడిటీ ఉన్నసంస్థ‌లు మాత్ర‌మే ఇంటిని పూర్తి స్థాయిలో నిర్మించి అమ్మకాలు జ‌రుప‌గ‌లుగుతాయి. ఏదేమైనా, మంద‌గమ‌నం కార‌ణంగా ప్ర‌స్తుత మార్కెట్‌లో సిద్ధింగా ఉన్న గృహాల‌కు కూడా కొర‌త లేదు. అంతేకాకుండా రాబోయే కొద్ది నెల‌ల కాలంలోనే కొత్త ప్రాజెక్టులు కూడా వ‌స్తాయ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేయ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు:

  1. నిర్మాణం ఆలస్యమవుతుందనే భయం ఉండదు:
    మీరు వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేసినట్లయితే, నిర్మాణం ఆల‌స్యం వంటి ఇబ్బంది నుంచి బయటపడతారు. మీరు అపార్ట్మెంట్, ఇతర సౌకర్యాలను పూర్తి చేసే వరకు వేచి ఉండవలసిన అవసరం లేదు.
    రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ (ఆర్ఈఆర్ఏ) 2016 అమలులో ఉండడంతో, డెవలపర్లు సమయపాలనకు కట్టుబడి ఉండాల్సి ఉంటుంది, చాలామంది డెవలపర్లు తమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి సుమారు 5 నుంచి 6 సంవత్సరాల సమయం పడుతుందని తమ అధికారిక వెబ్ సైట్ ల ద్వారా తెలియచేశారు. కానీ గతంలో డెవలపర్లు ఇచ్చిన గడువు కేవలం మూడు సంవత్సరాలు.
    మరో మాటలో చెప్పాలంటే, ఇప్పటికే చాలా మంది డెవలపర్లు ప్రాజెక్ట్ పూర్తయ్యే సమయాన్ని తెలియచేశారు. ఒకవేళ డెవలపర్లు పేర్కొన్న గడువు తేదీలోగా ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే, ఆర్ఈఆర్ఏ కింద పెనాల్టీ లేదా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

  2. మీరు చూసినదాన్నే కొనుగోలు చేయ‌వ‌చ్చు:
    మీరు వినియోగానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసేటప్పుడు మొత్తం స్థలం, గదుల పరిమాణం, అపార్ట్మెంట్ వ్యూ , నిర్మాణ నాణ్యత, సౌకర్యాల లభ్యత, వంటి వాటిని పరిశీలించండి. "ప్రాజెక్టు నాణ్యతను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. వినియోగానికి సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్ వలన ప్రయోజనం ఏమిటంటే, దాని నిర్మాణాన్ని, నాణ్యతను దగ్గరగా చూసే అవకాశం ఉంటుంది. అదే నిర్మాణంలో ఉన్న ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు, మీరు నమూనా ఫ్లాట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, ఇది మిమల్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది.

  3. అద్దె లేదా ఈఎమ్ఐ:
    ఒకవేళ మీరు కొత్త ఇంటిని కేవలం పెట్టుబడి ప్రణాళికలో భాగంగా కొనుగోలు చేసి, దానిలోకి వెళ్లాలని భావించకపోతే, దానిని వీలైనంత త్వరగా అద్దెకు ఇచ్చి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఆదాయంగా పొందవచ్చు. మీరు తీసుకున్న రుణానికి సంబంధించిన ఈఎంఐలో కొంత భాగాన్ని చెల్లించడానికి అద్దె ద్వారా వచ్చే ఆదాయం సహాయపడుతుంది. ఒకవేళ మీరు స్వంత వినియోగం కోసం కొనుగోలు చేస్తే, మీరు ఇప్ప‌టి వ‌ర‌కు చెల్లిస్తున్న అద్దె త‌గ్గుతుంది. ఆ మొత్తాన్ని ఈఎమ్ఐ కోసం చెల్లించ‌వ‌చ్చు.

  4. జీఎస్టీకి చెల్లించ‌న‌వ‌స‌రం లేదు:
    జీఎస్‌టీ త‌గ్గిన త‌రువాత కూడా డ‌వ‌ల‌ప‌ర్లు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌(ఐటీసీ)తో 12 శాతం లేదా ఐటీసీ లేకుండా 5 శాతం జీఎస్‌టీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది. అదే స‌ర‌స‌మైన(అఫ‌ర్డ‌బుల్‌) గృహాల విష‌యంలో అయితే ఐటీసీతో క‌లిపి 8 శాతం, ఐటీసీ లేకుండా 1 శాతం జీఎస్‌టీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది.
    అయితే నిర్మాణంలో ఉన్న గృహాల‌కు మాత్ర‌మే జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. సిద్ధంగా ఉన్న ఇళ్ళ‌కు జీఎస్‌టీ వ‌ర్తించ‌దు. ఇందుకు స‌ద‌రు ఇంటికి ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ ఉండాలి.

  5. పన్ను ప్రయోజనం:
    ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం, సెక్షన్ 80 సీ కింద రుణగ్రహీత రూ. 1.5 లక్షల పన్ను మినహాయింపును పొందుతాడు. అలాగే స్వంత వినియోగం కోసం సెక్షన్ 24 (బీ) కింద వడ్డీ చెల్లింపులపై రూ. 2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. మొద‌టి సారి ఇల్లు, అఫ‌ర్డ‌బుల్ గృహాలు కొనుగోలు చేసేవారు అద‌న‌పు మిన‌హాయింపులు పొందే అవ‌కాశం ఉంది. అయితే, ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత, అలాగే రిజిస్ట్రేషన్ కూడా పూర్తై ఉండి, యాజమాన్య పత్రాలను పొందిన తరవాత మాత్రమే మీరు ఈ పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోగలరు. ఒకవేళ ఈ విధంగా చేయకపోతే మీరు పన్ను ప్రయోజనాలను పొందలేరు.
    నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇంటి రుణంపై కూడా మిన‌హాయింపును పొంద‌వ‌చ్చు. నిర్మాణం పూర్తై, ఇంటిని స్వాధీనం చేసుకున్న అనంత‌రం ఐదు స‌మాన వాయిదాల‌లో క్లెయిమ్ చేసుకునేందుకు వీలుంటుంది. కానీ ఒక‌వేళ ఇంటి నిర్మాణం ఐదు సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ కాలం ఆల‌స్యం అయితే, వ‌డ్డీ ఆదాయంపై సంవ‌త్స‌రానికి రూ.2 ల‌క్ష‌లు వ‌ర‌కు క్లెయిమ్ చేసుకోవ‌డానికి బ‌దులు రూ.30 వేలు మాత్ర‌మే క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అంతేకాకుండా నిర్మాణం ద‌శ‌లో ఉన్న ఇంటి రుణ అస‌లు చెల్లింపుపై కూడా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు కోల్పోతారు.

గుర్తుంచుకోండి:
సిద్ధంగా ఉన్న ఇంటికి కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ, నిర్మాణంలో ఉన్న ఇంటితో పోలిస్తే కొంచెం ఎక్కువ‌గా ఖ‌ర్చు చేయాల్సి రావ‌చ్చు. నిర్మాణ విలువ‌లు, గృహం ఉన్న ప్ర‌దేశం వంటి వాటి ఆధారంగా ఖ‌ర్చు పెర‌గ‌వ‌చ్చు. అంతేకాకుండా నిర్మాణ ద‌శ‌లో ఉన్న ఇంటికి ద‌శ‌ల వారిగా చెల్లింపులు చేసే అవ‌కాశం ఉంటుంది. కానీ సిద్ధంగా ఉన్న ఇంటికి ఒకేసారి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని